– డివిజన్ కోరిన విపక్ష సభ్యులు.. స్పీకర్ అంగీకరాం
– సభ ఆమోదంతో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి అర్జున్
న్యూదిల్లీ, ఏప్రిల్ 16 : డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను గురువారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంమంత్రి అమిత్ షా వీటిని ప్రతిపాదించారు. వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. బిల్లులను వ్యతిరేకించిన విపక్షాలు డివిజన్ వోటింగ్‌కు పట్టుబట్టగా స్పీకర్ ఓం బిర్లా సమ్మతించారు. డివిజన్ వోటింగ్ నిర్వహించగా బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251, వ్యతిరేకంగా 185 మంది ఓటు చేశారు. మెజారిటీ సాధించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లులను ఒకేసారి పరిశీలించి, ఆమోదించేలా లోక్‌సభ నిబంధన 66లోని ప్రొవైజోను సస్పెండు చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి మేఘ్‌వాల్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్నందున అనుమతించాలని అందులో కోరారు. చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వీటిపై వోటింగ్ నిర్వహించనున్నట్లు సభాపతి తెలిపారు. ఈ మూడింటిలో లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీ లిమిటేషన్ పక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. వీటిని మంత్రి అర్జున్‌రామ్ మేఫtTవాల్ ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందుంచారు. వీటిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీ అంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీయే కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లు ఆమోదానికి మరో 68మంది మద్దతు అవసరం. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న ఇండి కూటమి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది.
2024లోనే ఎందుకు అమలు చేయలేదు : కాంగ్రెస్ నేత వేణుగోపాల్ అభ్యంతరం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులపై విపక్షాలు తమ అభ్యంతరాలను లేవనెత్తగా వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2024లో మహిళా రిజర్వేన్లను ఎందుకు అమలు చేయలేదని లోక్‌సభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. 2023లోనే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామన్నారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నిస్తారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సభలో ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సమాజ్‌వాదీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. దక్షిణాది ప్రాంతాలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ బిల్లు చేస్తుందన్నారు. ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, అవి శాండ్‌విచ్ బిల్లులని డీఎంకే ఆరోపించింది. మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, హోం మంత్రి అమిత్ షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ పక్రియను జనగణనతో ప్రారంభించాలని అఖిలేశ్ తొలుత సూచించారు. కులగణనను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌పై కేంద్రం దూకుడులో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ’మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఎందుకు అంత తొందర ప్రదర్శిస్తోంది.. మొదటగా జనగణనతో ఈ పక్రియను స్టార్ట్ చేయాలి’ అని అన్నారు. మహిళా రిజర్వేషన్‌కు తన పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. కానీ డీలిమిటేషన్ ద్వారా రిజర్వేషన్ అమలును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ వాదనపై అమిత్ షా ఘాటుగా స్పందించారు. ’దేశంలో ప్రస్తుతం జనగణన ప్రారంభమైంది.. ఆ తరువాత కుల ఆధారిత సెన్సెస్ కూడా ఉంటుంది.. ప్రస్తుతం గృహ గణన జరుగుతోంది.. ఇళ్లు కులాల వారీగా ఉండవు. కుదిరితే ఇళ్లకు కూడా సమాజ్‌వాదీ పార్టీ కులాన్ని జోడిస్తుంది.. కులగణనతో పాటు జనగణన జరుగుతుందని సభకు హామీ ఇస్తున్నా’ అని అమిత్ షా అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





