వేపచెట్టుకి ముత్యాలు పూసి తళ
తళా మెరుస్తుంటే
మామిడి చెట్టుపై గుండ్రటి నక్షత్రాలు
నోరూరిస్తుంటే
సూరీడి కళ్ళల్లో కూసింత వేసంగి
తాపం సురుక్కుమంటే
పాట విని వెళ్ళమని దారిలో చెట్టు
చెట్టుకి ఎగిరొచ్చి కోయిల పిలుస్తోంటే
శిశిరపు పత్రాల్లో హరితం ఆవిరై
మట్టిలో కలిపితే వాసంతం చిగుర్లేసి
హరితం ఆయువై కళకళలాడిస్తే
చైత్ర శుద్ధ పాడ్యమి..ఉగాదై పచ్చగా
దర్శనమిచ్చింది!
శుభ కృత నామ సంవత్సరం సకల శుభాలు
నింపుకొని కొని తెలుగు వారి గుమ్మాల్లోకి
అడుగుపెట్టి ఆశీస్సుల వర్షం కురిపిస్తోంది
పంచాంగ శ్రవణం, రాశి ఫలాలతో ప్రజానీకాన్ని
ఏరువాక ఫలాలతో రైతాంగాన్ని అప్రమత్తం చేస్తుంది….
జిహ్వకో రుచి కాదు ఆరు రుచులు
ఉంటేనే నిండైన జీవితం అన్న సత్యాన్ని
తెలుపుతుంది ఉగాది పచ్చడి!
మనసు గుమ్మానికి సకల శుభాల
మామిడి తోరణాలు కట్టి బతుకు ముంగిట
వెండి వెన్నెలని ముగ్గుగా పరిచి..
నూతన వస్త్రాలు కట్టబెట్టి ఆశీర్వచనాలు
అక్షతలుగా చల్లి దీవిస్తుంది ఉగాది..!!
– భీమవరపు పురుషోత్తమ్
9949800253, రాజమండి