– పేదల జాగాలు లాక్కోవద్దు
– ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలేవీ?
– ప్లాట్లు కోల్పోతున్న వారికి అండగా వుంటామని హామీ
– ఖమ్మంలో మీడియాతో హరీష్‌రావు
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 23: ఏ ప్రభుత్వమైనా పేదలకు భూములు ఇస్తుంది. వీళ్లు ఇందిరమ్మ రాజ్యమని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. తెలిసో తెలియకో పేదోడు కబ్జా చేస్తే పట్టాలు ఇవ్వాలి . చెప్పేది ఇందిరమ్మ రాజ్యం, చేసేది హిట్లర్ రాజ్యం.. రక్షించే వాడే భక్షించే వాడు అయ్యాడని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రఘునాధపాలెం మండలం సర్వే నెం.218లో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు ఆయన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మంలో రెవెన్యూ మంత్రి ఉండి కూడా ఉపయోగం లేదు.. రెవెన్యూ మంత్రి అంటే ఇళ్ల స్థలాలు ఇస్తారు ఇండ్లు కట్టిస్తారు. పేదలకు పట్టాలిస్తారు. జీవో 59 కింద రెగ్యులరైజ్ చేస్తారు.. ఖమ్మం జిల్లా దురదృష్టమో ఏమో కానీ ఇక్కడ రివర్స్ అయ్యింది అని విమర్శించారు. మొన్న వెలుగుమట్ల.. ఇప్పుడేమో రఘునాథపాలెంలో షురూ చేశారు.. వెలుగు మట్లలో పేదల జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పరువు పోయింది. గతంలో సర్వే నెం.218 లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు , స్థలాలు ఇచ్చింది.. కరెంటు పోల్స్ , నల్లా కలెక్షన్లు ఏర్పాటు, ప్లాట్లకు నెంబర్లు కూడా కేటాయించిందని చెప్పారు. చేతనైతే మీరు ఇల్లు కట్టించండి.. ఇంటికి సాయం చేయండి.. అసంపూర్తిగా ఉంటే పూర్తి చేయాలి.. కానీ ఇళ్లు లాక్కునే పరిస్థితి బాధాకరం అన్నారు. తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అమాయకుల దగ్గర, పేదల దగ్గర జాగాలు లాక్కోద్దని కలెక్టర్‌కు గట్టిగా చెప్పానన్నారు. రాత్రికి రాత్రి జేసీబీలు తెచ్చి ఇండ్లు కూలగొడుతున్నారు ఇల్లు కట్టే ప్రభుత్వం కాదు ఇది, కూల్చే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి హైదరాబాదులో కూలగొడుతున్నాడు, ఇక్కడ పొంగులేటి జేసీబీలు పెట్టి ఇల్లు కూలగొడుతున్నాడని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే అది కూడా ఆక్రమించుకున్నారు. తక్షణమే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేదంటే జర్నలిస్టులకు తామే పొజిషన్ ఇప్పిస్తాం .. తాము వాళ్లతో పాటు వెళ్లి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని సవాల్ చేశారు.హైదరాబాదులో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు, అక్కడ ఇబ్బంది లేనప్పుడు ఖమ్మంలో కేసీఆర్ ఇచ్చిన జీవో వల్ల ఎక్కడ ఇబ్బంది వస్తుంది.. ఏమి అడ్డంకి ఉందో రెవిన్యూ మంత్రి చెప్పాలని ప్రశ్నిస్తున్నానన్నారు. నేషనల్ హైవే పేరుతో కొన్ని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో కొన్ని ప్లాట్లు తీసుకున్నారు. మిగిలిన ప్లాట్లు కూడా ఎందుకు లాక్కుంటున్నారు ..పేదలు స్కూల్ పక్కన, జాతీయ రహదారి పక్కన ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వడం లేదా.. ఈ స్థలం విలువైంది కాబట్టి గరీబోళ్ల దగ్గర లాక్కుంటున్నారా.. వాళ్లకు ఇంత విలువైన స్థలాలు అవసరమా అని అనుకుంటున్నారా అని ఆయన నిలదీశారు. గృహలక్ష్మి కింద కొందరికి ఇండ్లు మంజూరు అయితే బేస్మెంట్లు, ఇల్లు కూడా కట్టుకున్నారు.. వాటిని కూల్చడం దారుణం.. ఆలోచన విరమించుకోవాలి లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.. బీఆర్ఎస్ పార్టీ వీరందరికీ న్యాయం జరిగే వరకూ అండగా ఉంటదని హెచ్చరిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు.. కాలేజీ వాళ్ళు పిల్లల సర్టిఫికెట్లు ఆపారు .. గత్యంతరం లేక కాలేజీల వాళ్ళు ధర్నా చేశారు. ఆ కాలేజీల వాళ్ళను పిలిచి బ్లాక్ మెయిల్ చేశారు.. ఆరోగ్య శ్రీ పథకం కూడా అంతే చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి దావఖానాలు బంద్ చేశారు. వాళ్లు ధర్నా చేస్తే వాళ్లను కూడా రేవంత్ రెడ్డి బెదిరించారు.. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు పెన్షన్ బకాయిల కోసం ధర్నా చేస్తే వాళ్లను కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఎస్‌బీఐ వాళ్ళు మా భూమి మీరెందుకు అమ్మారు అంటే వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎల్ అండ్ టీ వాడు మెట్రో రైల్ వదిలిపెట్టి పోయేదాకా బ్లాక్ మెయిల్ చేశారు. రేవంత్ రెడ్డిది అంతా బ్లాక్ మెయిల్ రాజకీయం అని అన్నారు.పేదల ఉసురు పోసుకోకు.. పేదలు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నానన్నారు. ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అన్నారు. ఆ స్కీమ్ ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు.. నువ్వు పైసలు ఇవ్వవు అని హాస్పిటల్ వాళ్ళు ఈ పథకంలో చేరబోమంటున్నారు ..కానీ 1.5% శాతం మాత్రం ఉద్యోగుల జీతం కట్ చేశావు.. ఇదేమని ఉద్యోగస్తులు అడిగితే, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏసీబీ రైడ్లు చేయిస్తున్నారు. బ్లాక్ మెయిల్ ఎల్లకాలం నడవదు. . ప్రేమ, నిజాయతీ మాత్రమే గెలుస్తుంది.. మీరెవరు బాధపడొద్దు, మీ వెనక కేసీఆర్ ఉన్నారు.. బీఆర్ఎస్ ఉంది.. మీ స్థలాలు మీకు వచ్చే వరకు పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నేను మీకు అండగా ఉంటా.. కలెక్టర్ తో మాట్లాడాను.. రేపు సీఎస్ దృష్టికి కూడా తీసుకెళ్తాను..అవసరమైతే మీ అందరినీ మీ జాగాలో కూర్చొబెట్టే దాక బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుందని హరీష్‌రావు హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





