శతాధిక వసంతాల ఆంధ్ర పత్రిక దిన పత్రిక

ఏప్రిల్‌ 1… ఆం‌ధ్రపత్రిక దిన పత్రిక ప్రారంభ దినం
స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర వహించిన తెలుగు పత్రిక ఆంధ్ర పత్రికకు పత్రికా రంగంలో విశిష్ట స్ధానం ఉంది. తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. తరవాత కాలంలో కృష్ణా పత్రిక (1901), స్వరాజ్య (1905), ఆంధ్ర ( వార) పత్రిక (1907), ఆంధ్ర (దిన) పత్రిక (1914), కాంగ్రెస్‌ 1921), ‌జమీన్‌ ‌రైతు (1930), వాహిని 1935), ఆంధ్రప్రభ 1938) ఇలా తెలుగులో పత్రికలు తెలుగు నాట ప్రారంభించ బడి ఆదరించ బడ్డాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్ర దిన పత్రిక పుట్టువు నొందింది.1814 ఏప్రిల్‌ 1‌వ తేదీన తెలుగు వారి అభిమాన దిన పత్రిక పురుడు పోసుకుంది.

వాస్తవంగా 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్ర పత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షర శాలలో ముద్రించ బడేది.1910 నుండి ఆంధ్రపత్రిక ‘ఉగాది సంచిక’లను ప్రచురించడం మొదలు పెట్టింది. సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచు కొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధ కులు, కవులు రచనలు చేసేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించే వారు. అయితే 1914 సంవత్సరంలో పత్రికను మద్రాసుకు తరలిం చారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దిన పత్రికగా ఏప్రిల్‌ 1 ‌వ తేదీన ప్రచురణ ప్రారంభమైంది.

నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్‌ ఆం‌ధ్ర పత్రిక దిన, వార పత్రికలకు, భారతికి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు, విజయవాడలలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభ మయ్యాయి..2017లో ఆంధ్రపత్రికను రేపల్లె నాగభూషణం అలియాస్‌ ‌పాంచజన్య అనే సీనియర్‌ ‌జర్నలిస్టు ఆధ్వర్యంలో నడిపించారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పాంచజన్య మరణించడంతో 1991లో పత్రిక నిలిచి పోయింది. తరువాత 1995లో పత్రికా ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరు కాగా, పత్రిక పున:ప్రస్థానం మొదలైంది. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్ర పత్రిక బ్రిటీష్‌ ‌పాలనలో దేశం ఉన్న స్థితిలో, తెలుగువారిలో రాజకీయ చైతన్యం తీసుకు రావడానికి ఉపకరిం చింది. భారత జాతీయోద్యమాన్ని పత్రిక సూత్ర ప్రాయంగా సమర్థించడమే కాక, తొలినాళ్ళ నుంచీ గాంధేయ వాదానికి మద్దతుగా నిలిచింది. 1936 కాలంలో తెలుగునాట కమ్యూనిస్టులు పల్లెల్లోకి కమ్యూనిస్టు, సోషలిస్టు సాహిత్యం తీసుకు వెళ్ళినప్పుడు ముందు ఆ ఊరిలో ఆంధ్రపత్రిక తెప్పించే వారెవరనేది కనుక్కునేవారు.

ఆంధ్రపత్రిక తెప్పించేవారు కనీసం రాజకీయ, సాంఘిక విషయాల పట్ల కొంత అవగాహన అయినా కలిగివుంటారన్నది వారి అంచనా. అప్పటి వరకూ తెలుగు పత్రికలన్నీ గ్రాంధిక భాషలో ఉండగా, తెలుగు పత్రికా రంగ చరిత్ర 1941 నుంచి ఒక కొత్త పుంత తొక్కే దిశగా అడుగులు వేసింది. నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ సంపాదకత్వాన్ని చేపట్టడం, గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషా ఉద్యమం, తాపీ ధర్మారావు వాడుక భాష వినియోగ ప్రయోగాలు ఊతం ఇవ్వగా, పత్రికా రచనలో ప్రజల భాషను ఒక పద్ధతిలో ప్రవేశపెట్టి, వాడుక భాషలోనే వార్తలను అందించే ఆధునిక సంప్రదాయానికి తెర లేచింది. ఒకనాడు సమాజ శ్రేయస్సే పత్రికల ప్రధాన లక్ష్యం ఉండేది. అందుకే ఆ నిబద్దత కారణంగానే ఎక్కువ కాలం పత్రికలు మనగలిగాయి. ప్రస్తుతం యజమానుల వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకు సాధనాలుగా పత్రికలు ఉపయోగ పడు తున్నాయి. దీర్ఘకాలిక మనుగడ, ప్రజాదరణ కోసం ఈ ధోరణి మారాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page