– ఏడింటిపై కేసులు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ అధికారి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఓఎస్‌డీ కమలాసన్ రెడ్డి కరీంనగర్ పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించడంతో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులు నమోదు చేశారు. ఆ ఏజెన్సీలకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడంతో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(4)తోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం-2005లోని సెక్షన్ 20, 22 కింద ఎఫఐఆర్‌లు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు. లైసెన్స్ లేకుండా ఏజెన్సీలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. భద్రతా సిబ్బందిని నియమించుకునే ముందు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్‌తోపాటు, వారికి కనీసం 21 రోజుల ప్రాథమిక భద్రతా శిక్షణ అందించిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల యజమానులు ప్రభుత్వం గుర్తింపు పొందిన, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగిన ఏజెన్సీల నుంచే భద్రతా సేవలను పొందాలని ఆయన సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





