వైద్య రంగంలో తెలంగాణను నెంబర్‌ ‌వన్‌గా నిలపాలె

సీ సెక్షన్‌ ఆపరేషన్లు బాగా తగ్గించాలె

నార్మల్‌ ‌డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్‌

‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సీసీ కెమెరాలు..సమయపాలన తప్పనిసరి

మందుల కొరత లేదు..డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు

రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మోకాళ్ల ఆపరేషన్లు

వైద్యరంగంలో డబులు ఇంజన్‌ ‌గ్రోత్‌ ‌రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ‌చిట్టచివరి స్థానంలో..

కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధి చెందేదా..?

జగిత్యాల సభలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీష్‌ ‌‌రావు

జగిత్యాల, మే 4(ప్రజాతంత్ర ప్రతినిధి) : వైద్య రంగంలో తెలంగాణను దేశంలో నెంబర్‌ ‌వన్‌గా నిలిపేందుకు కృషి చేయాలని వైద్య సిబ్బందికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ ‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. అంతకు ముందు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌, ‌ప్రభుత్వ నర్సింగ్‌ ‌కళాశాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్‌సిఎచ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..కొరోనా సమయంలో బాగా కష్టపడి అత్యుత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. ఇంటింటికి ఆరోగ్య సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచి జాతీయ ఆరోగ్య మిషన్‌ ‌ప్రశంసలు పొందిందని అన్నారు. ‘ఈ సర్వే వల్ల ఇంటి వద్దే వైద్యం అందించే సౌకర్యం కల్పించారు. హాస్పిటళ్ల మీద లోడ్‌ ‌తగ్గింది. ప్రజలకు ఆందోళన తగ్గింది. నీతి అయోగ్‌ ఇది గుర్తించి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించింది. ఇతర రాష్ట్రాలు ఇలా చేయాలని కేంద్రం సూచించింది’ అని హరీష్‌ ‌రావు తెలిపారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం పెంచాలంటే ఆశా కార్యకర్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు, అరెస్టులు, గుర్రాలతో తొక్కించడం, నిరహార దీక్షలు చేశారని, అది ఇప్పుడు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ వొచ్చినప్పుడు ఆశాల జీతం 1500 ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 9500 ‌రూపాయలకు పెంచారు. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా వర్కర్ల జీతం 4 వేలు మాత్రమే. రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రంలో 3 వేలు, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌ ‌లో ఆశాల జీతం 3 వేలు మాత్రమే అని హరీష్‌ ‌రావు అన్నారు. మీ జీతం కేసీఆర్‌ 9500‌కు పెంచారు. మన రాష్ట్ర గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని అన్నారు. జగిత్యాల జిల్లా ఆరోగ్య సమీక్ష జరిపాను. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య 44 శాతం మాత్రమే ఉంది. కేసీఆర్‌ ‌కిట్‌ ‌వొచ్చాక 56 శాతం మంది ఎందుకు ప్రయివేటుకు వెళ్తున్నరు. అద్భుతంగా 18 కోట్లతో వంద పడకల హాస్పిటల్‌ని జగిత్యాలలో ప్రారంభించుకున్నం. 12 లేబర్‌ ‌రూమ్‌లు ఉన్నాయి. న్యూ బోర్న్ ‌బేబీ కేర్‌ ‌సెంటర్‌ ‌పెట్టాం. పీడియాట్రిక్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ ఉం‌ది. అన్ని వసతులు కల్పించాక ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవాలు సంఖ్యను పెంచాల్సిన బాధ్యత •శాల పైననే ఉందన్నారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ హాస్పిటళ్లలో కాన్పులు 30 శాతం మాత్రమే అయ్యేవి. సీఎం వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి, కేసీఆర్‌ ‌కిట్‌ ‌వంటి పథకాలు వొచ్చాక 56 శాతానికి పెరిగాయి. 26 శాతం కాన్పులు ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగాయి. జగిత్యాలలో ఎందుకు పెరగడం లేదో ఆలోచించండని వైద్య సిబ్బందిని కోరారు. మొదటి ఎఎన్‌సి చెకప్‌ ‌మీరే చేస్తున్నరు. నాల్గవ ఎఎన్‌సి చెకప్‌ ‌కూడా మీరే తీసుకోవాలి. మీ పరిధిలో ప్రసవాలు చేయించుకునే వారిని ప్రభుత్వ హాస్పిటళ్లలోనే చెయించుకునేలా చూడాలి. అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో కాన్పు అయితే 12 వేల రూపాయలు ఇస్తున్నం. కేసీఆర్‌ ‌కిట్‌ ఇస్తున్నం. ఆటో కిరాయి లేకుండా ఇంటి వద్ద దింపుతున్నం. కాని ప్రయివేటుకు వెళ్తే ఆపరేషన్లు చేసి 50-60 వేలు ఖర్చు చేస్తున్నారు. అనవసరంగా సీ సెక్షన్‌ ఆపరేషన్‌ ‌వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్న విషయాలు వివరించాలన్నారు. జగిత్యాల జిల్లాలో 80 శాతం సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా 30 శాతం కన్నా ఎక్కువ సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో 60 శాతం సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నయి. కాని జగిత్యాల లో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా అంటే 80 శాతం జరగడం బాధాకరమని మంత్రి హరీష్‌ ‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లవాడు పుట్టిన వెంటనే తొలి గంటలోనే తల్లి పాలు తాగాలి. 36 శాతం మందే మన రాష్ట్రంలో తొలి గంటలో తల్లిపాలు తాగుతున్నరు. 64 శాతం మంది తల్లిపాలకు మొదటి గంటలో దూరమవుతున్నరు. తొలి గంటలో పిల్లలు తల్లి పాలు తాగితే చురుకుగా ఉంటరు. ఎదుగుదల బాగా ఉంటుంది. రోగ నిరోథక శక్తి పెరుగుతుంది. సి.సెక్షన్‌ ఆపరేషన్‌ ‌వల్ల తల్లి 30 ఏళ్లకో రోగాల బారిన పడుతుంది. ఏ బరువు పని చేయలేని పరిస్థితి ఎదుర్కుంటున్న విషయాలు గర్భిణులకు వివరించాలన్నారు. మూఢ నమ్మకాలతో అయ్యగార్లు ముహూర్తం పెడితే పురుడు పోయడం సరి కాదు. శాంతి హోమం అని ఇంకా ఏదో అని ఖర్చులు పెడుతున్నరని డాక్టర్లు చెబుతున్నరు. గండాల పేరుతో భయపెడుతున్నరని చెబుతున్నరు. ఈ మూఢ నమ్మకాల వల్ల తల్లి, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ మూఢనమ్మకాలతో డబ్బులు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. వచ్చే ఆరునెలల్లో ఆపరేషన్‌ ‌ల సంఖ్యను జగిత్యాలలో 50 శాతానికి తగ్గించాలి. అందరం కలిసి పని చేద్దాం. ఇదంతా నా కోసం కాదు. మన అక్కా చెళ్లేల్ల ఆరోగ్యం కాపాడుదాం. ఈ దిశగా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి అనుమతితో నార్మల్‌ ‌డెలివరీ చేస్తే ఇన్సెంటీవ్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నం. ఆశాకు, ఎఎన్‌ఎం‌కు, డాక్టర్‌కు, స్టాఫ్‌ ‌నర్స్‌కు ఇస్తాం. సీ సెక్షన్‌ ఇస్తే ఇప్పటిదాకా డబ్బులు ఇస్తున్నం. అది బంద్‌ ‌చేస్తామని తెలిపారు. తెలంగాణ వొచ్చాక వైద్య ఆరోగ్య రంగం బాగా అబివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు అన్ని ఆంధ్రలోనే పెట్టారు. డాక్టర్లు, మెడికల్‌ ‌కాలేజీలు అక్కడే. 