- భట్టికి ఆర్థిక, సీతక్కకు హోమ్…మదన్‌మొహన్‌కు ఐటి శాఖ?
- టిజెఎస్‌కు కోదండరామ్‌కు ప్రత్యేక గుర్తింపు
డిసెంబర్ 6 : కాంగ్రెస్ కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈనెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రెండవ రోజున అనగా బుధవారం రాత్రి రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధిష్టానం దిల్లీలో ప్రకటించింది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి విషయంలో దిల్లీ పెద్దలకు, రాష్ట్ర నాయకులకు మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం భట్టి విక్రమార్కకు ఆ పదవి ఖాయమైనట్లు తెలుస్తున్నది. కాగా మంత్రి మండలిలో పదిహేడు మంది మంత్రులను తీసుకునే అవకాశం ఉండగా, అందరినీ ఒక్కసారే ఎంపిక చేసుకుంటారా, లేక కొందరితోనే గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయింస్తారా అన్న విషయంలో ఇంకా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే ఎవరెవరిని మంత్రి వర్గంలో తీసుకుంటారు, వారికి ఏ మంత్రిత్వ శాఖలు ఇస్తారన్న దానిపైన కూడా గురువారం సాయంత్రం వరకు దిల్లీలో మంతనాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎంపిక అనంతరం అధిష్టానం పిలుపుతో దిల్లీ చేరుకున్న రేవంత్‌రెడ్డి ఈ విషయాలపై దిల్లీ పెద్దలతో హైదరాబాద్ తిరుగు ప్రయాణం వరకు చర్చిస్తూనే ఉన్నారు.
ఈ చర్చల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, బలరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గంలో సీతక్కకు ప్రధాన ప్రధాన్యత దక్కుతుందన్న ప్రచారం జరుగుతున్నది. వాస్తవంగా ఆమెకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి వొస్తుందనుకుంటున్నారు. అయితే తనతోపాటు మరో వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది. అలాంటి పక్షంలో ఆమెకు హోమ్ శాఖను ఇచ్చే అవకాశాలున్నాయనుకుంటున్నారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి హోమ్ శాఖ మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. మహిళ అయినా ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించగలదనుకుంటున్నారు. వరంగల్‌కే చెందిన మరో మహిళ కొండా సురేఖను కూడా తప్పకుండా మంత్రివర్గంలో తీసుకునే అవకాశముందనుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించవొచ్చనుకుంటున్నారు. దుద్దిళ్ళ శ్రీధర్‌బాబును స్పీకర్ చేయాలనుకుంటున్నారు. కాని ఆయన అందుకు అంగీకరించడంలేదన్న వార్తలు వొస్తున్నాయి. అలాంటప్పుడు ఆయనకు విద్యాశాఖ ఇచ్చి, పరకాల నుండి గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి లేదా దామోదర రాజనర్సింహకు స్పీకర్ ఇవ్వవొచ్చనుకుంటున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావుకు రోడ్లు భవనాలు, పొంగులేటికి నీటిపారుదల శాఖను కేటాయించవచ్చనుకుంటున్నారు.
కాగా సుదర్శన్‌రెడ్డికి వ్యవసాయం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంచాయితీరాజ్ శాఖను, ఆయనకు కాని పక్షంలో ఆయన భార్య పద్మావతికి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రిగా, వివేక్ వెంకటస్వామికి ఎస్సీ సంక్షేమశాఖ కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఇకపోతే బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ఐటి శాఖను కెటిఆర్ నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి ఐటి గుర్తింపును తీసుకువొచ్చారన్న పేరుంది. అయితే ఆయనకు ధీటుగా నిర్వహించ గలిగేది మదన్‌మోహన్ అనుకుంటున్నారు. ఆయన గాంధీ కుటుంబానికి కూడా ఆత్యంత సన్నిహితుడనుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో దిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఐటి విషయంలో సహకారం అందించాడంటున్నారు. అంతేగాక ఆయనకు విదేశాల్లో ఐటి కంపెనీలున్నాయని చెబుతున్న నేపథ్యంలో ఆయనకే ఆ శాఖను కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎంపిగా ఉండి తెలంగాణకోసం పోరాటం చేసిన హుస్నాబాద్ ఎంఎల్‌ఏ పొన్నం ప్రభాకర్‌కు కూడా మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది.
ఆయనకు అటవీ శాఖను కేటాయించవచ్చను కుంటున్నారు. ఇక కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉండి, టికెట్లు రాక, లేక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారికి అవకాశం కలిగించే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దలకు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాంటి వారిలో అద్దంకి దయాకర్ మొదటి వరుసలో ఉంటారు. అలాగే కామారెడ్డి నుండి రేవంత్‌రెడ్డి కోసం మరో నియోజకవర్గానికి వెళ్ళి ఓటమి చవిచూసిన షబ్బీర్ అలీ, కాంగ్రెస్‌లో మరో సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి లాంటివారిని ఎంఎల్సీగా తీసుకుని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరో ముఖ్య వ్యక్తి తెలంగాణ జనసమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఆయనకు మంత్రి పదవా లేక అయన గౌరవానికి తగిన పదవిని ఇచ్మే అవకాశముందనుకుంటున్నారు. గురువారం ఒకేసారి 17 మందిని మంత్రివర్గంలో తీసుకుంటారా లేక మొదటి విడుతగా కొందరినే తీసుకుంటారా అన్నది ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు తేలనుంది.