దేశం గర్వించేలా ‘ఖేలో ఇండియా’ నిర్వహించాలి

– యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి
– తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించాలి
– ఖేలో ఇండియా నిర్వహణపై డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను విజయవంతంగా నిర్వహించాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు పిలుపునిచ్చారు. ఖేలో ఇండియా నిర్వహణ రాష్ట్రానికి రావడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, కృషి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడా శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల సమర్థ నిర్వహణకు ప్రతీ అధికారి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిమితులు ఏమిటో ముందుగా అర్థం చేసుకోవాలని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యం వైపు ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. యుద్ధంలో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళిక, సమన్వయం, కార్యాచరణ ఎంత ముఖ్యమో ఖేలో ఇండియా నిర్వహణలోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, వాటిని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు డిప్యూటీ కలెక్టర్లకు అవసరమైన అన్ని అధికారాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. నేటి యువతను రీల్స్, సోషల్ మీడియా నుంచి క్రీడల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న బెట్టింగ్ భూతం నుంచి బయటకు తేవాలని, క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలని పిలుపునిచ్చారు. మణిపూర్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడా సంస్కృతిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా వాతావరణాన్ని పెంపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం, అవకాశాలు కల్పించాలన్నారు. ఖేలో ఇండియా గేమ్స్ క్రీడా పోటీలు మాత్రమే కాక రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక గొప్ప వేదికగా నిలవాలని మంత్రి వాకిటి ఆకాంక్షించారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : శివసేనా రెడ్డి
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. మంత్రి వాకిటి చేసిన కృషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం కారణంగా ఖేలో ఇండియా నిర్వహణ బాధ్యతలు రాష్ట్రానికి దక్కాయన్నారు. డిప్యూటీ కలెక్టర్ల పనితీరును గుర్తించి ఈ కీడా పోటీల నిర్వహణ బాధ్యతలను ముఖ్యమంత్రి వారికి అప్పగించినట్లు తెలిపారు. ప్రతి అధికారి ఈ బాధ్యతను ఒక సవాల్‌గా స్వీకరించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని, పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని, పనుల్లో నాణ్యత, వేగం ఉండేలా చూడాలని ఆదేశించారు.
రూ.203 కోట్లతో నిర్వహణకు ఏర్పాట్లు : స్పెషల్ సీఎస్ వాణీప్రసాద్
ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన క్రీడా వేదికలను సిద్ధం చేస్తున్నామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రూ.203 కోట్లతో ఏర్పాట్లు చేపడుతున్నామని, ఇందులో రూ.120 కోట్లను క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించి పనులు చేపడుతున్నామని వివరించారు. పనుల అమలులో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగేందుకు డిప్యూటీ కలెక్టర్లకు లిస్ట్ ఆఫ్ వర్క్స్, లిస్ట్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ విధానాన్ని అనుసరించాలని తెలిపారు. కోచ్‌లు, క్రీడాకారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అన్ని స్టేడియాలను సిద్ధం చేస్తున్నాం : సోనిబాలాదేవి
ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని స్టేడియాలను సిద్ధం చేస్తున్నామని స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలాదేవి తెలిపారు. ఇప్పటికే 11 స్టేడియాలు సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదు స్టేడియాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి పనికి సంబంధించిన వివరాలు, పురోగతిని ఐఎంఎస్  పోర్టల్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *