- స్థానిక అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు
- కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్ ఎంపి బిబి పాటిల్ విజ్ఞప్తి
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 16 : ‘‘సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైద్రాబాద్ నార్త్ భాగంలోని అత్యధిక భాగంలో విస్తరించి వుంది. నాగపూర్…చంద్రాపూర్ ను అనుసంధానించే ఇంటర్ స్టేట్ రోడ్డు ఈ భాగంలో వుంది. అంతే కాదు రాష్ట్రానికి చెందిన పలు రోడ్లు ఈ భాగంలో విస్తరించి వున్నాయి. సుదీర్ఘ కాలంలో ఈ రోడ్లు పాడయిపోయాయి. దీనివలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను వైడెనింగ్ చేసి ఫ్లై ఓవర్లు కట్టాలని అనుకుంటున్నది. అయినప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయంలో లోకల్ ఆఫీసర్లు అడ్డంకులు సృస్టిస్తున్నందున రాష్ట్రం ఏమి చేయలేకపోతున్నది.
రాత్రి సమయాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లను సాధారణ ప్రజానీకం వాడుకోకుండా స్థానిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులు మూసి వేస్తున్నారు. దీని వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ విషయాలపై కేంద్ర రక్షణ మంత్రి తక్షణమే దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపేలాగా స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.’’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్ ఎంపి బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు.