దేహం అద్వైతం
మట్టి – కుండ
మన్నులో శవం
కొంత కాలం
పురుగులు పుర్రెలు
ఆపై అదృశ్యం..!
ఆలోచనలు మెదడులోంచి
స్పందనలు హృదయంలోంచి
జీవం పోయింది
కాయం కరిగింది
అన్నీ మూతపడి
ఇకపై ఇంకొకళ్ళ మదిలో
వాళ్ళదైన దృష్టిలో
అప్పుడప్పుడు..!!
ఆపై కొంత దూరం…
మళ్ళీ వీళ్ళూ అంతే
మరింకొకళ్ళూ అంతే
ఆ తర్వాతి వాళ్ళూ అంతే
ఎప్పటికీ అంతే..?!
జననం మరణం
ప్రవాహం అనివార్యం..!
సాపేక్షత, అనిశ్చితి తెలిసినా
అదమరుపు ఉంటామని
ఊహిస్తాం బతుకును…
అకస్మాత్తుగా
మనలో ఒకరు పోతే
వెన్ను కంపిస్తుంది!!
మనమూ ఎప్పుడో ఇలా…
అయ్యో..!!!
ఆ రహస్యం
ఏ గ్రంథంలో వుండదు…
ముందే తెలిస్తే
అర్థమే వుండదు…
అలవరచబడితే
అన్నీ సామాన్యమే..!!
ఎంతైనా అసంబద్ధమే…
‘‘ఫిలాసఫీ ఆఫ్ డెత్’’
– రఘు వగ్గు