- కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్ ఇష్యూ
- గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాలి
- రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి
- మిడియాతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 8 : గవర్నర్ దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మిడియాతో మాట్లాడుతూ..గవర్నర్ తక్షణమే తన అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు..తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయని రేవంత్ రెడి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుటుంబంలో ఉన్న సమస్యలను తప్పించుకునేందుకు.. కేసీఆర్ గవర్నర్‌ను సాకుగా చూపుతున్నారన్నారు. కేటీఆర్ తనను సీఎం చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమని..కేసీఆర్ కుటుంబ సభ్యులతో చెబుతున్నారన్నారు. కేసీఆర్ దిల్లీ వెళ్లి వైద్య చేయించుకుంటున్నారంటే.. తెలంగాణలో వైద్యం పడకేసినట్లే కదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వర్సిటీల్లో ఖాళీలున్నాయని గవర్నర్ అఫీషియల్‌గా నివేదిక ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..బండి సంజయ్ ఎందుకు రాలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు కోపం వొస్తుందనే కిషన్‌రెడ్డి, సంజయ్ రాలేదన్నారు. కిషన్‌రెడ్డి సిటీలో ఉండి ఎందుకు రాజ్‌భవన్‌కి వెళ్లలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. తెలంగాణలో పరిపాలన గాడి తప్పిందని వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయలేక తప్పించుకోవడం కోసం రాజ్ భవన్‌తో గొడవ పెట్టుకుంటున్నారని గవర్నర్ ఢిల్లీలో చెప్పార న్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీ గవర్నర్ పరిధి అని..గవర్నర్‌కి సెక్షన్ 8 ప్రకారం విశేష అధికారులున్నాయి.. పరిపాలన గాడి తప్పింది కాబట్టి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. డ్రగ్స్ మహమ్మరిపై గవర్నర్ తమిళిసై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు వినకపోతే కేంద్రానికి లేఖ రాయాలని సూచించిన ఆయన.. కేంద్ర అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.. గవర్నర్ విచక్షణ అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక, గవర్నర్ గారి తల్లి భౌతికకాయాన్ని సొంత గ్రామానికి పంపేందుకు హెలికాప్టర్ ఇస్తే ఏమైంది? అని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.. గవర్నర్‌కి సానుభూతి చెప్పాల్సిన బాధ్యత సీఎం వి•ద ఉందన్న ఆయన.. బాధ్యతా రహిత్యంగా వ్యవహారం చేస్తారని అనుకోలేదన్నారు.. అయితే, ఇదే సమయంలో.. గవర్నర్ ప్రతీ చర్యను సమర్థించడం లేదన్నారు. ఇది కేసీఆర్-తమిళిసై సమస్య కాదన్న ఆయన..సీఎం-గవర్నర్ వ్యవస్థ మధ్య ఇది సరికాదని హితవు పలికారు. మరోవైపు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇద్దరూ బీజేపీ నాయకులు కదా వారికి టీఆర్‌ఎస్ వోటేసి..గవర్నర్ బీజేపీ కార్యకర్త అంటే ఎలా అని నిలదీశారు. అవసరం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.