– రెండోసారి, మూడోస్సారి ఇందిరమ్మ రాజ్యమే
– కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది
– సిద్దిపేట బహిరంగ సభలో కేసీఆర్, హరీష్, కేటీఆర్, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు
– అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలి
– సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనంతుల మదన్ మోహన్ పేరు
సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 19: మామ పోతే అల్లుడు.. అల్లుడు పోతే బామ్మర్ది అన్నట్లుగా సిద్దిపేటలో కుటుంబ రాజకీయాలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి, పాపారావు, లక్ష్మణ్ వంటి ఉద్యమకారులు, నేతలు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రాణాల కోల్పోతే కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ మామకు, హరీష్ బామ్మర్ది సుమన్ రావుకు వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌసులు ఎలా వచ్చాయని నిలదీశారు. గత పాలనలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం జరిగిందని, తమ ప్రజా ప్రభుత్వంలో శంకరమ్మకు, అలాగే చాకలి ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించామని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులు.. అసెంబ్లీ చర్చకు సవాల్
2014లో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు రెండోసారి అధికారంలోకి వచ్చాక అదే పదవి ఎందుకు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. హరీష్ తీరు వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం చెందిందని, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలోనూ గత పాలకుల వైఖరిని తప్పుబడుతూ అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏ మొఖం పెట్టుకుని ఇవాళ బజారులో తిరుగుతున్నావ్ హరీష్ అంటూ నిలదీశారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను పంచభూతాలను చెరబట్టిన దుష్ట చతుష్టయంగా అభివర్ణించారు. ఆస్తి కోసం సొంత చెల్లిని ఇంట్లోంచి గెంటేసిన ఒకాయన రాష్ట్రంలో ఆడబిడ్డలను చూస్తారట అని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలోనూ కమీషన్లు తీసుకున్నారని, తాము కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేశామని చెప్పారు.
2029, 2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే
పాపాల భైరవుడు రావాలంట.. ప్రజా పాలన పోవాలట.. మళ్లీ వచ్చి తెలంగాణను ఉన్నకాడికి ఊడ్చుకోవాలని చూస్తున్నారు అని బీఆర్ ఎస్పై సీఎం నిప్పులు చెరిగారు. సాగునీటి ముసుగులో మీ మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసునన్నారు. తాను ఈ తెలంగాణ బిడ్డను.. ఈ గడ్డపైనే పుట్టా.. ఈ మట్టిలోనే కలుస్తా.. తనను ఆశీర్వదించిన తెలంగాణ నేలకు అన్యాయం చేస్తానా అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గులు.. నీచులు తనను శంకించేలా ఆటలాడుతున్నారన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, 2029లో రెండోసారి, 2034 వరకు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 1983 నుంచి 2023 వరకు వివిధ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను తాము ఆపలేదని, వాటిని కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు ₹2 లక్షల రుణమాఫీ, రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, మూడేళ్లలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు (2 లక్షల ఇళ్లు పూర్తి), రైతు భరోసాకు రూ.36,000 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.78 లక్షల కోట్ల కేటాయింపు, సన్న వడ్లకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వివరించారు. రాష్ట్ర ప్రజలు బానిసత్వం కోరుకుంటున్నారా లేక ప్రజా పాలన కోరుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనంతుల పేరు
సిద్దిపేట గడ్డపై తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అనంతుల మదన్ మోహన్ సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1983లో కేసీఆర్‌పై విజయం సాధించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఘనత అనంతుల మదన్ మోహన్దేనని కొనియాడారు. అయితే ఆయన పేరును చరిత్ర పుటల్లోంచి చెరిపేయడానికి కేసీఆర్, హరీష్ రావు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆదేశించారు. కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం ఇచ్చింది మదన్ మోహనేనని, అవకాశం ఇచ్చిన వ్యక్తిపైనే పోటీ చేయడం నమ్మకద్రోహమని విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబులకు వెన్నుపోటు పొడిచి కొత్త రాజకీయ దుకాణం పెట్టుకున్నారని, 2004లో వార్డు మెంబర్ కూడా కాని హరీష్ రావు వైఎస్సార్ చొరవతో ఎదిగి ఆ తర్వాత కాంగ్రెస్‌పై కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. మీరు ఎన్ని బహురూపు వేషాలు వేసినా ప్రజలు నమ్మరన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




