బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
కురుపాండవులలో సహావృష్టి, అంధక వంశీయులతో పాటుగా కర్ణుడుకూడా ఆయన వద్ద విద్యాభ్యాసం గావించారు. అర్జునుడు అస్త్ర, శస్త్ర, విద్యలలో ఎంతగానో పరిణతిచెందాడు. వినయ విధేయలతో ద్రోణుని వాత్సల్యాన్ని పొందాడు. కర్ణుడు అర్జునుడితో స్పర్ధవహించి, దుర్యోదనుడితో సఖ్యంగా ఉంటూ వచ్చాడు. ద్రోణుడు రాజకుమారులకు గద, విల్లు, ప్రాసము, కత్తి వంటి ఆయుధాలతో యుద్ధం చేసే విద్యలను నేర్పించాడు.
అర్జునుడు పగలనకా రాత్రనకా, నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నాడు. ద్రోణుడికి అత్యంత ఆప్తుడైనాడు. ఒకనాడు అర్జునుడు భోజనం చేసే సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అలవాటు ప్రకారం అర్జునుడు ముగించాడు. ఆశ్చర్యం వేసింది అతనికి. అప్పటి నుండీ చీకటిలోక కూడా విద్యాభ్యాసం చేసే ప్రయత్నం ఆరంభించాడు. అలా అభ్యసించే వేళలో ద్రోణుడు ఒక రోజున గమనించి, అస్త్రవిద్యలో నీ అంతటివాడు వుండడని వెన్నుతట్టాడు. ఆ తర్వాత ద్రోణుడు అర్జునుడి విషయంలో మరింత శ్రద్ధ వహించాడు.
ఏకలవ్యుడు
హిరణ్య ధన్వుడనే ఎరుక్‌రాజు వుండేవాడు. ఆయన కుమారుడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ద్రోణుని వద్ద విద్యను అభ్యసించాలని వచ్చాడు. కానీ ద్రోణుడు కిరాతుల వంటి వారికి ధనుర్విద్యను నేర్పనని చెప్పాడు. ఏకలవ్యుడు ఎంతో విచారంతో తిరిగివెళ్ళి ద్రోణుడి ప్రతిమను చేసి అత్యంత భక్తి శ్రద్దలతో ధనుర్విద్యాభ్యాసం గావించాడు. నేర్పరి అయినాడు.
ఒక నాడు కురుపాండవులు వేటకు వెళ్ళారు. పరివారంతోనూ వేటకుక్కలతోనూ అరణ్యంలో వేట మృగాలన నేలకూలుస్తూవున్నారు. అలా వారంతా వెళ్తూ వుంటే ఒక వేటకుక్క ఏకలవ్యుని చూసి మొరిగింది. ఆ కుక్కనోరు తెరిచి మొరుగుతూవుంటే ఏకలవ్యుడు తన అస్త్రనైపుణ్యంతో ఒకే కాలంలో ఏడు బాణాలను దాని నోట్లో నాటాడు. అర్జునుడు ఆశ్చర్యపడిపోయాడు. ఏకలవ్యుని గురించి వివరాలు తెల్సుకుని వచ్చి ద్రోణాచార్యునికి విషయం వివరించాడు. ద్రోణాచార్యుడు అర్జునుని వెంటబెట్టుకుని అడవికి వచ్చి ఏకలవ్యుని ఆశ్రమంలో అడుగుప్టెగానే ఏకలవ్యుడు ద్రోణునికి పాదాభివందనం గావించి గురుదక్షిణ కోరుకోమన్నాడు. ఏమికావాలన్నా ఇస్తాను అన్నాడు. ద్రోణుడు ఏకలవ్యుని తనకుడి చేతి బొటనవ్రేలును కోసి ఇమ్మన్నాడు. ఏకలవ్యుడు ఆనందంగా ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా కుడిచేతి బొటనవ్రేలుని ద్రోణునికిచ్చాడు. ఏకలవ్యుడిక మునపటిలా విలువిద్యలో రాణించలేడు. అర్జునుడికి తనమనస్సులోని ఆవేదన తీరిపోయింది.ద్రోణుడు అర్జునుడికిచ్చిన వాగ్దానం కోసం ఏకలవ్యుని అంగుష్టాన్ని గ్రహించాడు. అర్జునుడికి అందరిలోనూ ఉత్తమోత్తముడిగా నిలిచాడు. ద్రోణుడు అతడి ధనుర్విద్యాపాటవానికి ఎంతగానోమెచ్చుకుంటూ, అతడికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు.
(మిగతా…వొచ్చేవారం)