రాష్ట్రంలో స‌మృద్ధిగా ఖనిజనిక్షేపాలు

2023-24 నాటికి 5,440 కోట్లకు ఆదాయం
32 పెద్ద లైమ్ స్టోన్, మాంగనీసు ఖనిజ బ్లాక్‌ల వేలానికి కార్యాచరణ
3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్రం లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్ట్‌జ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ నిక్షేపాలతో సమృద్ధిగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ కేంద్రంగా జరుగుతున్న మూడవ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2014లో ఖనిజ ఆదాయం రూ.1,958 కోట్ల ఉండగా 2023 -24 నాటికి రూ.5,540 కోట్లకు పెరిగిందని తెలిపారు. 2024-25,  2025- 26 సంవత్సరాల్లో లైమ్‌ స్టోన్, మాంగనీస్ వంటి 32 పెద్ద ఖనిజా బ్లాకుల వేలంపై కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమావేశంలో డిప్యూటీ సీఎం వివరించారు. ఈ 3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశం వంటి మహత్తర సమావేశంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాన‌ని ఈ  సమావేశాన్ని నిర్వహించినందుకు కేంద్ర గనులు, భూగర్భ శాఖ మంత్రిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. భారతదేశంలో ఖనిజ రంగం అనేది ఎంతో ప్రత్యేకమైనద‌ని, ఎందుకంటే ఇది అనేక అవకాశాలను మన ముంగిట్లోకి తెస్తుంద‌న్నారు. ఖనిజాలు అనేవి విలువైన ప్రకృతి సంపదలు. అవి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముడిసరుకుగా ఉంటాయి. ఖనిజాల అన్వేషణ, అకర్షణ, నిర్వహణ అనేవి జాతీయ, రాష్ట్ర లక్ష్యాల ప్రకారం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఖనిజాలు ఆర్థిక అభివృద్ధి  సమగ్ర వ్యూహంలో భాగస్వామ్యంగా ఉండి, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దిగుమతి పై ఆధారాన్ని తగ్గించేందుకు దోహదపడాలని తెలిపారు. ఆచార్య కౌటిల్యుడు, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో, తన అర్థశాస్త్రంలో “ఖనిజ సంపదలు దేశ శక్తి, శౌర్యాన్ని సూచిస్తాయని పేర్కొన్న విషయాన్ని సమావేశంలో భట్టి విక్రమార్క ప్రస్తావించారు.
ఖనిజాలు అనేవి మన రోజువారీ జీవితంలో ప్రధాన అవసరమైన ముడిసరుకులుగా ఉండి, ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక అభివృద్ధికి కీలకమైనవిగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,552 మైనింగ్, ఖనిజ గనుల లీజులు ఉన్నాయని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో నదీ తీరంలోని మట్టి/మెట్ట ఖనిజాల కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించామని, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పర్యావరణ, ఇతర నియమ నిబంధనలకు అనుగుణంగా అనుమతి తీసుకుని ఇసుక తవ్వడం, ప్రజలకు పారదర్శకంగా, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. 2024లో సూర్యాపేట జిల్లాలో 2 లైమ్ ‌స్టోన్ బ్లాక్‌లను వేలం వేసి విజయవంతమైన బిడ్డర్లకు పత్రాలను జారీ చేసినట్టు తెలిపారు. చిన్న ఖనిజాల లీజుల మంజూరు విషయంలో అవసరమైన అనుమతులతో కూడిన బ్లాక్‌ల వేలం విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఖనిజ వనరుల ఆడిట్ కోసం డిజిపిఎస్ సర్వే , ఈటీఎస్ సర్వే పూర్తయ్యాయన్నారు.

ఓఎంఈపీపీఎస్ ద్వారా ఆన్‌లైన్ మినరల్ ఈ-పేమెంట్, ఈ-పర్మిట్ వ్యవస్థ గత 10 సంవత్సరాల నుంచి అమలు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వివరించారు. ఖనిజ రవాణా కోసం డీలర్ల ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్‌లను జెనరేట్ చేయడం 9 సంవత్సరాలుగా అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్మాణ పనుల్లో ఉపయోగించే రోడ్ మెటల్ వంటి ఖనిజాల కోసం జీరో పర్మిట్ విధానం గత సంవత్సరం నుంచి అమలు జరుగుతున్నట్లు తెలిపారు. అపిల్ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేయడం మరియు త్వరితంగా పరిష్కరించడం కూడా గత సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని తెలిపారు. టిజిఈ-మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లు ఖనిజ రవాణా వాహనాలను చెక్ చేసే సౌలభ్యం ఉందని వివరించారు. 2015 నుంచి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *