తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పాలనలో ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోతుంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో కేజీ నుండి పీజీ వరకు నిర్భంద ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తామన్న హామీలు నెరవేరలేదు. ఆనాడు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. అందులో భాగంగా కుల, మత, పేద, ధనిక అనే బేధం లేకుండా సామాన్యుల పిల్లల నుండి అసామాన్యుల పిల్లల వరకు, అటెండర్ పిల్లల నుండి కలెక్టర్ పిల్లల వరకు ఒకే బేంచిలో చదివేలా ‘‘కామన్ స్కూల్’’ విధానాన్ని అమలు చేస్తామన్నారు. కానీ పూర్వ ప్రాథమిక విద్యనుండి ఉన్నత, ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్య వరకు మౌలిక సదుపాయాలు మరియు బోధన, బోధనేతర ఖాళీలు, బదిలీలు, పదోన్నతులు, నియామకాలు లేక ఖాళీలతో పర్యవేక్షణ కరువై విద్యావ్యవస్థ దయనీయ స్థితిలో కొనసాగుతుంది. కరోన విపత్తు ప్రభావంతో ప్రజలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పిల్లల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రభుత్వం వారి సంఖ్యకు సరిపడ మౌలిక వసతులు, ఉద్యోగుల భర్తీ చేయకపోతే, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలవైపు వెళ్లిపోవడం జరుగుతుందని గమనించండి. ఈ తిరోగమన విధానం వస్తే మల్లీ ఫీజుల దోపిడి పెంచరిల్లిపోతుంది. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణకు పూనుకోవాలి. ఇప్పటికే ఉదాసీనత వల్ల వేసవి సెలవులు గడిచిపోతున్నాయి. మౌలిక వసతుల నిర్మాణానికి ఈ కాలంలో పూర్తిచేయాల్సి ఉండే కానీ విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్నప్పటికీ ‘‘మనఊరు – మనబడి’’, ‘‘మనబస్తీ-మనబడి’’ కొత్త పథకం ప్రచారానికి వేసవి సెలవు కాలం గడిచిపోయింది. ఎక్కడ నిర్మాణాలు ఆశించినంత జరగక పోవడం శోచనీయం.
ఇలా వేసవి సెలవు)లో శిథిలావస్థలో ఉన్న భవనాల మరమ్మత్తులు, కొత్త తరగతి గదుల నిర్మాణం వంటివి పూర్తి చేయలేక పోవడం చూస్తుంటిమి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంచనాలు, కేటాయింపులు, టెండర్లు మొదలగు ప్రక్రియలన్నీ ముగించుకొని పనులు ఎప్పుడు మొదలు పెడుతారో ? ఎప్పుడు పూర్తి చేస్తారో ! తెలియక అగమ్య గోచరంగా ఉంది. అలాగే మౌలిక వసతుల నిర్మాణానికి బదిలీలు, పదోన్నతులు, నియామకాలకు అనువైన వేసవి సెలవుల కాలాన్ని పాలకులు ఉదాసీనత వల్ల వృదాగానే గడిచి పోతునాయి. మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. చాలా చోట్ల పై కప్పులు పెచ్చులూడి ఎప్పుడు తలమీద పడుతాయో, నెర్రలు బారి కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గదులు, ప్రహారీ గోడలతో భయం గుప్పిట్లో పిల్లలు ఈ విద్యా సంవత్సరం కూడా వెల్ల దీయాల్సిందేనా ! అని ఆవేదన చెందుతున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో ‘‘మనఊరు- మనబడి/ మనబస్తీ-మనబడి’’ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రకటించి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు దీటుగా సర్కారీ పాఠశాలలను బలోపేతం చేస్తామని, వాటిలో సకల సౌకర్యాలు ఏర్పరచుతామన్నారు.
అంతేకాదు ప్రజలు కోరుకున్నట్లు ఆంగ్ల మాద్యమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి దశల వారిగా అన్ని స్థాయిల్లో చేపడుతామన్నారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచకపోగా, దాతల ద్వారా విరాలాలు సేకరించి ప్రభుత్వ కేటాయింపులు జతచేసుకొని అభివృద్ధి చేసుకోమ్మని చెప్పడం భావ్యమా ! మరోవైపు తెలుగు మీడియం సరిపడ బోధించడానికి టీచర్లు లేక కొరతతో కాలం వెల్లదీస్తుంటే ? మరోవైపు ఆంగ్ల బోధన బాధ్యతలు తలపెట్టడం న్యాయమా ? ఆంగ్ల ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా ఏ మేరకు విద్యారంగం అభివృద్ధి సాధిస్తారు. పాఠశాలలో మౌళిక వసతులు కల్పించకుండా, టీచర్లను నియమించకపోతే విద్యార్థుల సంఖ్య పడిపోతుంది.
