ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతాం..

  • రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి15 : ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) అన్నారు. శనివారం ఖమ్మం కాల్వొడ్డులోని మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు.కేబుల్ బ్రిడ్జి పనులు రెండు వైపులా నుంచి సమాంతరంగా చేపట్టాలని, జూన్ లోపు ఎరక్షన్ పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం పట్టణానికి మణిహారంగా ఉండేలా హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద ఉన్న మాదిరిగా ఖమ్మం నగర ప్రధాన నది మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని అన్నారు. 180 కోట్లతో ప్రభుత్వం ఖమ్మం నగరంలో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తుందని, బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.141 కోట్లు, 39 కోట్లు భూ సేకరణ పరిహారానికి కేటాయించామన్నారు. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రారంభంలో ఆలస్యమయ్యాయని అన్నారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వర్షాకాలం కంటే ముందే తూర్పు భాగం పనులు పూర్తి చేసుకుంటామని, అనంతరం పడమర వైపు పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువొస్తామని చతెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ, చిన్న, చిన్న వ్యాపారులకు అవసరమైన సహకారం ప్రభుత్వ నుంచి అందించేందుకు కలెక్టర్ అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

బ్రిడ్జ్ నిర్మాణంలో ఎటువంటి ఆస్తి కోల్పోయిన జీవనోపాధి కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎవరు కూడా నష్టపోవడానికి వీలులేదని అన్నారు. కేబుల్ బ్రిడ్జ్ కు సంబంధించిన అప్రోచ్ రోడ్డు ను 6 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని అన్నారు. రహదారులు విశాలంగా ఉంటే పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు మంచి లాభం ఉంటుందని అన్నారు. ప్రజల కోరిక మేరకు ఖమ్మం నగరంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని అన్నారు. విశాలమైన రహదారులతో త్వరగా అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. బైపాస్ రోడ్డు, కస్బా బజార్ లో రోడ్డు విస్తరణ చేయడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైందని మంత్రి గుర్తు చేశారు.

ఆగస్టు 15 నాటికి ఖమ్మం మీదుగా రాజమండ్రి గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తవుతుందని అన్నారు. పొన్నెకల్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్డుకు జాతీయ రహదారికి అమరావతి రాజధాని రోడ్డు కనెక్ట్ చేస్తూ 120 కోట్లు మంజూరు చేసామన్నారు. ఖమ్మం పట్టణం ట్రాఫిక్ ఫ్రీ చేసే దిశగా రాజమండ్రి, అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం, వాటిని కనెక్ట్ చేసేందుకు కూడా పనులు మంజూరు చేసామని అన్నారు.సకాలంలో జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతంగా చేసేందుకు సహాయ, సహకారాలను కలెక్టర్ అందిస్తున్నారని, రోడ్డు నిర్మాణ పనులకు ప్రజలు, మీడియా పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. హేమలత, ఈ.ఈ. యుగేందర్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ రవి కుమార్, ఆర్ అండ్ బి డిఈ చంద్ర శేఖర్, జెఈ విశ్వనాథ్, విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి సిన్హా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి తుమ్మల

ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర, మార్చి 15 : కాల్వఒడ్డు లోని మదర్సా లో శనివారం ఇఫ్తార్ విందులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page