నిందితుడిని కాపాడిన నేరం రేవంత్‌దే

– బండి -రేవంత్ అనుబంధం వల్లనే ఆడబిడ్డకు అన్యాయం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 :తనకు అన్యాయం జరిగిందని ఓ ఆడబిడ్డ బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించి నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని మైనర్ బాలిక తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి తీవ్ర ఆవేదనకు గురిచేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వనని హైకోర్టు తెగేసి చెప్పడం, రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడంతోనే దిక్కులేని పరిస్థితుల్లో నిందితుడిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్ర హోం శాఖకు బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రి పర్యటన వల్ల పోలీసులంతా బిజీ ఉన్నారని అడ్డగోలు సాకులు చెప్పేందుకు సిగ్గుపడాలన్నారు. అత్యంత సున్నితమైన ఈ విషయంలో పార్టీ తరఫున మౌనంగా ఉన్నామని, ఏనాడూ రాజకీయం చేయలేదని కేటీఆర్ తెలిపారు. కానీ ముఖ్యమంత్రి తమపై విమర్శలు చేసిన తర్వాతనే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులు దాచిపెట్టిన సందర్భం ఎక్కడైనా ఉన్నదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం వల్లనే ఇద్దరూ కలిసి నిందితుడిని తొమ్మిది రోజులు దాచి ఉంచారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహితుడి హాస్పిటల్‌లో తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొడుకుతో తనకు సంబంధం లేదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నాడని, అంతటి దుర్మార్గమైన పరిస్థితి ఏ తండ్రికీ రావద్దని కేటీఆర్ అన్నారు. ఒకవైపు తన కొడుకుతో సంబంధం లేదని చెప్తూనే తిరిగి తానే పోలీసులకు అప్పజెప్పానని అనడం ఏంటో సమాధానం చెప్పాలన్నారు. పోక్సో కేస్ నిందితులు తొమ్మిది రోజులు తప్పించుకోలేరని, కేంద్ర మంత్రి కొడుకు కావడం, ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లనే తప్పించుకున్నాడని కేటీఆర్ అన్నారు. ఈ అంశంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అద్భుతంగా ప్రభుత్వాన్ని, మీడియాను అలర్ట్ చేశారని అభినందించారు. అలాంటి ప్రవీణ్ కుమార్ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటల్ని కేటీఆర్ ఖండించారు. రేవంత్ రెడ్డి లాంటి దొంగ.. దొంగలను ఎలా పట్టుకోవాలో పోలీసులకు చెప్పినట్లు వచ్చిన వార్తలపై ఎద్దేవా చేశారు. ఈ కేసు విషయంలో హనీ ట్రాప్ అంటూ అడ్డగోలు వార్తలు రాసిన మీడియా, రాయించిన వ్యక్తులు ఎవరో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు మీడియా కార్యాలయాలకు ఫోన్ చేసి కాళ్లావేళ్లా పడి వార్తలు రాకుండా ఆపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా కొట్లాడింది తామే అని, అది లగచర్ల మొదలుకొని అనేక అంశాల్లో తమ పార్టీ తరఫున కొట్లాడుతున్నామని చెప్పారు. బండి సంజయ్‌తో తనకు ఎలాంటి పంచాయితీ లేదని, ఆయన తన తండ్రి గురించి ఇష్టారీతి మాట్లాడినా ఏ రోజూ తాను స్పందించలేదని కేటీఆర్ తెలిపారు. ఈ రోజు కూడా బండి సంజయ్‌ను ఏమనడం లేదని, కేవలం నేరస్థుడు ఎవడైనా నేరస్థుడే అనే ఆలోచనతోనే మాట్లాడుతున్నామని అన్నారు. పోక్సో కేసు విషయంలో జరుగుతున్న అన్యాయంపైన ప్రశ్నిస్తే మా బావమరిది ఇంటిపైన డ్రగ్స్ దాడి జరిగింది అంటూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కేసు ఎందుకు పెట్టడం లేదు అని, దమ్ముంటే కేసు పెట్టి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

పంట కొనుగోళ్ళపై శ్వేతపత్రం విడుదల చేయాలి

పంట కొనుగోళ్లపై పంటల వారీగా లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 శాతం కొనుగోళ్ళు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమని సవాలు విసిరారు. అన్నదాతల పరిస్థితిపైన, పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ళ సంక్షోభం తీవ్రంగా ఉన్నదని, దీన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో స్వయంగా పర్యటించిన తాను కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న రైతన్నల దుస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వానికి నిన్న బహిరంగ లేఖ రాస్తే ముఖ్యమంత్రితోపాటు మంత్రి అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్ ముచ్చట్లు చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం రేపు జరిగే కేబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ళ సంక్షోభంపై చర్చించాలని, రైతన్నల కష్టాలే ఏకైక ఎజెండాగా రేపటి ఆ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అన్నదాతల ఆత్మహత్యలపైన, మరణాలపైన ప్రభుత్వానికి సమాచారం ఇస్తే సివిల్ సప్లైస్ మంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఎవరూ చనిపోలేదని బుకాయిస్తున్నదన్నారు. ప్రభుత్వానికి అవసరమైతే మరణించిన రైతన్నల వివరాలను అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే కనీసం వాటిని కాంటా పెట్టడం లేదని, కాంటా పెట్టిన సందర్భంలోనూ భారీగా తరుగు తీసి దోపిడీకి గురిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా రైతన్నలు పంట కొనుగోళ్ళపై నిరసన తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. గన్నీ బ్యాగుల నుంచి మొదలుకొని సుతలి దారం వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ ఇటీవలి దాడులు, అరాచకాలను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రతిపక్షంగా బీఆరఎస్ ఇస్తున్న సమాచారాన్ని, సలహాలను తీసుకుని పంట కొనుగోలు సంక్షోభాన్ని గుర్తించాలని, మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలని హితవు పలికారు. అధికారంలో ఉన్నాం కాబట్టి కింద ఉన్న సమస్యను పట్టించుకోము, ఎవరు చెప్పినా వినము అనే మూర్ఖత్వంతో వ్యవహరించవద్దని కేటీఆర్ సూచించారు. పంట కొనుగోళ్లు 80 శాతం పూర్తయ్యాయి అని ముఖ్యమంత్రి, 50 శాతం పూర్తయ్యాయి అని మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో కనీసం 30 శాతం కొనుగోళ్ళు కూడా పూర్తి కాలేదని కేటీఆర్ అన్నారు. పదేళ్ళు దేశానికి అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం ఈ రోజు రైతన్నల కన్నీళ్ళతో తల్లడిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా దొరకదు, రైతుబంధు దొరకదు, రుణ మాఫీ కాదు.. చివరకు పండించిన పంట అమ్ముకుందామంటే కూడా సౌకర్యాలు లేవŠని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు బుకాయింపులు, బెదిరింపులు, అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చక ఉన్న సంక్షోభాన్ని గుర్తించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *