కాజీపేట డివిజన్ ఏర్పాటుతో వరంగల్ అభివృద్ధి
•కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలి..
•కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
•సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరుతో పాటు కాజీ పేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై రాష్ట్ర రోడ్లు, భవనాలు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వ ర్యంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విన్నవించారు. అనంతరం మీడి యాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని మంత్రులు, ఎంపీల బృందం కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయడంతో పాటు, వాటిని పూర్తిగా రైల్వే నిధులతో నిర్మించేలా సహకరించాలని, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను వేగవంతం చేసి ప్రారంభించేలా చూడాలని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమైన కాజీపేట రైల్వే డివిజన్ తెలంగాణలోని రెండో అతిపెద్ద నగరం వరంగల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కింద సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ వంటి 3 జోన్లు మాత్రమే ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు, గూడ్స్ కి సమర్ధవంతమైన రైల్వే నెట్వర్క్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేసేందుకు కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అత్యధిక ప్రయాణికుల రద్దీతో పాటు, సరుకు రవాణా చేస్తున్న కాజీపేటను డివిజన్‌గా చేస్తే.. గుంటూరు, హైదరాబాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తుందని లేఖలో వివరించినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, వరంగల్ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చుట్టు రింగ్ రైల్ ను నిర్మిస్తామని స్వయంగా వారే సానుకూలత వ్యక్తం చేయడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు వికారాబాద్-కృష్ణ లైన్.. దక్షిణ తెలంగాణలో వెనకబడిన పరిగి, కొడంగల్, టేకల్ కోడే, నారాయణ్‌పేట, మక్తల్ వంటి పట్టణాలను కలుపుతుందని, తాండూరు పట్టణం చుట్టూ ఉన్న సిమెంట్ పరిశ్రమలతో పాటు.. భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలకు కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని, ఆర్థికంగా ఇబ్బంది లేని ఈ రైల్వే లైన్ ను నిర్మిస్తే సరుకు రవాణా మార్గంగా ఉపయోగకరంగా ఉండబోతున్నందున.. దీన్ని ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో పరిగణలోకి తీసుకొని నిర్మిస్తే రైల్వే శాఖకు మరియు తెలంగాణ ప్రజలకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని లేఖలో వివరించినట్లు తెలిపారు.
గద్వాల్ %-% డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేపై స్థానికుల అభిప్రాయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు నివసించే కూసుమంచి మీదుగా వెళ్తున్న ఈ గద్వాల్ %-% డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే పై ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని.. ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ అత్యధిక జనాభా కలిగిన స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద నోటిఫై చేయబడిన పట్టణ ప్రాంతం నుంచి వెళ్తుందని, ఇదే రైల్వే లైన్ ప్రాంతంలో భారతదేశంలోని అతి పెద్ద బుద్ధ స్థూపం, సైబీరియన్ పక్షులు వలస వొచ్చే ఆవాస ప్రాంతాలు, పాలేరు రిజర్వాయర్ ను పునురుద్ధరిస్తున్న ప్రాంతం కూడా ఉందని, ఇక్కడ భూసేకరణకు ఎకరాకు రూ. 1 కోటి నుంచి 4 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సిన రావడం ప్రాజెక్టుకు ఆర్థిక భారంగా మారుతుందని వివరించారు.ఈ రైల్వే లైన్ ను వయా కూసుమంచి నుంచి కాకుండా ప్రత్యామ్నయ మార్గం డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు వయా వెన్నారం, మన్నెగూడెం, అభిపాలెం, మరిపెడ, మోతే ద్వారా వెళ్లేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెమి అర్భన్ బెల్ట్ ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం చుట్టూ 370 కి.మీ పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతోందని.. ఈ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టు రీజినల్ రింగ్ రైల్ ను నిర్మిస్తే.. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య సామాజిక అనుసంధానం, ఆర్థిక తోడ్పాటును కలిగిస్తుంది. భారీ ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ వలన గ్రామీణ పేదరికం తగ్గుతుంది. పారిశ్రామిక వృద్ధికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని వారికి తెలిపినట్లు ఆయన తెలిపారు.
వీటితో పాటు, కల్వకుర్తి నుంచి మాచర్ల – 120 కి.మీ, డోర్నకల్ నుంచి మిర్యాలగూడ – 97 కి.మీ , మెదక్ వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ డ్రైపోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందర్ పోర్టు వరకు – 461 కి.మీ (సుమారు), పాండురంగాపురం నుంచి భద్రాచలం – 16 కి.మీ వంటి కొత్త రైల్వే లైన్లకు మంజూరీ ఇచ్చి రైల్వే నిధులతో నిర్మించాలని కోరారు. ఈ కొత్త రైల్వే లైన్లు మంజూరు వల్ల రాష్ట్రంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వివరించారు.
ఉమ్మడి నల్గొండ, జిల్లాలో పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పూర్తి రైల్వే నిధులతో ఆర్‌ఓబిలను మంజూరు చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి అభ్యర్థన లేఖను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందించారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసివేయడం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయని విషయాన్ని వివరించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు.. ఇప్పటికే ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల స్థానంలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌వోబిలు) నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విన్నవించారు.
మామునూర్ ఎయిర్ పోర్టు మంజూరు కాంగ్రెస్ విజయమే : మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలంతా కలిసి ఇచ్చిన రైల్వే నూతన లైన్లు, కాజీపేట కొత్త డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వేగవంతం చేయడంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు తెలిపారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతాయనే ఆశాభావంతో ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులంతా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పది సంవత్సరాలలో ఒక్క అడుగు పడని మామునూరు ఎయిర్ పోర్టు కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన యేడాది కాలంలోనే ఎలా సాధ్యమైందని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.