అదేసాకుగా చూపి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేత / విలీనం పేరుతో బడులను కుదించడం, టీచర్లను రేషనలైజేషన్ చేయడం జరుగుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో లౌఖిక విధానానికి విఘాతం చేయపూనుకుంటుంది. దీని వలన విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు, వైజ్ఞానిక దృక్పథంకు తావేలేకుండా చేస్తూ ఆశాస్త్రీయ పద్ధతులను రాబోవు తరాలవారు అజ్ఞానాందకారంలోకి జారిపోతారని విద్యావేత్తలు, విశ్లేషకులు ఆవేదన వెల్లబుచ్చుచున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్యాపకు(ఉపాధ్యాయు)ల ఖాళీల వలన విద్య నాణ్యత ప్రమాణాలు ఆశించినంత లేకపోవడం నిరంతర పర్యవేక్షణలు జరగకుండానే గత 8 సంవత్సరాలుగా విద్యాబోదన కొనసాగుతుంది. ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వం ప్రవేశ పెట్టడం మంచి ఉద్ధేశమే అయినప్పటికీ ఇన్ని ఖాళీల నడుమ ఇలాంటి పరిస్థితిలో ఆశించిన లక్ష్యాన్ని చేరగలమా ఆలోచించండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో విద్యారంగానికి 14 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం తగ్గిస్తూ వస్తూ ప్రస్తుతం 5.28 శాతానికి వచ్చింది. ఇలాంటి వేళ విద్యారంగ అభివృద్ధి ఎలా సాధ్యమౌతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత విశ్వాసాలకు ఇస్తున్నంత ప్రాధాన్యత మనుషులకు జీవనోపాధి కల్పించే విద్యాలయాలపై చేయకపోవడం అన్యాయం కాదా ! మనుషుల జీవితాలకు మార్గదర్శి మతసంస్థలా- విద్యాసంస్థలా అంటే ? మత సంస్థలు నమ్మకం, విద్యాసంస్థలు వాస్తవం. నమ్మకోసం కోట్ల ధనం, కిలోల కొద్ధి బంగారం ఇచ్చే పాలకులారా, దాతలారా ! జీవితాలను మార్చే విద్యాసంస్థని విస్మరించడం భావ్యమా ! నమ్మకం పై ఉన్న ప్రేమ.. వాస్తవంపై లేక పోవడం విడ్డూరంగా ఉంది. విద్యావ్యవస్థ మీద ధనం (దృష్టి) పెడితే, విజ్ఞాన వంతులై ప్రశ్నిస్తారని భయమా ? ఇది భావ్యమా కాదు కదా !. మానవ వికాసానికి, ప్రగతికి, చైతన్యానికి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి. పాలకులారా కరోనా గుణపాఠం మరిచారా ! మతసంస్థలు మూతపడ్డాయి. శాస్త్రీయ పరిశోధనతోనే వ్యాక్సిన్ ద్వారా మహమ్మారిని తరిమేసాం.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలన్నా తెలంగాణ సమాజం విద్యా వికాసము నాణ్యతలో ఉన్నత స్థాయిలోకి వెల్లాలన్న తల్లిదండ్రుల కోరికలు తీర్చాలన్నా మన ప్రభుత్వం చిత్త శుద్ధితో పూర్వ ప్రాథమిక విద్య నుండే ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయ, సాంకేతిక విద్యాలయ విద్యల వరకు బోధన, బోధనేతర ఖాళీల భర్తీ చేయాలి. దీనితోపాటు వీటిలో మౌలిక వసతులను సాంకేతిక పరికరాలు, అధునాతన విద్యాబోధన పరికరాలు ఏర్పరచాలి. పారిశుద్ధ్య సిబ్బంది కూడా అత్యవసరమని భావించి నియమించాలి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఆంగ్ల మాధ్యమ బోధనకు సరిపడా ఆంగ్లబోధనోపాధ్యాయుల పోస్టులను సృష్టించి నియామకాలు చేపట్టాలి. అలా కాకుండా నామమాత్రంగా ఆర్బాటానికి ప్రారంభిస్తే ఇటు తెలుగు అటు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యమైన విద్యను అంధించలేకపోగా రెంటికి చెడ్డ రేవడిలా, విద్యార్థుల భవిష్యత్తు మారిపోతుంది. ఈ గందరగోళానికి తెరపడేలా దశాబ్ధాల నిర్లక్ష్యానికి ఆత్మగౌరవ పాలనలోనైనా తెరపడాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి, దేశ, ప్రపంచ స్థాయి నాన్యత, నైపుణ్యాల నిలయంగా మార్చాలి. దీనికి కావాల్సింది పాలకుల చిత్తశుద్ధితోడైతే సుసాధ్యమేనని తెలంగాణ సమాజం భావిస్తుంది. వారి ఆశయాలు నెరవేరాలని భావిస్తూ…
– మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్, వరంగల్, 9573666650