“ఈ 1000 రోజుల్లో ఒక్కటా రెండా 100 సంఖ్యలో కుంభకోణాలు – పదుల సంఖ్యలో సంక్షోభాలతో కాంగ్రెస్ వైఫల్య పాలన తెలంగాణకు శాపంగా మారింది. కమీషన్ల కోసమే సమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కేవలం అధికారంలో ఉండబోయేది 825 రోజులు మాత్రమేనని గుర్తెరుగాలి. అటుపోను మీరు తెస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు పాలిటెక్నిక్ విద్యార్థులకు జీ.వో 97, ఇంజనీరింగ్ విద్యార్థులపై నోటి దురుసు, పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగార్థులపై అవివేకపు మాటలు మాట్లాడితే కేంద్ర బీజేపీపై తిరగబడిన చందంగా తెలంగాణలో కూడా జెన్ జీ ఉద్యమం కూడా ఉప్పెనలా త్వరలోనే ముంచెత్తబోతుందని అవగతం అయితే 800 రోజులు కూడా కష్టతరమనే విషయాన్ని గమనించాలి.”

బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు, కేయూ.
మోసానికి ముసుగు వేసి అభయ ‘హస్తం’ పేరుతో తెలంగాణ ప్రజలకు “రిక్త హస్తం” చూపిన రాబందు కాంగ్రెస్ పాలనకు 1000 రోజులు పూర్తయింది. “ఇద్దెలు పడ్డోనికి ఇకమతులు ఎక్కువ” అనే మన పచ్చి తెలంగాణ సామెతకు ఏ మాత్రం తగ్గకుండా అంతిమంగా అధికారం కోసం 06 గ్యారంటీలు అనే ఇకమతును ముందటేసుకొని 100 రోజుల్లోనే అమలు చేస్తామనే ప్రతి ఇంటికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క సంతకాలతో కూడిన 06 గ్యారంటీల కార్డును అందజేశారు. వాస్తవానికి నిజంపై నయవంచన చేసిన దాడిలో నిజం గంగలో కొట్టుకుపోయింది. 100 రోజులు కాస్త 1000 రోజులయింది. ఈ 1000 రోజులు పాపం కాస్త తెలంగాణకు శాపంగా మారింది. అయినా నాడు అధికారం కోసం 420 హామీలు, సమాజంలోని ప్రతి వర్గాన్ని సలితెలువా నిండా మించినట్టు ఒక్కో వర్గానికి ఒక్కో డిక్లరేషన్ పెట్టి ఏకంగా 13 డిక్లరేషన్లతో 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో మాత్రం మీనా మేషాలు లెక్కిస్తూ.. ఆకాశానికి నిచ్చెసుకుని తిరుగుతున్న తీరుకు పూర్తి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుని చూస్తుంది.
దేశ చరిత్రలో అనతి కాలంలోనే అనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ముందుంటారు. స్వయంగా మంత్రి వర్గంలోని మంత్రి ముఖ్యమంత్రి అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే వారిచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం మనకు స్పుస్పష్టంగా కనిపిస్తుంది – 1000 రోజుల వైఫల్య పాలనలో ఓ మంత్రి తన ప్రభుత్వాన్ని ఎండగట్టింది, దాదాపు అర్ధ శతాబ్దం కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేసిన వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. ఇక ఓ సగటు సామాన్య ప్రజల పరిస్థితి మాత్రం అగమ్య గోచరమే. తెలంగాణలో ఏ మూలకు పోయి ఏ వ్యక్తిని కదిలించి చూసినా నమ్మి మోసపోయిన తీరుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారం తెచ్చి పెట్టిన ఆరు గ్యారెంటీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తొలుత ఆరు గ్యారెంటీల్లో ప్రప్రథమంగా చెప్పుకునే మహాలక్ష్మి పథకంలోని 500 రూ, లకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం వాస్తవ అర్హులను 1/2 శాతం కూడా గుర్తించలేదని చెప్పవచ్చు. 92 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఎల్పీజీ డేటా ప్రకారం వినియోగదారులు నమోదు కాగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ పథకానికి కేవలం 42 లక్షల మందిని ఎంపిక చేసి మిగతా దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది. ఇకపోతే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు తెచ్చిందో. దానికి పదింతల డ్యామేజీని సైతం కూడబెట్టింది. “ ఒక రకంగా ఉచిత బస్సు ప్రయాణం గురించి చెప్పాలంటే మహిళలకు ఉచితం పేరుతో పురుషుల జేబుకు చిల్లు పెట్టడమే అనుకోవాలి.” ఇకపోతే ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు దేవుడెరుగు.
“ రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత అసమర్థంగా వ్యవహరిస్తుంది. రైతు బంధు పథకాన్ని – రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేసినంత మాత్రాన భరోసా ఇచ్చినట్లు కాదనే విషయాన్ని గుర్తించలేకపోయింది. 2024 వానాకాలం పథకం పూర్తిగా భరోసాకే నోచుకోలేదు. ఇకపోతే ఇప్పటి వరకు qపథకానికి దాదాపుగా 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట 28,880 కోట్ల రూపాయలు చెల్లించి 2023 నాటి కేసిఆర్ ప్రభుత్వం దిగిపోయే ముందు రైతు బంధు కోసం కేటాయించిన 9 వేల కోట్ల రూపాయల మొత్తంలో కేవలం 7625 కోట్లను మాత్రమే విడుదల చేసి ఆ నిధులను సైతం తమ రైతు భరోసా పథకం ఖాతాలో వేసుకుని 36 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి సాయంగా పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్ ప్రకటనలు వేసుకుని తమ దిగజారుడు తనాన్ని ఎలుగెత్తి చాటుకున్నారు.” ఇకపోతే రైతు కూలీలు, కౌలు రైతుల మాట ఎక్కడ కూడా వినపడకుండా జాగ్రత్త పడుతూ బచాయిస్తూ వస్తుంది. వాస్తవిక హక్కుదారులు సైతం ఈ పథకాన్ని గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లు ఉన్నారు. వరి పంటకు బోసన్ అనేది ఒక బోగస్ పథకమనేది తేటతెల్లం అయింది. తొలుత పండిన ప్రతి గింజకు బోనస్ అని, తర్వాత సన్నాలకే 500 రూపాయలు బోనస్ అంటూ రైతులను సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేసి చివరికి 07 రకాల సన్నాలకే అంటూ తమ అసలు కుక్కబుద్ధి ఇదే అంటూ చెప్పకనే చెప్పింది.
గృహజ్యోతి పథకం కింద గుర్తించిన లబ్ధిదారులు లబ్ది పొందాల్సిన వినియోగదారులకు చాలా తేడా ఉన్నట్లు అధికారిక లెక్కల ప్రకారం గమనించవచ్చు. ఆరు గ్యారెంటీల కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 01 కోటి 09 లక్షలు కాగా ప్రభుత్వం అందులో గుర్తించిన అర్హుల సంఖ్య కేవలం 53 లక్షలు మాత్రమే. కొంతమేరకు ఈ పథకం ప్రజలకు ఉపశమనం ఇస్తున్నప్పటికీ వాస్తవికతను అందుకోలేకపోతుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేక ఆంక్షల పథకంగా అభివర్ణించవచ్చు. ఇకపోతే గ్రేటర్ లో, వివిధ జిల్లాల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కలర్లు మార్చుకుని తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటుంది. మొత్తం ప్రభుత్వం మొదటి విడతలో 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే కేవలం 1.00 లక్ష మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తయినట్టు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అనేక ప్రజా సమాచార మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం అని ప్రకటించడం తమను తాము తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు వ్యతిరేక శక్తిమని కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే ప్రకటించుకుంది. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తాడంటే నమ్మే పరిస్థితి లేదు.
యువ వికాసం పేరుతో కాంగ్రెస్ పార్టీ యువతకు దోకా చేసింది. 5 లక్షల విద్యా భరోసా క్రెడిట్ కార్డు అంటూ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమెప్పుడూ చూడని హామీగా, మేమెప్పుడూ మాట్లాడని మాటలుగా చూస్తూ విద్యార్థులను వంచించింది. ఇంటర్నేషనల్స్ స్కూల్స్ పేరుతో కమిషన్ల తాత్సర్యం చేస్తూ తెర వెనుక ఉన్న కమీషన్ల పార్టీ యథార్థతను బహిర్గతం చేసుకుంది. చేయూతను చివరి గ్యారెంటీగా పెట్టడంలోనే వృద్ధులపై, వికలాంగులపై, వితంతువులపై, కల్లుగీత, బీడీ ఇతర వర్గాలపై కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు ఆ పథకం అమలు తీరు ద్వారానే అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హోదాలో ఉన్న వ్యక్తి 2023 డిసెంబర్ ఎన్నికల ముందు మాట్లాడుతూ – “ అవ్వ-తాత మీరిప్పుడు ఫించన్ తీసుకుంటే రెండు వేలు – 09 తారీఖు ప్రజా ప్రభుత్వం వచ్చాక తీసుకుంటే నాలుగు వేలు అంటూ” ప్రగల్భాలు పలికి 1000 రోజులు గడిచింది. అయిన చేయూతకు ఊతం లేదు..”
