అవమాన బాణాలు
ఎదలో గుచ్చుకొంటుంటే
అటు సంద్రంలోని ‘‘అసని’’ తుఫాను
ఇప్పుడు
నా ఎదలోనూ మొదలయ్యింది.
వర్తమానం నచ్చక
భవిష్యత్తు గోచరించక,
ఆలోచనల అలలు ఎగిసిపడుతూ
సతమతమవుతోన్న  మదిలో
ఉన్న ఆవేదనకు
మరో ఆవేదన తోడవుతోంటే
ఆవేదనా మబ్బులు కమ్మిన ఎదలో
కన్నీటి వర్షం కురుస్తోంది.

ఎన్నో నియంత్రణల కంచెలు వేసుకొని
నడిచే జీవచ్ఛవంలాంటి
యాంత్రికమైన నా జీవనపోరాటంలో
ఎంతటి కష్టాన్నయినా
తేలికగా తీసుకొనే తనువుకు భిన్నంగా
క్రష్ణబిలాలను దాచుకున్న
మనసు మాత్రం
చిన్న కలతనైనా ఓర్చుకోలేక
మౌనంగా రోదిస్తూ
దేనికీ స్పందించక మూగబోతోంది.

నా జీవన గమనం
అలుపెరుగని పోరాటం,
ఆయుధంలేని యుద్ధం.
విచిత్ర విధికి,తలరాతకి తలవంచి
మౌనం సాక్షిగా,
అంతరంగం తోడుగా చెప్తున్నా
నేను ఒంటరినని…
– వేమూరి శ్రీనివాస్‌
                          9912128967
                          ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page