– భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త పాలసీ
– సోలరైజేషన్ వైపు మళ్లిస్తే ఖజానాపై తగ్గనున్న భారం
– వ్యవసాయానికి మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
– రైతులపై భారం లేని ఆధునికీకరణ
– శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా పర్యావరణహితమైన హరిత ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025’ విశేషాలను వివరించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లుగా మాత్రమే ఉండేదని, ఈ సెప్టెంబర్ 9 నాటికి అది 19,543 మెగావాట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. వివిధ కారణాల రీత్యా ఈ ఏడాది డిమాండ్ 20,000 నుంచి 21,000 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని, ఈ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే సాంప్రదాయ, నాన్-సాంప్రదాయ ఇంధన వనరులను సమన్వయం చేస్తూ ఈ నూతన పాలసీని తెచ్చినట్లు తెలిపారు. సభ్యుడు కొమురయ్య ప్రస్తావించిన పంప్డ్ స్టోరేజ్ విధానం కొత్తదేమీ కాదని, కాంగ్రెస్ హయాంలోనే నాగార్జున సాగర్‌లో దీన్ని విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ తయారీకి 1.5 నుండి 2 సంవత్సరాలు, ఉత్పత్తిలోకి రావడానికి 5 నుండి 8 సంవత్సరాలు పడుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పదిమంది ప్రతిపాదకులు ముందుకొచ్చారని, డీపీఆర్ సమర్పించిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక్కొక్కరు రెండు మెగావాట్ల చొప్పున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు ప్రాంతంలో(అప్పర్ ప్లాటో) పైలట్ ప్రాజెక్టుగా పూర్తి సోలరైజేషన్ చేసి ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంప్సెట్లకు ఉచిత విద్యుత్ అందించడానికి ఏటా రూ.14 వేల కోట్లు, 53 లక్షల గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ.5వేల కోట్లు చెల్లిస్తోందని, ఇలా కేవలం సబ్సిడీల రూపంలోనే ఏటా దాదాపు రూ.19వేల కోట్లు ఖర్చవుతోందని ఆయన వివరించారు. ఈ నిధులను సోలరైజేషన్ వైపు మళ్లిస్తే ఖజానాపై భారం తగ్గడంతోపాటు రైతులు స్వయంసమృద్ధి సాధిస్తారన్నారు. అందుకే ముందుకొచ్చే రైతుల వ్యవసాయ పంప్సెట్లను ప్రభుత్వ ఖర్చుతోనే సోలరైజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవలం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడáమే కాక నాలుగు పిల్లర్లు వేసి కొట్టం లేదా విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించుకునేలా అరుగును కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పగటిపూట లభించే సోలార్ విద్యుత్ రాత్రివేళ అందుబాటులో ఉండనందున ఎంపిక చేసిన గ్రామాల్లో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌తో మైక్రో గ్రిడ్లను నిర్మిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రం ఇచ్చే వీజీఎఫ్ ద్వారా మూడుసార్లు టెండర్లు పిలిచినా బ్యాటరీ స్టోరేజ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. భవిష్యత్తులో సాంకేతికత పెరిగి బ్యాటరీ ధరలు తగ్గితే ఈ ప్రాజెక్టులు వేగవంతమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పెట్టుబడిదారులకు గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. పరిగి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిమిత పవన విద్యుత్(విండ్ పవర్) అవకాశాలపై అధ్యయనం చేసి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తోందని, ఇటీవల కరీంనగర్లో ఒక ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినట్లు భట్టి గుర్తు చేశారు. మణుగూరు వద్ద సింగరేణి చేపట్టిన మిథేన్ గ్యాస్ ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాలేదని, కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం జరుపుతున్నామని తెలిపారు. దేవాదాయ, ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పీపీఏలు కుదుర్చుకున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. స్థానిక సంస్థల్లోని సోలార్ స్ట్రీట్ లైట్ల నిర్వహణ పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పరిధిలోకి వస్తుందని, అయినప్పటికీ సభ్యుల సూచనల మేరకు సంబంధిత అధికారులతో సమీక్షించి నిలిచిపోయిన స్ట్రీట్ లైట్లను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సభ్యుల సూచనలను స్వీకరించామని, వాటిని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి స్పష్టం చేశారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
భూమ్యాకాశాలు ఏకమైనా, ఎవరు ఒత్తిడి తెచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చమని వంద శాతం హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. భవిష్యత్తులో బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చి పగలు, రాత్రి రెండూ సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సోలార్ పంప్‌సెట్లతో పగటిపూట మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంటే రాత్రిపూట పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘మీతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే కొంతకాల వ్యవధిలో థర్మల్ పవర్‌తోపాటు సోలార్ విద్యుత్‌ను కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్లకపోతే భవిష్యత్తులో ప్రజలపై విద్యుత్ భారం పడుతుంది’ అని తెలిపారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న విద్యుత్‌లో థర్మల్ పవర్ ప్రాజెక్టుల వాటా గణనీయంగా ఉందన్నారు. ఆయా ప్రాజెక్టుల వ్యయాన్ని యూనిట్లకు విభజించి, యూనిట్ విద్యుత్‌కు అయ్యే ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నామని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని ఎంత తగ్గించగలిగితే వినియోగదారులకు అంత తక్కువ ధరకే విద్యుత్‌ను అందించగలుగుతామని చెప్పారు.
‘ఉడాయ్’ ఒప్పందం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే
వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన ఆర్డీఎస్ఎస్లో లేదని భట్టి విక్రమార్క వివరించారు. అంతకుముందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ‘ఉడాయ్’ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ డిస్కమ్‌లు కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయని చెప్పారు. 2017 జూన్ 30 నాటికి 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీటరింగ్ పూర్తి చేయాలని, 2018 డిసెంబర్ 31 నాటికి వ్యవసాయ వినియోగదారులు మినహా నెలకు 500 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని, 2019 డిసెంబర్ 31 నాటికి నెలకు 200 యూనిట్లకు పైగా వినియోగించే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను వినియోగించకుండా గత ప్రభుత్వం నష్టం చేసిందని విమర్శించారు.
రైతులపై భారం లేని ఆధునికీకరణ
ఆర్డీఎసఎస్ కింద చేపడుతున్న పనులు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు పెట్టేందుకు కాదని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతానికి, నెట్వర్క్ విస్తరణ, ట్రాన్స్ఫార్మర్ల అప్‌గ్రేడేషన్, ఎస్సీఏడీఏ, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు, సెక్షనలైజర్లు, ఆటో రీ-క్లోజర్లు వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. లైన్లో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వెంటనే గుర్తించేలా ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడితే లైన్‌మన్ అనేక కిలోమీటర్లు వెళ్లి లోపాన్ని గుర్తించాల్సి వస్తోందని, కొత్త సాంకేతికతతో సబ్‌స్టేషన్, కంట్రోల్ రూమ్‌కే సమాచారం వెంటనే చేరుతుందని వివరించారు.
9న 19,543 మెగావాట్ల డిమాండ్
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏటికేడు పెరుగుతోందని, ప్రస్తుతం డిమాండ్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 9న 19,543 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందని తెలిపారు. 15 వేల మెగావాట్ల సామర్థ్యానికి అనుగుణంగా గతంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థ, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు పస్తుతం 19 వేల నుంచి 20 వేల మెగావాట్ల వరకు డిమాండ్‌ను తట్టుకోవాల్సి వస్తోందన్నారు. వికేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం 2029-30 నాటికి రాష్ట్ర గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 24,624 మెగావాట్లకు, 2034-35 నాటికి 34,137 మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ సామర్థ్యాలను భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనుల కోసం కేంద్రం ఆర్డీఎస్ఎస్ ద్వారా 60 శాతం గ్రాంట్ అందిస్తోందని, మిగిలిన 40 శాతం రాష్ట్రం భరిస్తుందని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, సాఫ్ట్వేర్ పరిశ్రమలు, డేటా సెంటర్లు సహా ప్రతి ఉత్పత్తి రంగం విద్యుత్‌పై ఆధారపడి ఉందని, ఆర్థిక వ్యవస్థ విస్తరించాలంటే నాణ్యమైన విద్యుత్ సరఫరా కూడా అంతే వేగంగా పెరగాలని అన్నారు.
తక్కువ ధరకే విద్యుత్ కోసం సోలార్
తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవడంతోపాటు గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రపంచవ్యాప్తంగా సూచనలు వస్తున్నాయని భట్టి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని హరిత ఇంధనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బంది లేకుండా పైలట్ ప్రాజెక్ట్
ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. దీనికి అయ్యే ప్రతి పైసాను ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమై రైతులు సంతృప్తి చెందడంతోపాటు ఖజానాపై విద్యుత్ వ్యయం తగ్గితే మంచిదేనని చెప్పారు. ఒకవేళ రైతులు సోలరైజేషన్ వద్దని చెబితే వారికి ప్రస్తుతం ఉన్న ఉచిత విద్యుత్ సదుపాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతపై వేగంగా ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఆ వ్యవస్థలను పరిశీలించి వచ్చానన్నారు. భవిష్యత్తులో బ్యాటరీ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఉదయం నుంచి లభించే సోలార్ విద్యుత్‌ను నిల్వ చేసుకుని పగలు, రాత్రి రెండింటికీ వినియోగించుకోవచ్చని వివరించారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు సీరియస్‌గా ముందుకు వెళ్తున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మించి తమ అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. తెలంగాణ ఈ విషయంలో వెనుకబడిందనేది వాస్తవమని అన్నారు. 2014 నుంచి 2023 మధ్యకాలంలోనే పంప్డ్ స్టోరేజ్‌పై సరైన ప్రణాళిక రూపొందించి ఉంటే డీపీఆర్ తయారీ, నిర్మాణానికి పట్టే సమయం పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రణాళిక రూపొందించి ఉంటే ప్రస్తుతం ఎదురవుతున్న విద్యుత్ భారం ఉండేది కాదన్నారు. అయితే ఇప్పుడు తాము ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం సమీపంలో రైతులు అర్ధనగ్నంగా నిరసన చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రైతుల పరిస్థితి తనకు కూడా కనిపిస్తోందని, బాధగా ఉందని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఏర్పడింది కాదన్నారు. ఆరు నెలల్లో కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులు లేదా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మించడం సాధ్యం కాదని చెప్పారు. అయినప్పటికీ ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చయినా విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





