- ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు
- రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి
- ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి
- అపహాస్యం అవుతోన్న ప్రజాస్వామ్యం
రాజకీయాల్లో ఉత్థానపతనాలు సహజం. ఎన్నికల్లో గెలుపోటములు కూడా అంతే సహజం. ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో పలు పార్టీలు అలా లబ్ది పొందాయి. ఎపిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా జగన్..అసమర్థ విధానాలతో ఓటమి చెందారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయారు. అయినా ఆయనలో ఆత్మపరిశీలన జరగడం లేదు. ఎందుకు ఓడామన్నది తర్కించడం లేదు. అయితే జనసేన అనూహ్యంగా ప్రజల్లో దూసుకుని వచ్చింది. ఇప్పుడు ఓ రకంగా ప్రత్యామ్నాయ నేతగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. డిప్యూటి సిఎంగా సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు కూడా ప్రజల్లో మంచి పేరును తీసుకుని వస్తోంది. అలాగే తెలంగాణలో కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెల్చుకోలేక పోయింది. ఇది కూడా ఆ పార్టీ అనుసరించిన మూర? నిర్ణయాల కారణంగానే అని చెప్పవొచ్చు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బిఆర్‌ఎస్ ప్రజల్లో పూర్తిగా నిస్తేజం పొందింది. అయితే ఆరుసీట్లతో బిజెపి పంటపండిరది. ఇక దేశ రాజకీయాల్లోకి పరికిస్తే ఓ రకంగా కాంగ్రెస్ మళ్లీ కొంత పుంజుకోగలిగింది. విపక్షస్థాయికి ఎదిగింది. ఈ ఎన్నికల్లో అధికారం తమదే అని భావించినా..రాహుల్ నాయకత్వం పట్ల ప్రజల్లో అప్పుడే నమ్మిక కుదరలేదు. అయితే చెల్లి ప్రియాంక ను మాత్రం ఎంపిగా గెలిపించుకున్నారు. అలాగే ప్రతిపక్షనేత హోదాతో రాహుల్ ఓ పెద్దపదవినే అందుకునే అదృష్టం ఈ యేడాది కలిగింది.
ఇకపోతే మరోమారు ప్రధాని పదవి చేపట్టిన మోదీ చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెలిచారు. అధికార పీఠానికి దూరమయినా..ఎన్డీఎ పక్షాల మద్దతుతో ప్రధాని కాగలిగారు. ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. అందుకే బిజెపిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అయినా దీనిని మోదీ కానీ, బిజెపి కానీ గుర్తించడం లేదు. మోదీ ఆర్థిక విధానాలు, జిఎస్టీ దాడులు ఇలాగా సాగితే జమిలి ఎన్నికలు పెడితే బిజెపి ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయం. ఇలా రాజకీయ రంగం విషయాని కొస్తే 2024 కొందరికి మధురస్మృతులను మిగిలిస్తే.. మరికొందరికి ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలను నేర్పింది. అహంకారంతో వ్యవహారిస్తే ఎలా ఉంటుందో ప్రజలు నాయకులకు రుచి చూపించారు. ఏద్కెనా ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో మంచిదికాదనే సందేశాన్ని ప్రజలు ఇచ్చిన సంవత్సరంగా 2024 మిగిలిపోతుంది. అయితే ఇదే సందర్భంలో జమిలి ఎన్నికలపై ఈ యేడు కసరత్తు మొదలయ్యింది. జమిలి ఎన్నికల నిర్వహణ మంచిదే అయినా..రాజకీయ సంస్కరణలు లేకుండా జమిలి ఎన్నికలు నిర్వహించినా లాభం ఉండబోదు. ప్రధానంగా రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి. నేరస్థులు రాజకీయంగా లబ్దిపొందుతున్న వేళ..అలాంటి వారు రాజకీయాల్లో అడుగిడకుండా చేయాలి.
ఇకపోతే ఏటా ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరిగిపోయింది. రాజీయాలను నల్లడబ్బు ప్రభావం చేస్తోంది. వ్యాపార వేత్తలు, చీకటి వ్యాపారులు రాజకీయాలను శాసిస్తున్నారు. గూండాలు, రైడీలు ఎంపిలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న భారత్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. ఎంత ఖర్చుపెట్టయినా ఎన్నికైతే అధికార పార్టీలోకి ఫిరాయించి డబ్బు సంపాదించవచ్చనే ధోరణి కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు విచ్చలవిడిగా మారాయి. చట్టంతో అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. అందుకే ఇక్కడి నుంచే సంస్కరణ మొదలు కావాలి. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా పార్టీ మారిన వెంటనే వారి సభ్యత్వం ఎవరి ప్రమేయం లేకుండా తక్షణం రద్దయిపోయేలా చట్టం లో సంస్కరణ రావాలి. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడమే సర్వరోగ నివారణి అంటున్న, మోదీ ముందుగా ఇలాంటి సంస్కరణ చేపడితే దేశంతో పాటు ప్రపంచం కూడా హర్షిస్తుంది. అలాగే వరుసగా గెలవడం అన్నది ఓ రికార్డుగా ప్రచారం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక్కరికి రెండుసార్లు మాత్రమే అవకాశం అన్న చట్టం రావాలి. లేకుంటే గాంధీ కుటుంబం, కెసిఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం, లాలూ, ములాయం కుటుంబాలే రాజ్యమేలుతుంటాయి. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని, శాంత్రిభద్రతల సమస్యలు ఉండదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. కానీ జమిలి ఎన్నికలు జరిగినప్పటికి లోక్‌సభ, శాసనసభలు ముందే రద్దు కావనే గ్యారంటీ ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ఏద్కెనా సాధ్యమే. ఎన్నికల్లో ధనబలం నిరోధించేలా, ఒక్కరే పలుమార్లు ఎన్నికయ్యేలా ఉన్న వెసలుబాటును తొలగించాలి. ఇలాంటి ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం అని గుర్తించాలి. పారదర్శకమైన పాలనకు బాటలు వెయ్యాలంటే జమిలితో పాటే, ఎన్నికల విధానాన్ని సంస్కరించాల్సి ఉంది. లెక్కకు మించిన కుంభకోణాలతో కోటానుకోట్లు కొల్లగొట్టిన నేతలు చట్టసభల్లో శాసననిర్మాతలుగా మన కళ్లముందే నిలబడుతున్నారు. చట్టసభల్లో నేరచరితగలవారు, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు 25 నుంచి 50 శాతానికి ఎగబాకారు. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ముందుగా అడ్డుకట్ట పడాలి. అలాగే ఒక్కరే జీవితాంతం ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో తిష్టవేయకుండా చూడాలి. చట్టసభల్లో నేరస్థులకు తావులేకుండా చేయాలన్న సుప్రీం సూచనలు శిరోధార్యం కావాలి. ఎన్నికల వ్యవస్థని సమూలంగా ప్రక్షాళించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థని కంటికి రెప్పలా సర్వ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే బలమైన అధికారం ఉన్న ఎన్నికల కమిషన్ రావాల్సి ఉంది. కఠినమైన ఎన్నికల సంస్కరణలు అమలు చేసి, ప్రజల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి. అప్పుడే జమిలి ఎన్నికలకు వెళితే అర్థం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్న వారంతా నిజాయితీగా ఆలోచన చేయాలి.
-కె. శ్రీనివాస్





