యోగాకు అమృతోత్సవ శోభ

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ తరుణంలో దేశవ్యాప్తంగా ‘‘ఆజాదీ కా అమృత మహోత్సవాలు’’ జరుపుకుంటున్నాం. ఈ చారిత్రక సంవత్సరంలో అమృతోత్సవాల స్ఫూర్తిని మరింత వ్యాప్తి చేసేలా ప్రపంచ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) ‌భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. యోగా డే కు వంద రోజుల ముందే దేశవ్యాప్తంగా యోగా సన్నాహక సభలను, సంబరాలను ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు భాగస్వాములై భారత ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేసేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సూచికగా జూన్‌ 21‌న భారతదేశంలోని పేరెన్నిక గన్న 75 ప్రాచీన వారసత్వ కేంద్రాలలో ఏకకాలంలో యోగా కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ యోగా దినోత్సవానికి మరింత ప్రాచుర్యాన్ని అందించబోతున్నది. దీనిని భారతదేశం ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను యోగా ద్వారా ప్రజల చెంతకు తీసుకువెళ్ళే గొప్ప ప్రయత్నంగా భావించాలి.

మన ప్రాచీన యోగా గురించి ప్రస్తావించుకుంటే యోగా సంపూర్ణ జీవన విధానానికి ఒక ప్రతీక. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో ఈ క్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రీస్తు పూర్వ కాలం నుంచి నేటి వరకు ఏకధాటిగా ప్రజల జీవన విధానంలో అంతర్భాగమైంది. అదే విధంగా మానవ సంపూర్ణ జీవన సంస్కృతికి ఆలంబనగా నిలిచిన ప్రక్రియ ఇది. వేదకాలం, యుగాలు, పురాణాలు, బౌద్ధ, జైన కాలాలను దాటుకుంటూ ఆ నాటి నుంచి నేటి వరకు మానవ జీవితాలను విశేషంగా ప్రభావితం చేస్తున్న అత్యంత ప్రాచీన జీవన మార్గం యోగా. అయితే, యోగా గురించి మొదటగా వేదాల్లో ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత కర్మ యోగను, జ్ఞాన యోగను, భక్తి యోగను బోధించాయి. క్రీ.పూ. 200 సంవత్సరాల కిందట పతంజలి మహర్షి యోగాను 8 సూత్రాలుగా వర్ణించారు. ఈ అష్టాంగ యోగా సాధనతో ‘‘ప్రాణాయామము’’ శ్వాసను నియంత్రిస్తే, ‘‘యమ, నియమాలు, ఆసనాలు’’ మనసును పరోక్షంగా, శరీరాన్ని ప్రత్యక్షంగా నియంత్రిస్తాయి. అయితే, విభిన్న మార్గాలలో ఏకకాలంలో ప్రయాణించే మనస్సును నేర్పుగా కూర్చేది ‘‘ప్రత్యాహార’’ క్రియ. ఇలా కూర్చబడిన బలమైన శక్తిని ఒకే దగ్గర నిలిపితే అది ‘‘ధారణ’’ క్రియ అవుతుంది. అలా నిలిచిన శక్తిని ఒకే వస్తువుపై కేంద్రీకరిస్తే అది ‘‘ధ్యానం’’ గా మారుతుంది. ఇవన్నీ ఏకసూత్రంగా మారి ఏమి లేవు లేదా అన్నీ ఉన్నాయి అనే స్థితి ఏర్పడితే అది ‘‘సమాధి’’ క్రియగా ప్రకటితమవుతుందని యోగా సాధకులు పేర్కొంటారు.

పతంజలి యోగాను 12వ శతాబ్దం వరకు ఎందరో మహర్షులు, యోగులు సాధన చేసి వారి అనుభవాలను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆయా కాలాల్లో పతంజలి యోగా శాస్త్రం పై అనేక మంది యోగులు, పండితులు యోగా సాధన గురించి వ్యాఖ్యానాలు చేస్తూ, అందరికీ అర్థమయ్యే రీతిలో రచనలు చేశారు. అందులో ‘‘యోగావాసిస్ఠం’’, ‘‘కుండలినీ యోగా’’ ‘‘క్రియా యోగా’’ వంటి అనేక గ్రంథాలను వెలువరించారు. 19, 20వ శతాబ్దంలో మత్స్యేంద్రనాథుడు, గోరక్షకనాథుడు, స్వాత్మారామయోగి, స్వామి వివేకానంద, అరవింద మహర్షి, దయానంద సరస్వతీ వంటి వారు యోగాను సాధన చేస్తూ సామాన్యులకు బోధించారు. మరికొంత మంది మహర్షులు యోగా క్రియను పాశ్చాత్య దేశాల్లో కూడా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు.

