– 12.91 లక్షల మందికి లబ్ది.. జీవో 77 ద్వారా అమలు
– ఇప్పటికి 89మంది ఉద్యోగ కుటుంబాలకు ప్రమాద బీమా
– శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఖజానాపై గానీ, ఉద్యోగులపై గానీ ఒక్క రూపాయి భారం పడకుండా మానవీయ కోణంలో దేశంలోనే తొలిసారిగా రూ.కోటి దాకా ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు స్పష్టం చేశారు. అనుకోకుండా ప్రమాదం జరిగి ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడుతుందని, అలాంటి కుటుంబాలకు జీవితకాల భరోసా కల్పించాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నందున బ్యాంకర్లతో చర్చించి వారి వ్యాపార పురోగతికి అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం 16 ప్రముఖ బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో 77ను జారీ చేసిందని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 12,91,046 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వ్యవస్థకు ఈ పథకం వర్తిస్తుందని భట్టి వెల్లడించారు. ఈ పథకాన్ని తొలుత ఫిబ్రవరి 2024లో సింగరేణి ఉద్యోగులకు, ఆ తర్వాత జూన్ 2024 నుంచి విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రారంభించి, ప్రస్తుతం రాష్ట్రంలోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు అందరికీ వర్తింపజేశామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
89 క్లెయిమ్‌ల పరిష్కారం
ఈ పథకం ద్వారా ఇప్పటికే 89 ఉద్యోగ కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారాన్ని అందించినట్లు తెలిపారు. ఇందులో సింగరేణిలో 50, విద్యుత్ శాఖ ఉద్యోగులు 15, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు 24మంది ఉన్నారు. రూ.2.20 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా కవరేజ్ బ్యాంకులు అందించే శాలరీ, పెన్షన్ అకౌంట్ ప్యాకేజీల ఆధారంగా బీమా ప్రయోజనాలు వర్తిస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో ఉచిత బీమా వర్తిస్తుందన్నారు. అంతేకాక విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2.20 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు కవరేజ్ లభిస్తుందని, సాధారణ ప్రమాద మరణానికి కూడా కొన్ని కేటగిరీల్లో రూ.1.50 కోట్ల కంటే ఎక్కువ బీమా అందుతుందని స్పష్టం చేశారు.
వేగవంతంగా ఉద్యోగులకు హెల్త్ కార్డుల ప్రక్రియ
ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేసే ప్రక్రియను వేగవంతంగా అమలు చేయడానికి కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రులు, అధికారుల దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే సంబంధిత శాఖల అధిపతులు(హెచ్ఓడీలు), కార్యదర్శులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు ప్రత్యేకంగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులను కూడా భాగస్వాములుగా చేర్చి వారే స్వయంగా పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ పథకం కోసం ఆర్థిక శాఖ నుండి రూ.264 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. అమలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఉద్యోగ సంఘాల నాయకులు, ట్రస్టీలు కలసి చర్చించుకుని పరిష్కరించుకునే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య సమన్వయాన్ని పెంచుతూ ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, శాసనమండలి సభ్యులు కూడా ఈ విషయంలో లబ్దిదారులకు అవగాహన కల్పించాలని భట్టి విక్రమార్క కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





