రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ
•రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం
•రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని, అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమా యకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బిఆర్‌ఎస్‌ ‌ప్రయత్నిస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బిఆర్‌ఎస్‌ ‌గుర్తించాలని హితవు పలికారు. పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టవొద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని , చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.

లగచర్లలో ప్రజలు, అక్కడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులు వెళ్లినపుడు, ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే దాడికి పాల్పడడం నీచం, అత్యంత హేయమైన చర్య అని తెలిపారు. జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటే దానివెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని అర్థమవుతుంది. రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి , స్ధానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడడం దురదృష్టకరం. రైతులకు నష్టం కలిగించాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. వారి సమస్యలను వినడానికి  ,పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా వెళ్తుంది.  రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు.  లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్‌ ‌గా తీసుకుంటుంది. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే.. రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు.  జిల్లాకు మెజిస్ట్రేట్‌గా ఉన్నకలెక్టర్‌ ‌పైనే హత్యాయత్నానికి  కుట్ర పన్నారు. అధికారుల మీద దాడి అనేది మన మీద మనం దాడి చేసుకున్నట్లే! అని అన్నారు.

రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు దీనివెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని చెప్పారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే యత్నం చేస్తున్నారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వొస్తారు? బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారం వెలగబెట్టిన నాడు ఇదే పద్దతి చేశారా? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరిగినట్లుగా సమస్య చెప్పుకోవడానికి వొచ్చిన రైతులకు బేడీలు వేయలేదని, గడచిన 11నెలలుగా ప్రతీ విషయంలోనూ ప్రజాస్వామ్య యుతంగా ప్రజల సమస్యలను విని పరిష్కరిస్తున్నామని చెప్పారు. బిఆర్‌ఎస్‌ ‌పది సంవత్సరాల నియంతృత్వ పాలనలో ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేశారని, ఇసుక దందాలకు అడ్డు వొస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో దళితులను ట్రాక్టర్‌తో తొక్కించి పోలీసు స్టేషన్‌లో థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించి హింసించారని గుర్తుచేశారు.

మల్లన్న సాగర్‌ ‌విషయంలో రైతులకు పెట్టిన బాధలు వర్ణణాతీతమని, ఆనాటి ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని ఆరోపించారు.  ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్‌ ‌నెలలో వేములఘాట్‌ ‌గ్రామ రైతు తూటుకూరి మల్లారెడ్డి, కూల్చివేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి దానినే చితిగా మార్చుకొని తనకు తాను ఆ చితిమంటల్లో ఆత్మార్పణ చేసుకున్నాడని తెలిపారు. మల్లన్న సాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ ‌చేసి సంకెళ్లు వేశారు. మల్లన్న సాగర్‌ ‌విషయంలో రైతులకు సంబంధించి ఇలాంటి యథార్థ కథనాలు కోకోల్లలు అని చెప్పారు.  ‘’అధికారం పోయిన ఏడాదిలోనే ఇంత అసహనమా? , అసాంఘిక శక్తులుగా మారిన బిఆర్‌ఎస్‌ ‌నిజస్వరూపం ప్రజలకు అర్దమవుతోందని అని మంత్రి పొంగులేటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *