– బే ఏరియా పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
– అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశం
– డిప్యూటీ సీఎం గౌరవార్థం భారత కాన్సుల్ జనరల్ విందు
శాన్ ఫ్రాన్సిస్కో, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గౌరవార్థం శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె.శ్రీకర్ రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బే ఏరియాలోని ప్రముఖ ప్రవాస భారతీయులతోపాటు ఐటీ, వైద్య, మానవ వనరులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన విశిష్ఠ నాయకులు హాజరయ్యారు. భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. ఐటీ ఆవిష్కరణల్లో హైదరాబాద్ అగ్రగామి. టెక్నాలజీ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాలలో భారతదేశపు ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతోందని గుర్తు చేశారు. ఈ వృద్ధి వేగాన్ని ఇలా కొనసాగిస్తూనే అభివృద్ధి చెందుతున్న సరికొత్త రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం కొత్త పునాదులు వేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకమైన, పెట్టుబడులకు అనుకూలమైన ప్రగతిశీల అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందన్నారు. కొత్త ఆలోచనలను సంస్థలుగా మార్చడంలో, నాణ్యమైన ఉపాధిని సృష్టించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పలు కీలక కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి సభకు వివరించారు. చారిత్రక మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణ యువతను భవిష్యత్ ఉద్యోగాలకు, ప్రపంచస్థాయి పోటీకి సన్నద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతోపాటు అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి : కాన్సుల్ జనరల్ 
తొలుత సభికులకు స్వాగతం పలికిన కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి ప్రవాస భారతీయులు, ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. భారత్‌లో సమ్మిళిత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతూనే ప్రవాసులకు సైతం ప్రయోజనం చేకూర్చేలా బలమైన భాగస్వామ్యాలను అన్వేషించాలని వ్యాపార వర్గాలను కోరారు. సమావేశం అనంతరం పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలు తదితర అంశాలపై ఎన్నారైలు, బే ఏరియా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్రంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల మధ్య బలమైన సంస్థాగత సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ఈ సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయి. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఐవోసీ నాయకులు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం
శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ జనరల్ నహజ్ అలీ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అలాగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు, ప్రవాస తెలంగాణవాసులు, అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి బ్రహ్మరథం పట్టారు.





