– ‘నిమ్స్’ వైద్య బృందానికి సీఎం అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. ‘నిమ్స్’ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్‌లో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లూథియానా క్రిస్టియన్ కాలేజీ ఉండగా ‘నిమ్స’ మూడో స్థానంలో ఉంది. ఈ అరుదైన మైలు రాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన ‘నిమ్స్’ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ 2,000 మందిలో 1,900 మంది అంటే 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు కావడం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడేళ్ల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి ఈ హాస్పిటల్ రికార్డు నెలకొల్పింది.
వైద్యులకు మంత్రి దామోదర్ అభినందన
నిమ్స్ వైద్య బృందం సాధించిన ఈ ఘనత పట్ల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనూ అత్యాధునిక వైద్యం అందించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని నిమ్స్ నిరూపిస్తోందన్నారు. ఇటీవల గాంధీ హాస్పిటల్‌లో ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతోపాటు అత్యాధునిక వసతులతో కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌లో కూడా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీంతో ప్రభుత్వ రంగంలోనే అత్యాధునిక అవయవ మార్పిడి సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయన్నారు.
యూరాలజీ, నెఫ్రాలజీ విభాగంతోనే సాధ్యమైంది : డైరెక్టర్ బీరప్ప
దేశంలో రెండు వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసిన ప్రభుత్వ హాస్పిట్‌ల్‌గా ‘ నిమ్స్ ’ రికార్డు సృష్టించిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప శుక్రవారం ప్రకటించారు. నిమ్స్ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు, సిబ్బంది అద్భుతమైన పనితీరుతోనే ఈ అచీవ్‌మెంట్‌ను సాధించగలిగామన్నారు. అవయవ మార్పిడి అనంతరం జీవితాంతం అవసరమయ్యే మందులను కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిమ్స్ యూరాలజీ విభాగం హెడ్, డాక్టర్ రాహుల్ రాజ్‌ను బీరప్ప అభినందించారు. యూరాలజీ విభాగం ఆధ్వర్యంలోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. క్లిష్టమైన బహుళ రక్తనాళాల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, చిన్నారుల్లో ట్రాన్స్‌ప్లాంట్లు, రీ-ట్రాన్స్‌ప్లాంట్లు వంటి సవాలుతో కూడిన ఆపరేషన్లను యూరాలజీ టీమ్ విజయవంతంగా నిర్వహించిందన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో తొలి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా నిమ్స్‌లోనే నిర్వహించడం విశేషమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





