వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్రంలో టిబీ పేషెంట్లకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఉచితంగా అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పిలుపునిచ్చారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సర్జికల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ) ఆధ్వర్యంలో టిబి పేషెంట్లకు ఫుడ్ కిట్స్ (ఫుడ్ బాస్కెట్) లను అందించేందుకు అసోసియేషన్ తరపున 25 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేశారు.
తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అందించిన సిఎస్ఆర్ నిధులను పెద్దపెల్లి జిల్లాలోని టీబీ పేషెంట్లకు ఆరు నెలల పాటు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఖర్చు పెడుతున్నామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, టిజి ఎంఎస్ఐడిసి ఎండి హేమంత్, తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణి కుమార్, సభ్యులు జ్ఞానేశ్వర్, శ్రీధర్, ప్రసాద్ పాల్గొన్నారు.