మహిళా బిల్లులో రాజకీయం లేదు

– 30 ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారు
– వారికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత
– చట్ట సభల్లోనూ వారు సత్తా చాటేలా చేద్దాం
– ఏకగ్రీవంగా ఆమోదించే విపక్షాలకే క్రెడిట్
– ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తేవద్దు
– డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు
– మహిళా బిల్లుపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం

న్యూదిల్లీ, ఏప్రిల్ 16: మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని, ఈ బిల్లు ఏ పార్టీకీ అనుకూలం కాదని ప్రధాని మోదీ అన్నారు. దానికి రాజకీయ రంగు పూయవద్దన్నారు. ఎవరు బాధ్యులైనా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేశామన్నారు. మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఈ బిల్లులను తీసుకొచ్చిన సక్సెస్ ట్రెజరీ బెంచ్‌లకు కానీ, మోదీకి కానీ దక్కదని, ఇది భారత ప్రజాస్వామ్యానికి దక్కుతుందని అన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోదీ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆలోచించరాదన్నారు. కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోవచ్చునని ప్రతిపక్షాలకు చెప్పారు. ముందుగా 33 శాతం మంది మహిళలు ఇక్కడకు రావాలన్నారు. భారతీయ సోదరీమణులను నమ్మండి అని, వారి ఇంటెలిజెన్స్‌ను గుర్తించాలని అన్నారు. నారీ శక్తి వికసిత్ భారత్‌కు ఉపయోపడుతుందన్నారు. మనం తీసుకోబోయే నిర్ణయాన్ని మహిళలు వీక్షిస్తున్నారని, మన ఉద్దేశాలను కూడా గమనిస్తున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ పక్రియను మరింత ఆలస్యం చేయవద్దని కోరారు. రాజ్యాంగ సవరణ బిల్లులతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, ఎవర్నీ వివక్షపూరితంగా చూడబోమని అన్నారు. అలాగే దక్షిణాదికి అన్యాయం అంటున్న వాదనలో కూడా వాస్తవం లేదన్నారు. ఒకవేళ బిల్లు పాసైన తర్వాత ఎవరైనా క్రెడిట్ కావాలంటే వారి పేరు, ఫోటోతో ఫుల్ పేజీ యాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అందరి అచీవ్‌మెంట్‌గా చూడాలన్నారు. కానీ ఒకవేళ మూడు దశాబ్దాల తర్వాత కూడా ఈ సంస్కరణ చేపట్టకపోతే అప్పుడు ఆ లబ్ది ఏ పార్టీకీ దక్కదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే వారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు. డీలిమిటేషన్ అంశంలో గ్యారెంటీ ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్యారెంటీ, ప్రామిస్ పదాలు వాడమంటే వాడతానని, ఒకవేళ తమిళంలో దీనికి తగిన పదం ఏదైనా ఉందంటే దాన్ని కూడా చెబుతానని, మన ఉద్దేశం స్వచ్ఛమైనదైతే అప్పుడు పదాలతో ఆడాల్సిన అవసరం ఉండదని అన్నారు. దేశ చరిత్రలో ఇదో కీలక ఘట్టమని మోదీ వ్యాఖ్యానించారు. కాలానుగుణంగా మనం కూడా మారాలన్నారు. వాస్తవానికి ఈ బిల్లును 30 ఏళ్ల క్రితమే ఆమోదించాల్సిందని చెప్పుకొచ్చిన ఆయన ఇది దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు అని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఆమోదించడం ప్రస్తుత పార్లమెంటుకు ఓ సువర్ణావకాశమని అన్నారు. ’దేశానికి సరికొత్త దిశను సూచించే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం అద్భుత ఘట్టం.. వికసిత్ భారత్ అంటే మౌలిక వసతుల కల్పనే కాదు.. మహిళలకు అధికారం ఇవ్వడం కూడా.. వికసిత్ భారత్‌లో మహిళల భాగస్వామ్యమే లక్ష్యం.. మహిళలకు అధికారమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు.. మహిళలకు నిర్ణయాధికారం ఇవ్వడమే తమ లక్ష్యం.. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు.. ఈ విషయంలో విపక్షాలను మహిళలు ఎప్పటికీ క్షమించరు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. పంచాయతీల్లో రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. లోక్‌సభలో మాత్రం బిల్లును అడ్డుకుంటున్నారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుంది. 30 ఏళ్లలో ఇదే అంశం రుజువైంది. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. అత్యున్నత చట్ట సభల్లోనూ భాగస్వామ్యం కోరుతున్నారు. చీపురు పనికాదు.. పార్లమెంట్‌లో సీట్లు అడుగుతున్నారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించిన వారిని మహిళలే శిక్షిస్తారు’ అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనివ్వండి.. ఆ తర్వాత ఓబీసీ, ఇతర వర్గాల కోటాపై ఆలోచిద్దామని మోదీ చెప్పారు. ’పార్లమెంట్‌పై నాకు నమ్మకం ఉంది. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన నాకు ప్రధాని పదవి దక్కింది.. తప్పకుండా ఓబీసీలకు న్యాయం చేస్తాం.. మహిళా రిజర్వేషన్‌కు రాజకీయ రంగు పులమొద్దు.. ఈ బిల్లు పార్టీల కోసం కాదు.. మహిళల కోసమే అంటూ రిజర్వేషన్లు మహిళల హక్కు.. 2029లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం జరిగినట్టవుతుంది.. వికసిత్ భారత్ సాధనలో మహిళలదే కీలక పాత్ర.. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ ఆలస్యం కాకూడదు.. దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశమంతా ఒక్కటే.. ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలూ సమానమే. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా తమకు లేదు అని అన్నారు. చిన్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, దేశాన్ని ముక్కలు చేసే అధికారం మనకు లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ప్రకటన చేస్తా.. నా స్వార్థం కోసం బిల్లు అంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు అని మోదీ తన ప్రసంగంలో వివరించారు. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు.. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది అని చెప్పారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా వారి సామర్థ్యం తెలిసేది అని అన్నారు. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు.. దేశ ప్రగతిలో మహిళలకూ భాగస్వామ్యం కల్పించాల్సిందేనన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు అని మోదీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో వీటిని అమలు చేద్దామని తాము ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. 2029 ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వకపోతే మహిళలకు అన్యాయం చేసినట్లేనన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *