కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి
కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీజేపీ, బీఆరెస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేటీఆర్… నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తన హయాంలో తీసుకొచ్చిన వేటినీ బీఆరెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టారని, బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ లలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. వికారాబాద్-తాండూర్ రైల్వే లైన్ కు ఇప్పటికీ మోక్షం లభించలేదని ఎద్దేవా చేశారు.
కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి మాట అటుంచితే నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసి రెండు జిల్లాల్లో కలిపారన్నారు రేవంత్ రెడ్డి. చిన్న చిన్న ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చిన ప్రభుత్వం… కొడంగల్ ను ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే బీఆరెస్ నేతలను కొడంగల్ కు ఏం చేశారో నిలదీయాలన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కేవలం ఆ మూడు నియోజకవర్గాలకే సీఎం, మంత్రులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కొడంగల్ రాష్ట్రంలో భాగం కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని, అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే గౌరవం కొడంగల్ కు దక్కిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 17న సోనియా గాంధీ గారు తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో జరిగే విజయభేరిలో 5గ్యారంటీలను ప్రకటించనున్నారని తెలిపారు. వేలాదిగా తరలివచ్చి విజయభేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.