- అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్ తలసాని
- బడ్జెట్ పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన
- ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు
- కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్
- కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రాక్టర్ అనడంపై దుమారం రేగింది. ఆ వెంటనే..పేకాట ఆడేవాళ్లు మంత్రులు కాగా లేనిది..కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని స్పీకర్ పోచారం అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వి•ద చర్చ జరిగే సమయంలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. కోమటిరెడ్డిని తలసాని కాంట్రాక్టర్‌తో పోల్చాడు. దీంతో తలసానికి కోమటిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చాడు. నేను కాంట్రాక్టర్‌ను అయితే పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చంటూ సెటైర్లు వేశారు. దీంతో కోమటిరెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు అటాక్ చేశారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ, విప్ బాల్క సుమన్‌లు కోమటిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఎదురు దాడికి దిగారు. తలసాని, రాజగోపాల్ ఇద్దరిదీ తప్పేనని..వారిద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు సీఎల్పీ నేత భట్టి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కలుగజేసుకున్నారు.
మంత్రిపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారి చెప్పకుంటే.. చర్యలు తీసుకుంటా మనడంతో.. చివరకు రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులు, అవినీతిపై సభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తాము కట్టినవేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్‌రెడ్డి అన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేర్లు మార్చారంటూ విమర్శలు చేశారు. దీనికి మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పోలవరంలో మునిగిపోతున్నాయన్నారు. తర్వాత పువ్వాడ వ్యాఖ్యలను తప్పుబట్టారు భట్టి. దీంతో అధికార, విపక్షాల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఇదే సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి.. కాంట్రాక్టుల్లో అవినీతి గురించే మాట్లాడుతారు తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడరు అని తలసాని అన్నారు. మళ్లీ రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని మంత్రి తలసానిని ఉద్దేశించి పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చా? అని అడిగారు. దీంతో టీఆర్‌ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కల్పించుకుని రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ చాలా చక్కగా జరుగుతోంది. రాజగోపాల్ ఫ్రస్టేషన్, వాళ్ల పార్టీ ఫ్రస్టేషన్ చాలా విచిత్రంగా ఉంది. బాధ్యాతయుతంగా, కుసంస్కారంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లోనూ, బయట అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ల పార్టీ అధ్యక్షుడు కూడా నోటికి హద్దు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాళ్ల పార్టీ అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడిండు. మా పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు చేసుకుంటుంటే.. మూడు రోజుల పాటు సంతాప దినాలు చేసుకోండని వారి అధ్యక్షుడు మాట్లాడుతాడు. నిన్న కాక మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 98 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి, అడ్రస్ లేకుండా పోయారు. ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. కేసీఆర్‌కు ఆరోగ్య పరమైన సమస్య వొచ్చి హాస్పిటల్‌కు వెళ్లారు. బీజేపీ రిజల్టస్ చూసి కేసీఆర్ హాస్పిటల్‌కు పోయిండని రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు..
ఇదేనా వీరి సంస్కారం అని ప్రశ్నించారు. పద్దుల వి•ద మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలన్నారు. అవినీతి అవినీతి అని గొంతు చించుకోవడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. అసలు వీళ్లది ఏ పార్టీ అంటే.. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ భోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్, ఏ నుంచి జడ్ దాకా, ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యులు.. దౌర్భాగ్య పార్టీ అది. అలాంటి వారు అవినీతి గురించి మాట్లాడటం సరికాదు. అవినీతి వి•ద ఆధారాలుంటే సీవీసీ, ఏసీబీ, విజిలెన్స్, కోర్టులు ఉన్నాయి. గొంతులు చించుకోవడం, బట్టలు చింపుకోవడం కాదు. గాలి మాటలు మాట్లాడటం సరికాదు. ఒక బలహీనవర్గాల మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతున్నావని అనడం దారుణమన్నారు. నోటికి హద్దు, అదుపు లేకుండా మాట్లాడిని రాజగోపాల్ రెడ్డి బేషరతుగా మంత్రికి క్షమాపణ చెప్పాలి. లేదంటే చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.