తీగ లాగితే డొంక కదిలింది!

– ముఠా వలలో 200 మందికి పైగా బాధితులు!
– ‘ప్రజాతంత్ర’ కథనాలతో వెలుగుచూస్తున్న అక్రమాలు
– 70 శాతం నష్టపోయిన బాధితులు
– హెల్త్ పాలసీ వస్తుందని ఎర..  
– పోలీసు విచారణ వేగవంతం

మహబూబ్ నగర్ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 : ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న నకిలీ ముఠా వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ‘ప్రజాతంత్ర’లో వరుసగా ప్రచురితమవుతున్న సంచలన కథనాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలోనే బాధితులు ఉన్నారని అంతా భావించ‌గా శుక్రవారం నాటికి ఏకంగా 209 మందికి పైగా బాధితులు ‘ప్రజాతంత్ర’ కార్యాలయాన్ని ఫోన్ల ద్వారా సంప్రదించి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి  వివరాలు ‘ప్రజాతంత్ర’కు లభ్యమయ్యాయి. గతంలో ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఖాతాదారులనే ఈ ముఠా ప్రధానంగా టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ఎక్సైడ్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీతో విలీనమైన (టై అప్) తర్వాత, రెండేళ్లుగా ఈ దందా మరింత తీవ్రమైంది. మీ పాత పాలసీ రద్దవుతుంది, వెంటనే వచ్చి ఉన్న డబ్బులు డ్రా చేసుకోండి అని నమ్మబలికారు. లాకింగ్ పీరియడ్ పూర్తికాకముందే పాలసీలను రద్దు చేయించడంతో బాధితులు కట్టిన మొత్తంలో ఏకంగా 70 శాతం నష్టపోయారు. ‘వచ్చిన కాడికి చాలు’ అనేలా బాధితులను భయపెట్టి వారి సొమ్మును దోచుకున్నారు. ఈ ముఠా కేవలం డబ్బులు కట్టించుకోవడమే కాక ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉచితంగా ‘హెల్త్ పాలసీ’ వర్తిస్తుందని, ఆసుపత్రి ఖర్చులు ఏవీ ఉండవని అబద్ధాలు చెప్పి అమాయకులను నమ్మించారు. ఉచిత గిఫ్ట్ టోకెన్లు, కూపన్ల పేరుతో ఆశ చూపి నిరుపేద రైతులు, కూలీలు, చిన్న వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. మోసపోయామని గ్రహించినప్పటికీ, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా ఉన్న బాధితులు ‘ప్రజాతంత్ర’ కథనాలతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు. బాధితుల వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి ఫోన్ నంబర్లు బహిర్గతం చేయకుండా, ‘ప్రజాతంత్ర’ సేకరించిన 209 మంది బాధితుల సమగ్ర వివరాల జాబితాను దర్యాప్తు జరుపుతున్న సీసీఎస్ పోలీసు అధికారులకు అందించేందుకు ప్ర‌జాతంత్ర సిద్ధ‌మైంది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మోసపూరిత నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను అరెస్ట్ చేసి, బాధితులకు న్యాయం జరిగే వరకు ‘ప్రజాతంత్ర’ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. “మాకు ఉచితంగా హెల్త్ కార్డ్ వస్తుందని, పాత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పారు. తీరా చూస్తే మేము కట్టిన మొత్తంలో 30 శాతమే చేతికి ఇచ్చారు. 70 శాతం నష్టపోయాం. ‘ప్రజాతంత్ర’లో వార్త చూశాకే మేము ఇంత పెద్ద మోసానికి గురయ్యామని అర్థమైంది. పోలీసు అధికారులు స్పందించి మా డబ్బులు మాకు ఇప్పించాలి.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *