– చర్చలకు పిలిచారు అరెస్టు చేశారు
– ఉదయం నుండి టెన్షన్
– అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, అరెస్టులు
(మండువ రవీందర్‌రావు)
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, బిఆర్‌ఎస్ పదేళ్ళ పాలనతీరు, గరుకుల టెండర్లలో గోల్‌మాల్ తదితర అంశాలపై గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. దీనిపై ఇరు పార్టీల నాయకులు చర్చలకు సిద్దమయ్యారు. చర్చించే స్థలాలను కూడా ఎంపిక చేసుకున్నారు. కాని, చర్చలు మాత్రం జరుగలేదు. సవాల్ చేసిన మంత్రులు, సవాల్ స్వీకరించిన బిఆర్‌ఎస్ నేతలను చర్చాస్థలానికి రాకుండా అడ్డుకున్నారు. మధ్యలో పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో పోలీసులకు బిఆర్‌ఎస్ శ్రేణులకు మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తోపులాటలో బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కింద పడబోయారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా పోలీసులు హరీష్‌రావును, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టుచేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలనపై చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాలెంజీ చేయడం ఈ ఎపిసోడ్‌కు దారితీసింది. పదేళ్ళ తమ పాలనతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గురుకుల విద్యాసంస్థల్లోని అవినీతిపై చర్చించేందుకు బిఆర్‌ఎస్ సవాల్‌ను స్వీకరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని, అందుకు రాహుల్‌గాంధీనికూడా చర్చకు తీసుకురావాలని బిఆర్‌ఎస్ పేర్కొంది. అయితే బిఆర్‌ఎస్ అవినీతిపై చర్చించేందుకు సిఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అవసరంలేదని, తాను వస్తానంటూ మంత్రి జూపల్లి క్రిష్ణారావు పేర్కొంటూ గురువారం ఉదయం పదకొండు గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌కే వస్తాననడంతో తెలంగాణ భవన్‌వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే తనతో చర్చించేందుకు కెటిఆర్‌తోపాటు హరీష్‌రావుకూడా ఉండాలన్న షరతు విధించారు జూపల్లి. అందుకు బిఆర్‌ఎస్ నాయకత్వం సిద్దపడింది. మంత్రి జూపల్లి వస్తే ఆయన్ను సగౌరవంగా ఆహ్వానించేందుకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకమైన ఆసనం, సన్మానించడానికి శాలువను బిఆర్‌ఎస్ సిద్దం చేసింది. జూపల్లి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని పోలీసు బందోబస్తు నిర్వహించింది. కాని, తెలంగాణ భవన్‌కు రాకుండా వారిని గన్‌పార్క్‌కు జూపల్లి ఆహ్వానించారు. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు హరీష్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు మరికొందరు పార్టీ నేతలు గన్‌పార్క్‌కు బయలు దేరగా పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. తమతో చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్‌లు గన్‌పార్క్ దగ్గర ఎదురు చూస్తున్నారు. తమను వెళ్ళనివ్వాలని బిఆర్‌ఎస్ వర్గాలు ఎంత చెప్పినప్పటికీ పోలీసులు వారిని వెళ్ళనివ్వలేదు. దాంతో కాసేపు ఇరువర్గాల మద్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌తోపాటు మరికొందరిని అరెస్టుచేసి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించిన అనంతరం వారిని విడిచిపెట్టారు. 
తమను చర్చలకు ఆహ్వానించి, పోలీసు బలగాలతో అడ్డుకోవడమేంటని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ద్వజమెత్తారు. ప్రతిపక్షాలను ఎదుర్కునే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని, అందుకే చర్చలకు ఆహ్వానించి తోకముడిచిందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. తాను సిఎంతో చర్చకు సిద్దమంటే.. మద్యలో పిలువని పేరంటంలా మంత్రి జూపల్లి క్రిష్ణారావు దూరాడన్నారు. అయినా తాము చర్చించేందుకు సిద్దమైనప్పటికీ పోలీసులతో అడ్డుకోవడంపైన ఘాటుగా స్పందించారు. వాస్తవాలను బహిరంగ వేదికలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యంలేదని ఆయన విమర్శించారు. నిజంగానే ప్రభుత్వానికి చర్చించాలన్న చిత్తశుద్ధి ఉంటే తనకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి చర్చించాలనుకున్న గన్‌పార్క్‌కు ఆహ్వానించాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే రాష్ట్ర అప్పులపై సమగ్ర చర్చ జరుగాలనుకుంటే దీనిపై ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెట్టాలన్నారు. అసెంబ్లీలో కూడా తమకు సమగ్రంగా మాట్లాడే అవకాశమివ్వాలని అప్పుడే ప్రజలకు వాస్తవమేంటో అర్థమవుతుందన్నారు. అసెంబ్లీలో అడుగడుగున తమ మాటలకు అడ్డంపడుతూ చర్చ జరుగకుండా చేసేవిధానాన్ని మానుకోవాలన్నారు. కాగా, చర్చలకు ఆహ్వానించిన మంత్రి జూపల్లి పోలీసులను అడ్డుపెట్టుకుని పారిపోయాడంటూ, ఆయనకు మంత్రిగా కొనసాగే అర్హతలేదని, వెంటనే రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీష్‌రావు డిమాండ్ చేశారు. తమను చర్చకు రమ్మనమని, ఆరెస్టు చేయడంపై స్పందిస్తూ, ఈ విషయంపై తమను ఆహ్వానించిన ముగ్గురు మంత్రులకు ఫోన్‌చేస్తే కనీసం వారు స్పందించకపోవడాన్ని బట్టి ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధిలేదన్నది స్పష్టమవుతున్నదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలనిచ్చిన ఈ ప్రభుత్వం వాటిని నెరవేర్చలేదన్నారు. జూపల్లి బాండ్‌పేపర్‌పైన ఇచ్చిన హామీలనుకూడా నిలుపుకోలేదన్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ మంత్రులు బిఆర్‌ఎస్‌పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకుల పాఠశాలలకు చెందిన టెండర్ల విషయంలో రెండు వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ చేసిన ఆరోపణ రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారింది. దీనిపై రాష్ట్ర మంత్రుల అడ్లూరి లక్ష్మణకుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లు స్పందించారు. ఆ ఆరోపణ వారులపై తీవ్రంగా స్పందించిన ఈ ముగ్గురు మంత్రులు గన్‌పార్క్ వద్దకు చేరుకునప్పటికీ పోలీసులు బిఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడంతో చర్చలు జరగలేదు. ఫలితంగా ఆరోపణలకే పరిమితమైంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