75 ఏళ్లలో తెలంగాణలో ఉన్నవి వరంగల్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌లలో 3 మాత్రమే వొచ్చినవి. కాని సీఎం తెలంగాణలో మూడింటిని ఏడేళ్లలో 33 కాలేజీలు చేశారు. జగిత్యాలలో మెడికల్‌ ‌కాలేజి వొచ్చిందంటే 650 పడకల హాస్పిటల్‌ ‌వొస్తుంది. 150 మంది డాక్టర్లు పని చేస్తరు. పిల్లలకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అం‌దుతుంది. ఇది టీఆర్‌ఎస్‌ ‌వల్లే సాధ్యం. కాంగ్రెస్‌ ‌వాళ్లు చాలా మాట్లాడుతున్నరు. మరి వారు కరీంనగర్‌ ‌జిల్లాలో ఎందుకు మెడికల్‌ ‌కాలేజీలు పెట్టలేదని మంత్రి హరీష్‌ ‌ప్రశ్నించారు. గతంలో కరీంనగర్‌ ‌జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీ రాలే. ఇప్పుడు రామగుండంల వొచ్చింది. జగిత్యాలల వొచ్చింది. రేపు సిరిసిల్లలో వొస్తది, కరీంనగర్‌లో వొచ్చే ఏడాది కల్ల వొస్తది. చదువుకోవడానికి తెలంగాణ వొచ్చేనాడు ఎంబీబీఎస్‌ ‌సీట్లు 700 మాత్రమే తెలంగాణలో ఉండేది. ఇవాళ 700 నుండి 2840 సీట్లకు ఎంబీబీఎస్‌ ‌సీట్లు పెంచాం. వీటిని 5420కి పెంచుతున్నం. పేదలకు వైద్యం-మన విద్యార్థులకు చదువు ఇస్తున్నామన్నారు. ఒకడు పాదయాత్ర, సైకిల్‌ ‌యాత్ర, డబులు ఇంజన్‌ ‌స్పీడ్‌ అం‌టూ చేస్తున్నరు. దవాఖానాల్లో ఏ రాష్ట్రంలో బాగ చేస్తున్నరని కేంద్రం లెక్కలు చెప్పింది. అందులో తెలంగాణ దేశంలో మూడోఉంది. ఉత్తర ప్రదేశ్‌ ‌నుండి సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నరు. ఆ రాష్ట్రం వైద్య సేవలు అందించడంలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇది డబులు ఇంజన్‌ ‌గ్రోత్‌. ఎవరి పరిపాలన బాగున్నట్లని  బీజేపీని ఎద్దేవాచేశారు. రాహుల్‌ ‌గాంధీ వొస్తున్నడు. ఇన్నేళ్లు మీరే కదా పాలించింది. తెలంగాణ రాక ముందు కరీంనగర్‌ ‌జిల్లాలో డయాలిస్‌ ‌సెంటర్‌ ఉం‌దా. కిడ్నీ రోగం వొస్తే హైదరాబాద్‌ ‌లేదా వరంగల్‌ ‌వెళ్లాలి. తెలంగాణ రాకముందు మూడు కేంద్రాలు మాత్రమే  ఉండేవి. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం మాత్రమే ఉండేవి. తెలంగాణలో ఇవాళ 102కు పెంచినం. జగిత్యాలలో పెట్టినం, ధర్మపురిలో పెట్టినం, కోరుట్ల, చొప్పదండిలో ఈ వారంలో డయాలిసిస్‌ ‌సెంటర్‌ ‌మంజూరు చేస్తం. కాంగ్రెస్‌ ‌వాళ్లు పెద్ద నోరు పెట్టుకోని మాట్లాడుతున్నరు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి బాగా మాట్లాడుతున్నరు. ఎందుకో మెడికల్‌ ‌కాలేజీలు, డయాలిసిస్‌ ‌కేంద్రాలు ఆనాడు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు ఐసీయూ బెడ్లు 200 మాత్రమే ఉండేవి. ఇవాళ వాటిని 6 వేలకు పెంచినం. పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నం. తెలంగాణ రాక ముందు ఆరు ఎంసీహెచ్‌ ‌కేంద్రాలు ఉండేవి. ఇవాళ వాటిని 28కు పెంచుకున్నం. 403 కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. పేదలకు మంచి వైద్యం దొరకాలని 28 ఎంసీహెచ్‌ ‌కేంద్రాలు పెట్టినం. పేదల వైద్యం పైన సీఎం ఎంత సీరియస్‌గా దృష్టిపెట్టారో ఆలోచించండి. ఈ కాంగ్రెస్‌ ఉం‌టే ఇవన్నీ వొచ్చేవా ఆలోచించండని కోరారు. కొన్ని జిల్లాల్లో తెలంగాణ వొచ్చాక ప్రయివేటు హాస్పిటళ్లకు తాళాలు పడుతున్నయి. దుబ్బాకలో ప్రభుత్వ హాస్పిటల్‌ ‌పెట్టాక 3-4 గెనకాలజిస్టు హాస్పిటళ్లకు తాళాలు పడ్డాయి. ప్రయివేటు హాస్పిటళ్లతో పోటీ పడి వైద్యం అందించాలి. ప్రయివేటు కన్నా చక్కటి హాస్పిటల్‌ ఇక్కడ కట్టినం. అన్ని సౌకర్యాలు కల్పించినం. ప్రజలకు రోగాలు  రాకుండా కాపాడాడమే మన బాధ్యత. ఎన్సీడీ స్క్రీనింగ్‌ ‌పెంచండి. సుగర్‌, ‌బీపీ ఉన్నవాళ్లను గుర్తించండి. వాళ్లకు మందులు ఇవ్వండి వైద్య సిబ్బందికి సూచించారు. అన్ని పీహెచ్సీలలో కెమెరాలు పెట్టిస్తున్న. డాక్టర్లు 9 నుండి నాల్గింటి వరకు ఉంటున్నరా లేదా, మందులు ఇస్తున్నరా లేదా అన్ని  చూస్తం. మీకు ఏది కావాలంటే అది ఇస్తం. పని కూడా అలా చేయాలన్నారు. ప్రతీ నెల ఆశాలతో మీటింగ్‌లు పెడతా, కలెక్టర్లు, డీఎంఈ రమేష్‌ ‌రెడ్డి, ఇతర వైద్యాధికారుల అందరీ లెక్క చూస్త. నా లెక్క సీఎం చూస్తరని హరీష్‌ ‌రావు అన్నారు. దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ  ఆదర్శంగా నిలిపేలా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. జగిత్యాలకు సీటీ స్కాన్‌ ‌మిషన్‌ ‌మంజూరు చేస్తున్నం. జగిత్యాలలో టీ-డయాగ్నసిస్‌ ‌కేంద్రం పెట్టినం. ఉచితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్తపరీక్షలు చేయాలి. ప్రజలు ఎందుకు ప్రయివేటు పరీక్ష కేంద్రాలకు వెళ్తున్నరు. మీరు ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలి. 56 పరీక్షలు ఉచితంగా చేస్తున్నం. రేడియాలజీ ల్యాబ్‌ ‌కూడా జగిత్యాలలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కాన్పు సమయంలో మాతా శిశు మరణాల్లో తమిళనాడు ముందుండేది. ఆ రాష్ట్రాన్ని అధిగమించినం.  దేశంలో మనం రెండో స్థానంలో నిలిచాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మోకాళ్ల ఆపరేషన్లు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటళ్లలో చేయిస్తం. నలబై రూపాయలకు రెండు పూటల భోజనం రాదు. హాస్పిటళ్లలో ప్రతీ పేషంట్‌కు 80 రూపాయలకు కడుపునిండా భోజనం పెట్టనున్నాం. శానిటేషన్‌కు మంచానికి ప్రతీ నెల 5 వేల రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు 7500కు పెంచుతున్నం. వారితోను మంచిగ పని చేయిస్తం. నెల నెలా జీతం ఇస్తం. వైద్యరంగంలో ప్రతీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నం. పాము కాటుకు, కుక్క కాటుకు మందు లేదు అనే పరిస్థితి లేదు. మందులు ఉచితంగా ఇస్తున్నం. మందులు లేవు అన్న పరిస్థితి లేదు. జనరిక్‌ ‌మందులు ఇవ్వాలి. బయట మందులు రాస్తే డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటం. అనవసరంగా బ్రాండెడ్‌ ‌మందులకు చీటీలు రాస్తున్నరు. ప్రభుత్వ హాస్పిటళ్లలో రాయవద్దు. అవసరమైన డబ్బులు సూపరిండెంట్ల వద్ద నిల్వ ఉంచామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌, ‌జగిత్యాల, చొప్పదండి, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్‌ ‌కుమార్‌, ‌రవి శంకర్‌, ‌విద్యాసాగర్‌ ‌రావు, టీఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ఎం‌డి చంద్రశేఖర్‌ ‌రెడ్డి, డీఎంఇ రమేష్‌ ‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్‌ ‌దావా వసంత, రాష్ట్ర ఆర్థిక మండలి చైర్మన్‌ ‌రాజేశం గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌. ‌రమణ, కలెక్టర్‌ ‌రవి నాయక్‌, ‌జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌ ‌చంద్రశేఖర్‌ ‌గౌడ్‌, ‌డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ ‌రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *