స్వయం సమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

– అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు
– గ్రామాలకు వచ్చే ప్రతీ రూపాయి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి
– అలసత్వం, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోం
– గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : గ్రామాల అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతీ కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామాలను స్వయం సమృద్ధిగా, నగరాలకు తీసిపోని మౌలిక వసతులతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ, సెర్ప్, ఉపాధి హామీ పథకం తదితర విభాగాల అధికారులతో మంత్రి సీతక్క సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడు గంటలపాటు సాగిన సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతి, భవిషత్తు లక్ష్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయని గుర్తు చేశారు. ఇంత భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో మారకపోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ‘ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనిచేస్తే ఫలితాలు రావు.. జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు ఒకే టీమ్‌గా పనిచేయాలి.. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి.. ప్రతీ గ్రామానికి అవసరాలు, వనరులు, సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా కార్యాచరణ అమలు చేయాలి’ అని ఆదేశించారు. గ్రామాల్లో అపారమైన సహజ, మానవ వనరులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగిస్తే గంగదేవిపల్లి వంటి ఆదర్శ గ్రామాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించవచ్చని మంత్రి అన్నారు. వచ్చే రెండు నెలల్లో గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి తీసుకురావాలని అధికారులకు గడువు విధించారు. గ్రామాలకు వచ్చే ప్రతీ రూపాయి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు కావాలని స్పష్టం చేసిన మంత్రి ఒక్కో నీటి బొట్టును ఎలా పొదుపుగా వాడుకుంటామో గ్రామాలకు వచ్చే ప్రతీ రూపాయిని కూడా అంతే జాగ్రత్తగా వినియోగించాలి. ప్రజల డబ్బును వృథా చేయడానికి ఎవరికీ హక్కు లేదు అని అన్నారు. స్థానిక సంస్థల నిధుల వినియోగంపై మాట్లాడుతూ కొన్నిచోట్ల గ్రామ సభలు నిర్వహించకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు నిధుల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ‘నేను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాను.. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటాను.. నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు’ అని మంత్రి అధికారులను హెచ్చరించారు. సమీక్షలో ఉపాధి హామీ పథకం అమలు, కూలీలకు పని దినాల కల్పన, పెండింగ్ మెటీరియల్ బిల్లుల చెల్లింపులు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా శక్తి భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, పారిశుధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూళ్లు ్ల, స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాల సాధన, గ్రామ కార్యదర్శుల హాజరు తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు.

జల సంరక్షణే భవిష్యత్ భద్రత

వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. చెరువులు, కుంటలు, బావులు, వాగులను పరిరక్షించడం గ్రామీణాభివృద్ధిలో అత్యంత కీలకమన్నారు. ‘చెరువును కాపాడుకుంటే ఊరిని కాపాడుకున్నట్టే.. పాత బావులను గుర్తించి పునరుద్ధరించాలి.. బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించి ప్రమాదాలను నివారించాలి.. |త్రీ ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరిలో ఊట కుంట ఉండేలా చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘జలసిరి’ అవగాహన పోస్టర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు చేరాలి
వర్షాకాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిషన్ భగీరథ అధికారులకు మంత్రి సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు సహా ప్రతి ఇంటికీ నిరంతరాయంగా రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మిస్తున్న రహదారులకు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ‘పట్టణాల్లో స్కైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుంటే అటవీ గ్రామాల్లో కనీసం బీటీ రోడ్డు వేయడానికీ అనుమతులు రావడం లేదు.. కేంద్రం నిధులు మంజూరు చేసిన తర్వాత కూడా అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం వల్ల ఆదివాసి గిరిజన గ్రామాలు ఇంకా వెనకబాటులోనే ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28, 29 తేదీల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో జరగనున్న సమావేశంలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. పీఎంజీఎస్‌వై కింద అటవీ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.

మహిళా సంఘాలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

మహిళా సంఘాల బలోపేతం, బ్యాంకు లింకేజీల పెంపు, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సెర్ప్ అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారత పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. సమావేశం ముగింపులో మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘మనందరిదీ గ్రామీణ నేపథ్యమే.. గ్రామీణ ప్రజల కష్టాలు మనకు తెలుసు.. కాబట్టి గ్రామాల్లో సమస్యలు తలెత్తకముందే పరిష్కారాలు చూపాలి.. తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత మనందరిది’ అని అధికారులకు పిలుపునిచ్చారు.

మెరుగైన పనితీరు కనబరుస్తున్న అధికారులకు సన్మానం

హోదాను పక్కనపెట్టి మెరుగైన పనితీరును కనబరుస్తున్న అధికారులను మంత్రి సీతక్క శాలువాతో సన్మానించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కేవలం రెండున్నర నెలల్లో 7.44 కోట్ల పని దినాలు పూర్తి చేసినందుకు సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్‌లను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు. జిల్లాస్థాయిలో ఉపాధి హామీ పనులను పకడ్బందీగా రికార్డు స్థాయిలో అమలు చేసినందుకు డీఆర్డీవోలకు స్వీట్ బాక్స్‌లు అందజేశారు. దివ్యాంగులకు యూడిఐడి కార్డులను అందించడంలో కీలక పాత్ర పోషించిన సెర్ప్ డైరెక్టర్ సాయికుమార్‌ను అభినందించి సన్మానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *