సిఎం కేసీఆర్‌…‌ ప్రాణహిత పుష్కరాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?

మీ కంటే వాళ్లే నయం: విజయశాంతి మండిపాటు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో మండిపడ్డారు. గురువారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై సిఎం కేసీఆర్‌ ‌సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన పుష్కరాలపై నీలి నీడలు కమ్ముకున్నాయనీ ఆరోపించారు. 12ఏండ్లకొకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్‌ 13 ‌నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయన్నారు. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపనపల్లి ఇంటర్‌ ‌స్టేట్‌ ‌బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లిలతోపాటు ప్రాణహిత రాష్ట్రంలోకి అడుగుపెట్టే కొమురంభీం-ఆసిఫాబాద్‌ ‌జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరాలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ప్లాన్‌ ‌చేశారన్నారు.

పుష్కరఘాట్ల దగ్గర భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు వివిధ డిపార్ట్‌మెంట్ల ద్వారా భూపాలపల్లి జిల్లాలో 22.70 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 13 కోట్లతో ప్రపోజల్స్ ‌పంపగా.. ఇంతవరకు కేసీఆర్‌ ‌గవర్నమెంట్‌ ‌స్పందించలేదన్నారు. బంగారు తెలంగాణ చేశామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌.. ‌నెల రోజుల్లో పుష్కరాలు మొదలుకానున్నా.. ఇంకా ఘాట్ల వద్ద ఎలాంటి పనులు మొదలు పెట్టలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రం 2010 డిసెంబర్‌లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయన్నారు. అప్పటి పాలకులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగానే నిర్వహించారనీ, స్టేట్‌ ‌ఫెస్టివల్‌గా ప్రకటించి కాళేశ్వరం వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారన్నారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.72 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ.8 కోట్లు కేటాయించారనీ, అప్పట్లో 12 రోజుల పాటు రోజుకు దాదాపు లక్ష మంది పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. ప్రస్తుత సిఎం కేసీఆర్‌ ‌కూడా ఈ పుష్కరాల్లో పాల్గొన్నారన్నారు. కానీ, స్వంత రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్నా పుష్కరాలను మాత్రం కేసీఆర్‌ ‌పట్టించుకోవడం లేదనీ, ఇప్పటికైనా పుష్కరాలకు నిధులు విడుదల చెయ్‌ ‌కేసీఆర్‌. ‌నీకంటే ఉమ్మడి రాష్ట్రంలో సిఎంలే నయమన్నారు. కేసీఆర్‌ ‌సర్కార్‌ ఆటలు ఎంతో కాలం సాగవనీ, ప్రజలే రానున్న రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారనీ ఆ పోస్టులో విజయశాంతి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *