కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక రాజకీయ కూటమి ఏర్పటుకు సన్నాహాలు జరుగుతున్నాయను కుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అందరినీ ఆశ్చర్యంలో పడవేస్తూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బిజెపి, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసే దిశలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతీయ పార్టీల ప్రతినిధులను, ముఖ్యమంత్రులను కలిసి మంతనాలు జరిపిన కెసిఆర్ తాజాగా తమ పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రత్యామ్నాయ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారనుకుంటున్నవారి ఆలోచనలకు భిన్నంగా దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్రత్యామ్నాయ జాతీయ ఎజండా మాత్రమేనంటూ ఆందరిని ఆ దిశలో ఆలోచింపజేశారు. అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న కెసిఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అంతుబట్టదు. అవి నిజంగా ఆలోచించి తీసుకుంటున్నవేనా లేక దేశ రాజకీయ పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారా అన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. కూటమి ఏర్పాటు కోసం భిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపిన సమావేశాలు, కూటమి ఏర్పాటుకు కలిసి రాకపోవడం వల్లే తన ఆలోచన సరళిలో మార్పు చేసుకుని ఉంటారా అన్న ఊహాగాలకు తావేర్పడుతున్నది.
మొదటినుండి బిజెపి, కాంగ్రేసేతర కూటమి ఏర్పడాలన్న లక్ష్యంగానే కెసిఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో ఆ రెండు పార్టీలే ప్రధానంగా జాతీయ స్థాయి పార్టీలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపిని గద్దె దింపాలంటే కేవలం ప్రాంతీయ పార్టీలవల్ల సాధ్యంకాదని, ఒక జాతీయ పార్టీ తోడు అనివార్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తగినట్లుగా ఇప్పటివరకు కెసిఆర్ కలిసిన ముఖ్యమంత్రుల్లో, వివిధ పార్టీల ప్రతినిధుల్లో ఎక్కువ శాతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. బిజెపిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తో కలిసిన కూటమిని ఏర్పాటు చేయడమే సరైందన్న వాదన ఒకటున్నట్లుగా తెలుస్తున్నది. దాంతో కూటమి ఏర్పాటుపై బలంగా శ్రమించిన కెసిఆర్ తన ఆలోచనకు పదునుపెట్టి ప్రత్యామ్నాయ ఎజండా అంశాన్ని లేవనెత్తి ఉంటాడన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఒక విధంగా ప్రస్తుత పాలనా విధానానికి భిన్నంగా, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల జీవితాలను మార్చగలిగే విధానాలను అమలు పర్చే నూతన ఎజండాతో ముందుకు పోయినట్లైతే దేశం సుభిక్షంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహంలేదని రాజకీయ పరిశీలకులుకూడా చెబుతున్న మాట.
కెసిఆర్‌కూడా అదే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కేవలం అధికారంలో ఉన్నవారిని గద్దె దించడం కోసమే పార్టీలు కదలాలని కాదు.. మారాల్సింది ప్రభుత్వాలు కాదు.. ప్రజల జీవన విధానమంటారు. అందుకే ప్రత్యామ్నాయ విధానం అవసరమన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. దేశంలో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. బలమైన యువశక్తి ఉంది. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్బై అయిదేళ్ళలో ఈ వనరులను, ఈ శక్తిని దేశీయంగా సద్వినియోగం చేసుకోలేపోవడం, దేశ ఏలికల అసమర్థతే అన్నది కెసిఆర్ చెబుతున్నమాట. లక్ష్యాన్ని కోల్పోతున్న భారతదేశానికి ఇప్పుడు మార్గం చూపే దిక్సూచి అవసరం. అందుకు కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, థర్డ్ ఫ్రంట్లు కాదు. స్పష్టమైన ప్రత్యమ్నాయ ఎజండా అనడంతో ఒకసారి దేశంలోని రాజకీయ వర్గాలందరి ఆలోచనలు తలకిందులైనాయి. ఇంతకాలం థర్డ్ ఫ్రంటు ఏర్పటుకోసం మంతనాలు సాగిస్తున్న కెసిఆర్ మాట ఒక్కసారే ఎందుకిలా మారిందన్నది అంతుబట్టకుండా పోయింది. కొందరు ముఖ్యమంత్రుల కలయిక, పార్టీల గుంపు, కూటములు దేశ స్థితిగతులను మార్చలేవు.
దేశ నిర్మాణ విధానాలు రూపొందాల్సిన అవసరం ఉంది. అది ప్రజలకు అవసరమైన వేదికగా ఉండాలన్న అభిప్రాయాన్ని కెసిఆర్ వ్యక్తంచేయడం చూస్తుంటే ఇక్కడితో థర్డ్‌ఫ్రంట్‌కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనని భావిస్తున్నారు. అయితే అంతటితో జాతీయ రాజకీయాలకు కెసిఆర్ స్వస్తి చెప్పినట్లుకాదు. దేశాన్ని బాగుపర్చే ఎజండా ఒకటి తెలంగాణ రాష్ట్రంనుంచే మొదలు కావాలన్న ఆశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం తెలంగాణలోనే శ్రీకారం కావాలన్నారు. ఇక్కడ రూపొందించే కొత్త ఎజండా, సిద్దాంతం దేశం నలుమూలల వ్యాప్తి చెందితే అది తెలంగాణకేకాదు, యావత్ దేశానికి గర్వకారణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణకోసం టిఆర్‌ఎస్ ఆవిర్భవించిన రీతిలో దేశంకోసం ఓ నూతన శక్తి ఆవిర్భావం జరుగుతుందని చెబుతూనే పార్టీ ఎంఎల్‌ఏ గ్యాదరి కిశోర్ రాసిన వ్యాసంలో టిఆర్‌ఎస్ ఇక నుండి బిఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్పు జరుగాలన్న విషయంపై కూడా ఆలోచిస్తామనడం కొసమెరుపు.