లోక్‌సభ అంటే దేశ ప్రజలందరిని ప్రతిబించే సభ. ఇది ఏ ఒక్కరిదో కాదు. అధికార పక్షమైనా, విపక్షమైనా అంతా ప్రజల ప్రతినిధులుగా ఎన్నుకోబడి వచ్చినవారే. విపక్షంలో ఉన్న వారైనా తమ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారుగా గుర్తించాలి. విపక్షం అంటే గంజిలో ఈగలాగా తీసేసే సంస్కృతి పోవాలి. విపక్షానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, వారు లేవనెత్తే సమస్యలపై చర్చ చేయాలి. ఇలా ఏ ఒక్క సభ్యుడిన్కెనా తిరస్కారానికి గురి చేయకుండా గౌరవించడం ద్వారా పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందిం చాలి. పార్లమెంట్ అంటే ప్రజల సమస్యలపై చర్చకు వేదిక కావాలి. పరిష్కారానికి దారి చూపాలి. సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా ప్రజలకు బాసటగా నిలవాలి. అప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మిక కుదురుతుంది. ఈ క్రమంలో స్పీకర్ పదవి అన్నది చాల ఉదాత్తమైన పాత్ర పోషించేది. దేశప్రజల సమస్యలను ప్రస్తావించేలా, దానిపై సమగ్రంగా చర్చ జరిగేలా, అలాగే సంప్రదాయాలను పాటించేలా చూడాలి. ఇప్పుడు విపక్ష సభ్యుల సంఖ్య పెరిగినందున గతంలో లాగా బుల్‌డోజ్ వ్యవహారం కుదరదు. అధికార పక్షానికి కొంత తక్కువగా వారికి చేరువలోనే విపక్షం కూడా బలంగానే ఉంది.
అందువల్ల సమస్యలను లేవనెత్తినప్పుడు, వాటిపై చర్చ జరిగేలా చూసి, ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇచ్చేలా చేయడంలో స్పీకర్ కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. ఇది ఇరుపార్టీల మధ్య పోటీ కాదు కనుక చర్చలు చేయడంలో స్పీకర్ ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. దేశ ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు విపక్షం ఎప్పుడు సిద్దంగా ఉంటుంది. అవసరమైతే నిలదీస్తుంది. ఈ క్రమంలో స్పీకర్ ధర్మపక్షపాతిగా నిలవాలి. గురుతర బాధ్యతను నిర్వర్తించాలి. దేశంలో లోక్‌సభ స్పీకర్ అనేది ఒక కీలక పదవి. దీని కోసం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం, ప్రతిపక్ష నేతల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికలో తిరిగి ఓం బిర్లా ఎన్నికయ్యారు. అధికార పక్షానికి చెందిన ఓం బిర్లా కోట నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రతిసారీ ఏకగ్రీవంగా ఎంపిక చేయాలనే లక్ష్యంతో సాగిన పార్లమెంట్ ఇప్పుడు మాత్రం పోటీ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, బీజేపీ స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు స్పీకర్ పదవి కోసం తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రొటెం స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహించారు. ఎన్డీయేమరోసారి ఓం బిర్లాను అభ్యర్థిగా నిలబెట్టగా, విపక్షాలు కే సురేష్‌ను బరిలోకి దింపాయి. దేశచరిత్రలో స్పీకర్ ఎన్నిక జరగడం ఇది మూడోసారి.
ఈ క్రమంలో ఓం బిర్లా స్పీకర్‌గా మూజువాణి ఓటుతో నెగ్గారు. బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా చరిత్రకెక్కారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌కు చెందిన బలరాం జాఖర్ రెండుసార్లు స్పీకర్‌గా ఉన్నారు. లోక్‌సభలో మొత్తం ఎంపీల సంఖ్య 543. బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. కాగా ఎన్డీయేకు మొత్తం 293 మంది ఎంపీలు కలరు. టీడీపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉండగా, వారిలో కాంగ్రెస్‌కు 98 మంది, ఇతరులకు 14 మంది ఉన్నారు. లోక్‌సభలో టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రతినిధులుగా లోక్‌సభలో అడుగు పెట్టారు. ఈ క్రమంలో అనేక సమస్యలు ఇప్పుడు దేశం ముందున్నాయి. సాధారణంగా విపక్షమే ఈ సమస్యలను ప్రస్తావిస్తుంది. దేశం స్వాతంత్య్రం సాధించుకుని గర్వంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో, కష్టాలు, నష్టాలు భరించి, ఆకలి బాధలను మరచి ప్రజలు దేశం పట్ల తమకున్న భక్తిని చాటు తున్నారు. ఇదే సమయంలో పాలకులు తమ విధానాల్లో, ఆలోచనల్లో మార్పులతో ముందుకు సాగాలి. పటిష్ట భారత నిర్మాణానికి కంకణబద్దులు కావాలి. రాజకీయాలను పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సిన సమయమిది.
అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో పాలన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది. ఐదేళ్లు అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడ మెలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత్ 75 ఏళ్ల తరవాత కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. విద్యా,వైద్యరంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. పేపర్ లీకేజీల్లాంటివి జరగడం విద్యార్థుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి వాటిపై చర్చించి, అక్రమాలను అరికట్టేందుకు పూనుకోవాలి. ఆహార ధాన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటు న్నామో ఆలోచన చేయాలి. వివిధ రంగాలపై అది చూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన కేంద్రం ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ఇవన్నీ కూడా పార్లమెంట్ వేదికగా చర్చ జరగాలి. విపక్షాలు సమస్యలపై సావధానంగా చర్చించేలా చూసుకోవాలి. విపక్షానికే ఎక్కువ బాధ్యత ఉంటుందని గుర్తించి మసలుకోవాలి. అప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం కాగలదు.
-కె.ఆర్.ఎస్