సమ‌గ్ర సర్వేలో సవరణలపై కార్యాచరణ ప్రకటించాలి

– ‘వందశాతం పక్కా’ అన్న సర్వేలో ఇప్పుడు సవరణలా?

– లోపాలు సరిదిద్దకుండా దేశానికి ‘రోల్ మోడల్’ ఎలా అవుతుంది?
– బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్‌ వకుళాభరణం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల ఇంటింటి సర్వే (ఎస్ఈఈఈపీసీ)లో జనాభా వివరాలు తప్పుగా నమోదై ఉంటే సరిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా వెంటనే కార్యాచరణ ప్రకటించి చర్యలు చేపట్టాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్, సామాజిక శాస్త్రవేత్త డాక్ట‌ర్‌ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. కుటుంబాల నమోదు, కులాల పేర్లపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించకుండానే సర్వే సమాచారాన్ని వందశాతం పక్కా అని ఎలా ప్రకటించారని ప్ర‌శ్నించారు. రవీంద్రభారతిలో జరిగిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనాభా వివరాలపై అభ్యంతరాలున్న సంఘాలు సమాచారం అందిస్తే పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తామని చెప్పారన్నారు. ఈ సమస్యలను తాము ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా తగిన స్పందన రాలేదన్నారు. సవరణలకు సిద్ధమని ఇప్పుడు చెబుతున్న ప్రభుత్వం గతంలో వచ్చిన ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాల‌న్నారు.

స్టిక్కర్ అంటిస్తే సర్వే పూర్తయినట్లా?
ఇళ్లకు స్టిక్కర్లు అంటించినప్పటికీ అనేక కుటుంబాల వివరాలతో ఫారాలు నింపలేదనే ఫిర్యాదులు ప్రజల నుండి బహిరంగంగా వచ్చాయని వకుళాభరణం గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చర్చతోపాటు పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర బీసీ కమిషన్ కూడా నమోదు కాని కుటుంబాలపై జీహెచ్ఎంసీ వివరణ కోరిందని గుర్తు చేశారు. మిగిలిపోయిన కుటుంబాలకు మరో అవకాశం ఇచ్చినా వాటిని చేరుకునే ప్రచారం, అవగాహన, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే యత్నాలు సరిగా జరగలేదనే విమర్శలు వచ్చాయని ఆయ‌న‌ అన్నారు. ప్రజల ఫిర్యాదులపై అప్పుడే స్పందించాల్సిన ప్రభుత్వం విజయ ప్రకటనలకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ఈ సమస్య అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినదని స్పష్టం చేశారు. బెస్త, గంగపుత్ర, గూండ్ల తదితర అధికారిక పేర్లను నిపుణుల నివేదికలో అగ్నికుల క్షత్రియ అనే సంక్షిప్త పేరుతో చూపించడంపై సంఘాలు అభ్యంతరం తెలిపాయన్నారు. కొన్ని పేర్లను సరిగా చూపించలేదని ప్రస్తుత రాష్ట్ర బీసీ కమిషన్ కూడా బహిరంగంగా పేర్కొని సవరణల అవసరాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అధికారిక జాబితాలో ఒకే ఎంట్రీ కింద ఉన్నంత మాత్రాన అందులోని గుర్తింపు పొందిన పేర్లన్నింటినీ మొదట ఉన్న పేరుతో భర్తీ చేయడం సరికాదన్నారు. ప్రణాళిక శాఖ సర్వే నిర్వహించగా ఆ సమాచారాన్ని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం విశ్లేషించిందని వకుళాభరణం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన డెడికేటెడ్ కమిషన్ పాత్రను నామమాత్రం చేసి చట్టబద్ధమైన రాష్ట్ర బీసీ కమిషన్ నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించుకోలేదన్నదే త‌న అభ్యంతరం అన్నారు. కులాల పేర్లు, పర్యాయ నామాల విషయంలోనైనా బీసీ కమిషన్‌తో సమగ్ర పరిశీలన జరిపి ఉంటే ఈ వివాదాలను ముందే నివారించే అవకాశం ఉండేదన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏ సమాచారాన్ని పరిశీలించింది, తన సిఫారసుల‌కు ఎలా చేరుకుంది, బిల్లుల రూపకల్పనలో వాటిని ఎలా ఉపయోగించారో ప్రభుత్వం వివరించాలన్నారు. ఫారం నింపినప్పుడు తప్పు జరిగిందా, కంప్యూటర్‌లో నమోదు చేసినప్పుడు జరిగిందా, నివేదిక తయారీలో జరిగిందా? సరిదిద్దే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం, దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకోవడం ప్రచార ఆర్భాటమే అని విమర్శించారు. మొత్తం సర్వేను తిరిగి చేయాలని కోరడం లేదు.. నమోదు కాని కుటుంబాలను చేర్చండి.. కులాల పేర్లపై అభ్యంతరాలను పరిష్కరించండి.. చేసిన సవరణలను ప్రజలకు వెల్లడించండి అని వకుళాభరణం డిమాండ్ చేశారు. ఇందుకు గడువు, బాధ్యత వహించే అధికారులను ప్రకటించి, సంబంధిత శాఖలు, కమిషన్ల మధ్య సమన్వయంతో చర్యలు పూర్తి చేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధి మాటల్లో కాక అమలు చేసిన సవరణల్లో కనిపించాలని వకుళాభరణం స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *