– రైతన్న, నేతన్నలకు ప్రభుత్వం అండ
– చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల
– జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్స్ ప్రారంభించి పరిశీలన
– కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలకు సత్కారం
– 16 వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రైతు సంక్షేమంతోపాటు చేనేత రంగ పునరుజ్జీవాన్ని కూడా సమాన ప్రాధాన్యతతో తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నదని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలకు ఎంపికైన చేనేత కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. చేనేతరంగ అభివృద్ధికి వారు అందిస్తున్న విశిష్ట సేవలు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. అనంతరం చేనేత వస్త్ర ప్రదర్శనను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి మంత్రి ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులైన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన వందకు పైగా స్టాల్స్‌ను సందర్శించి, వారి పనితనం, సంప్రదాయ నైపుణ్యం, ఆధునిక డిజైన్ల సమన్వయంతో రూపొందించిన వస్త్రాలను పరిశీలించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలు రూపొందించిన ప్రత్యేక చేనేత ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షించి వారి ప్రతిభను అభినందించారు. ఈ ప్రదర్శన శుక్రవారం నుంచి ఈనెల 16 వరకు కొనసాగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు. చేనేత అనేది ఉపాధి మార్గం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా సంక్రమించిన ఈ గొప్ప హస్తకళను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సంప్రదాయాన్ని ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత రంగానికి కొత్త తరాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆ సంస్థలో విద్యనభ్యసించిన వగ్గు శ్రీరామ్ రూపొందించిన ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ జాతీయ స్థాయిలో తొలి బహుమతి సాధించడం తెలంగాణ చేనేత శిక్షణ వ్యవస్థ ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.500 కోట్ల బకాయిలతోపాటు మొత్తం రూ.980 కోట్లు విడుదల చేసి చేనేత రంగానికి ఆర్థిక ఊతం కల్పించామని వెల్లడించారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు. నేతన్నకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, టెస్కో అధికారులు, రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
నరుడికి నాగరికత నేర్పింది నేతన్నే: మంత్రి సీతక్క 
చేనేత రంగానికి మరింత గౌరవం, నేతన్నలకు నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. వ్యవసాయం, చేనేత రంగాలు తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు, ముఖ్యంగా తెలంగాణ నేతన్నలు, నేతమ్మలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒక చీర వెనుక నూలు పోగులు మాత్రమే ఉండవని, ఒక కుటుంబం ఆశ, నేతన్న నైపుణ్యం, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఉంటుందని చెప్పారు. నరుడికి నాగరికత నేర్పింది నేతన్నలేనని మంత్రి సీతక్క అన్నారు. మనిషి వస్త్రాన్ని నేయడం, ధరించడం ప్రారంభించినప్పుడే నాగరిక సమాజానికి నాంది పడిందని తెలిపారు. చేనేత రంగాన్ని కేవలం సంక్షేమ కోణంలో కాక ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోణంలో ప్రభుత్వం చూస్తోందన్నారు. కోట్ల విలువైన ఇందిరమ్మ చీరల ఆర్డర్లను చేనేత కార్మికులకు అందిస్తున్నామని, దీంతో వేలాది నేత కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ వస్త్రాన్ని కూడా చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. యేటా కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా చేనేత రంగానికి బలమైన మార్కెట్ కల్పిస్తున్నట్లు తెలిపారు. నేతన్నల చేతుల్లో చక్రం నిరంతరం తిరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మంత్రి అన్నారు. చేనేత బతికితే వేలాది కుటుంబాలు బతుకుతాయంటూ ప్రజలంతా చేనేతకు తమ వంతు మద్దతు ఇవ్వాలని కోరారు. వారంలో కనీసం రెండు రోజులైనా చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తాను కూడా చేనేత దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. నేతన్నలు తయారు చేసిన చీరలు, వస్త్రాలను ఆమె పరిశీలించి స్వయంగా మగ్గం నేసి వారి నైపుణ్యాన్ని తెలుసుకుని నేత చీరలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారులు, ప్రముఖులను శాలువాలతో సత్కరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