వేద కాలం పూర్వమే వెలుగు చూసిన ఈ ప్రాచీన యోగా ప్రక్రియకు నేడు ప్రపంచ దేశాలు ప్రణమిల్లుతున్నాయి. 2014 సెప్టెంబర్‌ 27‌న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ యోగా ప్రాధాన్యతను వివరించారు. యోగా యావత్‌ ‌ప్రపంచాన్ని ఆరోగ్య వంతుల్ని చేయడంతోపాటు, ప్రజల జీవన విధానంలో గొప్ప మార్పును తీసుకు వస్తుందని, అందుకు యోగా దినోత్సవాన్ని జరపాలని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను 177 దేశాలు ఆమోదించాయి. ప్రతి ఏడాది జూన్‌ 21‌న ‘‘ప్రపంచ యోగా దినోత్సవం’’ జరపాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆనాటి నుంచి ప్రతి ఏడాది ప్రపంచ దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 2022 యోగా థీమ్‌ ‌లో ‘‘కోవిడ్‌-19 ‌మహమ్మారి ఇంకా కొనసాగుతున్న ఈ తరుణంలో యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసేలా దృష్టి సారించాలని, సర్వ మానవాళి సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కోసం యోగా సాధనతో ఉత్తేజితులు కావాలని, అందుకు విస్తృత ప్రచారం సాగించాలి’’ అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

ఈ స్ఫూర్తిని మరింత రగిలించేలా జూన్‌ 21‌న జరుగబోయే 8వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరిని భాగస్వాములను చేస్తూ చరిత్రలో నిలచిపోయేలా జరపాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ యోగా మహోత్సవాలకు కేంద్ర మంత్రులందరు సారథ్యం వహిస్తున్నారు. కేటాయించిన తేదీల్లో ఆయా మంత్రిత్వ శాఖలు యోగా పై ప్రత్యేక సభలు, సమావేశాలు, సెమినార్‌ ‌లు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా, యోగా డేకు ముందుగా వంద రోజుల కార్యాచరణను చేపట్టింది. తొలుత 100వ కౌంట్‌ ‌డౌన్‌ ‌యోగా మహోత్సవ్‌ ‌కార్యక్రమం హరియాణా రాష్ట్రంలో మార్చి 14న కేంద్ర ఆయుష్‌ ‌శాఖ మంత్రి శ్రీ సర్బానంద్‌ ‌సోనోవాల్‌ ‌ప్రారంభించారు. 75వ కౌంట్‌ ‌డౌన్‌ ‌ను ఏప్రిల్‌ 7‌న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై నిర్వహించారు. 50వ కౌంట్‌ ‌డౌన్‌ ఉత్సవాలను అస్సామ్‌ ‌రాష్ట్రంలో జరిపితే, 25వ కౌంట్‌ ‌డౌన్‌ ‌యోగా ఉత్సవాలకు హైదరాబాద్‌ ‌వేదిక కానుంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌ ‌రెడ్డి సారధ్యంలో ఈ నెల 27వ తేదీ ఉదయం హైదరాబాద్‌ ‌పీపుల్స్ ‌ప్లాజాలో ఘనంగా జరుగనుంది. సుమారు 5 వేల మంది యోగా సాధకులు పాల్గొని యోగా విశిష్టతను, ప్రయోజనాలను వివరించబోతున్నారు.

యోగా కేవలం భారతదేశంలోనే కాదు, నేడు ప్రపంచ వేదికలపై నీరాజనాలు అందుకుంటున్న గొప్పజీవన విధానం. నేటి అత్యాధునిక సమాజంలో సాంకేతిక అభివృద్ధి చెందినప్పటికీ మానవ జీవితంలో వచ్చే వత్తిడిలను, రుగ్మతలను అదుపు చేయడానికి, పరిపూర్ణ ఆరోగ్య సాధనకు ప్రాచీన యోగా క్రియ దోహదకారి కావడం మన భారతీయుల ప్రాచీన వైభవానికి నిదర్శనం.

vijay kumar
డా।। జె. విజయకుమార్‌, ‌రీజినల్‌ అవుట్‌ ‌రీచ్‌ ‌బ్యూరో
హైదరాబాద్‌, 9848078109

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page