వాస్తవానికి 1000 రోజుల కాంగ్రెస్ పాలన “ ప్రజల బాధలు వినలేని చెవిటి పాలన” అందుకు ఉదాహరణ మానవీయతతో కేసిఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసిన రైతు భీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం. ఇటీవల 45 ఏళ్ల దళిత రైతు ఓర్సు రాంచందర్ గుండెపోటుతో మరణిస్తే ఆయనకున్న అర ఎకరం భూమిపై ఉన్న రైతు భీమా క్లెయిమ్ కోసం ఆయన ముగ్గురు పిల్లలు, భార్య, సన్నిహితులు స్థానిక ఏఈఓ ను కలవగా ప్రభుత్వం ఆగస్ట్ 14 నుండి ప్రీమియం కట్టని కారణంగా నిలిచిపోయిందని అధికారులు చెప్పగానే ఆ పేద కుటుంబం కుంగుబాటుతో దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఒకనాడు కేసిఆర్ హయాంలో కేవలం ఆరు గుంటల భూమి ఉన్న స్టేషన్ ఘనపురం దళిత రైతు మరణిస్తే తన నలుగురు ఆడ బిడ్డలకు కొండంత భరోసా ఇచ్చిన పథకం హృదయ రహిత కాంగ్రెస్ పాలనలో కనుమరుగవ్వడం సిగ్గు చేటు. ఈ తప్పును సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు.
100 రోజుల నుండి 1000 వరకు చేరిన కాంగ్రెస్ పాలన కేవలం కేసిఆర్ ఆనవాళ్లను చెరిపే పనిలో మాత్రమే నిమగ్నమైంది. కష్టపడి కేసిఆర్ ముఖ్యమంత్రిగా వ్యవసాయాన్ని పండుగ చేస్తే ఎరువులకు యాప్, యూరియా కొరత, కరెంటు కోతలు, సాగునీటీ సంక్షోభం, పండిన పంటల కొనుగోళ్ల నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో మళ్లీ వ్యవసాయం దండుగ అనే స్థాయికి రేవంత్ రెడ్డి చేర్చాడు. కేటిఆర్ నేతృత్వంలో విశ్వనగరిగా, సాంకేతిక రంగానికి చిరునామాగా, పెట్టుబడులకు అనువైన కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నగరం తిరోగమన దిశగా పయనిస్తోంది. తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని నిరుద్యోగులను ఏమార్చి గద్దెనెక్కిన ప్రభుత్వం కేవలం 12 వేల ఉద్యోగాలతోనే కాలం ఏళ్లదీస్తూ పైగా పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఉద్యోగాల సంఖ్యను తమ ఖాతాలో వేసుకొని రాక్షసానందం పొందుతుంది.
ఈ 1000 రోజుల్లో ఒక్కటా రెండా 100 సంఖ్యలో కుంభకోణాలు – పదుల సంఖ్యలో సంక్షోభాలతో కాంగ్రెస్ వైఫల్య పాలన తెలంగాణకు శాపంగా మారింది. కమీషన్ల కోసమే సమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కేవలం అధికారంలో ఉండబోయేది 825 రోజులు మాత్రమేనని గుర్తెరుగాలి. అటుపోను మీరు తెస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు పాలిటెక్నిక్ విద్యార్థులకు జీ.వో 97, ఇంజనీరింగ్ విద్యార్థులపై నోటి దురుసు, పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగార్థులపై అవివేకపు మాటలు మాట్లాడితే కేంద్ర బీజేపీపై తిరగబడిన చందంగా తెలంగాణలో కూడా జెన్ జీ ఉద్యమం కూడా ఉప్పెనలా త్వరలోనే ముంచెత్తబోతుందని అవగతం అయితే 800 రోజులు కూడా కష్టతరమనే విషయాన్ని గమనించాలి.
100 రోజులు దాటిన ఆరు గ్యారెంటీల అమలు 1000 రోజులకు చేరింది. కానీ అమలులో మాత్రం ఏమార్పు, ఎగవేతలు, కూల్చివేతలు, కుట్రలు మాత్రమే ఉన్నాయి. ఈ పాలకుడు తనకు నమ్మక ద్రోహం చేయడంలో విద్యాభ్యాసం నేర్పిన గురువుకు గురు దక్షిణంగా అవసరమైనప్పుడు మన అస్తిత్వంపై ముప్పేట దాడి, అసమర్థతతో మన నీటి హక్కుల దోపిడీకి సహకరిస్తూ… 100 రోజుల నుండి కాస్త 1000 రోజులకు చేరింది.. తప్ప తెలంగాణ రాతను మారుస్తూ కాదు..





