– ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల దక్షిణ కాశి
– గోదావరిలో అంతర్వాహినిగా సరస్వతి నది
– సరస్వతి అంత్య పుష్కరాలకు తరలి వస్తున్న భక్తజనం
– పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్ మండలంలో ఉన్న ఒక ప్రాచీన, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న గ్రామం కాళేశ్వరం. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యం ఏర్పడింది. స్కంద పురాణంలోని కాళేశ్వర ఖండం ఈ పుణ్యక్షేత్ర మహిమను, పవిత్రతను విశదీకరిస్తుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు దండకారణ్యంలో వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతం గుండా ప్రయాణించినట్లు రామాయణంలో పేర్కొని ఉంది. ఈ పరిసరాలలోని ప్రాచీన శ్రీరామాలయాలు ఆ విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ గ్రామం గోదావరి నది ఎడమ తీరంలో, గోదావరి-ప్రాణహిత సంగమ స్థలంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి పేరుగాంచింది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. అందువల్ల ఈ సంగమాన్ని దక్షిణ త్రివేణి సంగమం, దక్షిణ కాశిగా భావిస్తారు. స్కంద పురాణం ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతిగా, అష్టదిక్పాలకులలో ఒకరిగా ఉన్న యమధర్మరాజు (కాలుడు) ఈ పవిత్ర క్షేత్రంలో పరమశివుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి ప్రసన్నుడైన శివుడు తనతోపాటు నిత్యం ఇక్కడే నివసించే వరాన్ని అనుగ్రహించాడు. అందుచేత ఈ ఆలయంలో ఒకే పానవట్టంపై కాళేశ్వర, ముక్తీశ్వర అనే రెండు శివలింగాలు ప్రతిష్ఠితమయ్యాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిగా ఆరాధిస్తారు. కాలం(మరణం), మోక్షం(విముక్తి)లకు ప్రతీకగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాలలో యమధర్మరాజు శివలింగ రూపంలో పరమశివునితో కలిసి ఉండే ఏకైక ఆలయం ఇదే. ఈ శివలింగాలలో ఒకదానిపై రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని స్వామివారి నాసికా రంధ్రాలుగా భావిస్తారు. ఈ రంధ్రాలలో పోసిన పాలు లేదా నీరు గోదావరిలో కలుస్తాయని విశ్వాసం. కాళేశ్వరం గోదావరి నదీ తీరంలోని పవిత్ర స్నాన ఘాట్లకు కూడా ప్రసిద్ధిచెందింది. వీటిని అష్ట తీర్థాలు అని పిలుస్తారు. అవి బ్రహ్మ తీర్థం, పిచ్చుక తీర్థం, జ్ఞాన తీర్థం, వాయస తీర్థం, సంగమ తీర్థం, నరసింహ తీర్థం, హనుమత్ తీర్థం, వ్యాస తీర్థం. ముఖ్యమైన పుణ్యకాలాల్లో, హిందూ పండుగల సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లోని ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణాలకు కాకతీయ పాలకులు చేసిన సేవల గురించి అనేక శాసనాలు తెలియజేస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన దేవరాయల 1397 శాసనం ప్రకారం ఆయన కాళేశ్వరంలో దిగ్విజయోత్సవాన్ని నిర్వహించి తులాపురుష దానం చేసినట్లు పేర్కొని ఉంది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1976లో పునరుద్ధరించింది. అనంతరం 1982లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వాములు ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు.
శిల్ప సంపదకు కూడా ప్రసిద్ధి
కాళేశ్వరం విశిష్ట శిల్ప సంపదకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా విష్ణుమూర్తి మత్స్య, కూర్మ అవతారాల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదనంగా అన్నపూర్ణాదేవి, శైవ ద్వారపాలకులు, మత్స్య యంత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న అర్జునుడు, చతుర్ముఖ లింగం వంటి శిల్పాలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ శిల్పాలు రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య, కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలాలకు చెందినవిగా భావిస్తారు. ఎర్ర రాయి, గ్రానైట్, బసాల్ట్ రాళ్లతో చెక్కిన ఈ శిల్పాలను ఆలయ సమీపంలోని మ్యూజియంలో భక్తులు, సందర్శకుల కోసం ప్రదర్శిస్తున్నారు. గోదావరి నది దక్షిణ తీరంలో ఉన్న ధర్మపురి, కోటిలింగాల, మంథని వంటి చారిత్రక, పవిత్ర ప్రాంతాలు కాళేశ్వరానికి సమీపంలో ఉన్నాయి. కాళేశ్వరం ఆధ్యాత్మికత, పురాణ ప్రాశస్త్యం, చరిత్ర, శిల్పకళ, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంగా నిలుస్తోంది.
పుష్కర స్నానమాచరించిన గవర్నర్ దంపతులు 
సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు త్రివేణి సంగమంలో గురువారం పుష్కర స్నానాన్ని ఆచరించారు. రాత్రి సరస్వతి నవరత్న మాలా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ పూజారులు పరివట్టం, పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు వారికి ఆశీర్వచనం చేసి శ్వేత వస్త్రాలు, లడ్డు ప్రసాదం, చక్కెర పొంగలి, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన దసలి పట్టు వస్త్రాల స్టాల్‌ను సందర్శించారు. గవర్నర్ దంపతుల వెంట ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. టస్సార్ పట్టు వస్త్రాలు తయారీ విధానం గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శుక్లా మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని, సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న కాశీ పండితుల నవరత్న మాలా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మికతకు అద్దం పడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించి అమ్మ కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
సందడిగా త్రివేణి సంగమం
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శుక్రవారం ఉదయం సరస్వతి ఘాట్‌కు భక్తులు భారీగా తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో భక్తులు సైకత లింగాలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పుష్కర ఘాట్ల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల రాకపోకలతో సందడిగా మారింది. పుష్కర స్నానం అనంతరం ముక్తేశ్వర కాళశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





