పార్టీని వీడేవారితో బాధలేదు..

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు..
తెలంగాణ సాధించిన మనకు ఇదొక లెక్కనా..?
 రెట్టించిన ఉత్సాహంతో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం
 పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ ఎస్‌ అధినేత  కేసీఆర్‌ భరోసా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : దొంగల్లా పార్టీని వీడేవారితో మనకు బాధ ఏమీ లేదని,  పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌  స్పష్టం చేశారు.  మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని, రెట్టించిన ఉత్సాహంతో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కేసీఆర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో సాధించుకునే సత్తా  మనకే ఉందన్నారు. ఎర్రవెల్లికి శుక్రవారం  కేసీఆర్‌ ను కలిసేందుకు వందలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు.  కోరుట్ల జగిత్యాల నియోజక వర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.  సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్లా కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒకరు పోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని  తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నదన్నారు.

మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి వుంది. ప్రజలు అవకాశమిస్తే..గత పదేండ్లు చిత్తశుద్ధితో రాజీపడకుండా ప్రగతిని సాధించి  ప్రజల మన్ననలను పొందాం. కుల, మతాలకతీతంగా పని చేస్తూ వ్యవ సాయం, సాగునీరు,విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాం. కుల వృత్తులను  అభివృద్ధి చేసి గ్రామ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశాం. అయితే…కొన్ని కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తపడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. అంతమాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతి కాదు. మనం ఏ హోదాలో వున్నా ప్రజల కోసం పని చేయాల్సిందే.  మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారుచేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది.. అని కేసీఆర్‌  వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కె.సంజయ్‌ కుమార్‌ ఒక పక్క డాక్టర్‌ గా మరోపక్క ఎమ్మెల్యే గా ప్రజాసేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కేసీఆర్‌ గారు అభినందించారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, బాల్క సుమన్‌, జీవన్‌ రెడ్డి, జాజాల సురేందర్‌, గంప గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, ఎల్‌.రమణ, జగిత్యాల  జెడ్పీ చైర్మన్‌ వసంత సురేష్‌, పెద్దపెల్లి టీఆర్‌ఎస్‌ నేత ఉష తదితరులు పాల్గొన్నారు. కాగా.. అంతకుముందు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, జీవన్‌ రెడ్డి, గంప గోవర్ధన్‌, జాజల సురేందర్‌, హన్మంత్‌ షిండే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *