హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : అనేక దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి పెనుగొండ లక్ష్మీనారాయణ (Laxmi narayana) ఇతోధిక కృషి చేస్తున్నరని ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వొచ్చిన సందర్భంగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పాటు చేసిన పెనుగొండ సన్మాన సభకు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈసభలో పెనుగొండ లక్ష్మీనారాయణను శాలువా, మెమెంటో, గజమాలతో అరసం నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ పెనుగొండ లక్మీనారాయణ అనే దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి కృషి చేస్తున్నరని అన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడుగా పనిచేస్తూనే అనేక విమర్శ గ్రంథాలు రాశారని, ఆయన రాసిన దీపిక విమర్శ గ్రంథానికి అవార్డు రావడం అభినందనీయమన్నారు. అవార్డుకు ఆయన అన్నివిధాలుగా అర్హుడని కొనియాడారు.
నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు, ప్రముఖ రచయిత డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం అరసం జెండాను భుజాన వేసుకొని అభ్యుదయ సాహిత్యేద్యమంలో కొనసాగడం చిన్నవిషయం కాదని, ఆయన, ఆయన సాహిత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీతో ఎంతో విడదీయరాని అనుబంధం పెనుగొండది అని అన్నారు.
ఇంకా ఈ సభలో ప్రముఖ సినీగీత రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, అరసం అధ్యక్షులు పల్లేరు వీరస్వామి, కోయి కోటేశ్వర రావు, అరసం కార్యనిర్వహక కార్యదర్శి కెవిఎల్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ, అరసం నగర్ కార్యదర్శి చంద్రమోహన్ గౌడ్,తిరుపాల్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లేరు వీరస్వామి రాసిన వీక్షణం పుస్తకం ఆవిష్కరించారు.