- అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం
- అందుకు నాదే బాధ్యత
- బిజెపి పార్టమెంటరా పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ
- ఉక్రెయిన్ పరిస్థితులపైనా చర్చలు
న్యూ దిల్లీ, మార్చి 15 : వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టిక్కెట్లు నిరాకరించడం జరిగితే దానికి తానే బాధ్యుడనని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఢిల్లీలోని అంబేడ్కర్ కేంద్రంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మోదీ వారసత్వ రాజకీయాల ప్రస్తావన చేశారు. ఉక్రెయిన్ రాజకీయాలు, కశ్మీర్ ఫైల్స్ సినిమాను కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
దానిపై అంతా కలిసికట్టుగా పోరాడాలని భాజపా ఎంపీలకు సూచించారు. భాజపా నేతల్లో కొంతమంది పిల్లలకు టికెట్లు కేటాయించకపోవడానికి కూడా కారణం ఇదే అని మోదీ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ రాలేదంటే అందుకు పూర్తి బాధ్యత తనదే అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లో వారసత్వ రాజకీయాలపై పోరాడాలంటే ముందు సంస్థాగతంగా మనం దాన్ని అనుసరించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు గానూ భాజపా నేతలు మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను సన్మానించారు. ఇద్దరికీ గజమాల వేసి సత్కరించారు. ఇటీవల విడుదలై బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ’ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై మోదీ ప్రశంసలు కురిపించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సినిమాలు తరచూ రావాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నాయి. అలాగే భాజపాకు తక్కువ వోట్లు వొచ్చిన నియోజకవర్గాల్లో 100 బూత్‌లను గుర్తించి..పార్టీకి వోటు వేయకపోవడానికి కారణాలేంటో గుర్తించాలని మోదీ.. ఎంపీలకు సూచించినట్లు పార్టీ నేత మనోజ్ తివారీ తెలిపారు.
అంతేగాక భాజపా విజయానికి సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి తరలించిన విషయంపై కేంద్రమంత్రి ఎస్ జైశంకర్‌ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా భాజపా ముందుకెళ్తున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే సమయంలో ఎలాంటి వివరాలు లేకుండా ప్రతిపక్షాలు రాజకీయం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారన్నారు. భారతీయులకు పోలండ్ సహకరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారన్నారు. కార్యక్రమంలో మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.