దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి

అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత మహిళలు దేవదాసీలుగా, జోగినులుగా, పార్వతు లుగా, జీవితాలను అంకితం చేసే జోగినీ వ్యవస్థ రద్దు, బాల్య వివాహాల వ్యతిరేకత, దళితులలో విద్యా వ్యాప్తి, అసమానత లేని సమాజం కోసం అవిశ్రాంత కృషి చేశాడు. మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందు వులం..’ అని గర్వంగా చాటాడు. అంటరాని వారుగా  దూరంగా ఉంచ బడిన వారిని ‘‘ఆది హిందువులు’’గా భారత దేశంలో తొట్టతొలుత నివసించిన సంతతిగా ఆయన నొక్కి చెప్పాడు. నిజాం పాలిత హైదరాబాద్‌ ‌రాజ్యంలో దళితో ద్యమానికి బాటలు వేసిన ఆ మహానేతనే భాగ్యరెడ్డి వర్మ. హరిజన పదం తెలంగా ణ ప్రాంతంలో వ్యాప్తిలో లేని కాలంలో ఆది హిందువు లుగా, ఆది ఆంధ్రులుగా, ఆది భారతీయులుగా నిమ్నవర్గ ప్రజలు తమను తాము ప్రకటించు కోవాలని కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, మాడపాటి హనుమంతరావుల సహకారంతో  భాగ్యరెడ్డి వర్మ ప్రచారం చేశాడు. భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్‌ ‌సంస్థానానికే పరిమితం కాక, తెలుగు నేలపై పలు ప్రాంతాలకూ విస్తరించాడు. లక్నో, అలహాబాద్‌, ‌కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 – ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్క ర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. హైదరాబాదు సంస్థా నంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్ర మండలి, మన్య సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరా బాదు ప్రాంతంలో సంఘ సంస్కర ణలకై కృషి చేశాడు.మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన జన్మించిన భాగ య్యకు,1888 నవంబరులో వారి కుటుంబ గురువు భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామ కరణం చేశాడు. ఆయన కుల శైవమత గురువు బోధనలు చేసేవారు.

ఆర్యులు హిందూ దేశానికి వలస రాకముందు,  అస్పృశ్యులుగా సమాజంచే ముద్ర వేయబడిన ఆది హిందువులే పాలకులని గురువు వాదం. ‘‘రెడ్డి’’ అన్నది పాలకుడనే అర్థం గల ‘‘రేడు’’ అనే పదం నుంచి ఉద్భవించిందని, అందుచేతనే మాదిరి వెంకయ్యగారి భాగ్యయ్యకు రెడ్డిని జత చేశానని ఆయన చెప్పారు. ఆ తర్వాత 1913లో మాదిరి  భాగ్యరెడ్డి హిందూ సమాజానికి చేసిన అపూర్వ సేవలకు గుర్తింపుగా ఆర్య సమాజ్‌ ‘‘‌వర్మ’’ అనే బిరుదు ప్రదానం చేశారు. ఆనాటి నుండి బాగయ్య భాగ్యరెడ్డిగా మారి, మాదిరి భాగ్యరెడ్డి వర్మగా, ఎం.వి. భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధికెక్కాడు.1913లో ‘ఆర్య సమాజ్‌’ ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ అన్న బిరుదును ప్రధానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందాడు.

భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాల బాలికల విద్య కోసం హైదరాబాదు లోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడు. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910లో  జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాడు.భాగ్యరెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటు చేసి, జగన్మిత్ర మండలి కార్యకలాపాలు మన్య సంఘం ద్వారా కొన సాగించాడు. మన్య సంఘం అంటరాని కులాల ప్రజల్లో చైతన్యం తీసుకు రావటానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు. మన్య సంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్లు రీడింగ్‌ ‌రూములు ఏర్పరచి అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయి. ప్రదానంగా దళిత మహిళను, ఆ తర్వాత వెనకబడిన తరగతులకు చెందిన యువతులను ప్రత్యేకంగా దేవునికి అంకితమిచ్చే కార్యక్రమాలు న్కెజాం రాజ్యం లోని తెలంగాణ, మరట్వాడా, కన్నడ ప్రాంతాల్లో పురోహితులనబడే జంగాలు నిర్వహించేవారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి భాగ్యరెడ్డి వర్మ  దూరదృష్టితో కార్యాచరణ చేపట్టాడు. ఆయన కృషివల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు.

1917లో బెజవాడలో జరిగిన తొలి పంచమ మహా సభకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో ఆయన ప్రసంగానికి ప్రభావితుల్కెన నిర్వాహకులు ‘‘ఆంధ్రదేశ తొలి ఆది ఆంధ్ర మహాసభ’’గా పేరు మార్చారు. తర్వాత 1919లో బందరులో, 1921లో ఏలూరు, భీమవరం, 1925లో అనంతపూర్‌, 1933‌లో నాగపూర్‌, 1938‌లో కాకినాడ తదితర చోట్ల జరిగిన ఆది ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించాడు.1917లో విజయవాడలో ఆంధ్ర పంచమ మహాజన సభలో,   భాగ్యరెడ్డి వర్మ, ఏ హిందూ పురాణేతిహాసాల్లోనూ పంచము లనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్ట మొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి, ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడు. 1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్ర మహా సభలు దాదాపు ప్రతి ఏటా జరిగాయి. అంటరాని వారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండు చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజన సభల ప్రభావంతో 1931 జనాభా లెక్కలలో మాల, మాదిగ, ధేర్‌, ‌చమర్‌ ‌లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా పేర్కొన్నది.1933 కల్లా ఆది – హిందూ సోషల్‌ ‌సర్వీసు లీగు ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభ మయ్యాయి. వీటిలో దాదాపు 2600 మంది విద్యార్థులకు చదువు చెప్పేవారు. భాగ్యరెడ్డి వర్మకు హిందూమతంపై విశ్వాసం లేక  మొదట్లో అర్య సమాజం, బ్రహ్మసమాజం బోధనలను పాటించేవాడు. తర్వాత బౌద్ధం పట్ల ఆకర్షితు డయ్యాడు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపు కొనే వాడు.

తన ఏకైక కుమారునికి గౌతమ్‌ అని పేరు పెట్టుకున్నాడు.1917 డిసెంబర్‌ 15‌వ తేదీన కలకత్తాలో మహాత్మా గాంధీ పాల్గొన్న  ‘‘అఖిల భారత హిందూ సంస్కరణ మహాసభ’’లో భాగ్యరెడ్డి వర్మ కూడా పాల్గొని, అనర్గళంగా, అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా చేసిన  ప్రసంగం గాంధీజీని సైతం ఆకర్షించింది. మరునాట కలకత్తాలో మహాత్మా గాంధీ అధ్యక్షతన మరో సమావేశంలో పాల్గొనడానికి భాగ్య రెడ్డిని ఆహ్వానించి, వేదిక మీదకు తీసుకు రావడానికి తన ప్రైవేట్‌ ‌కార్యదర్శిని పంపి, భాగ్యరెడ్డిని, గాంధీజీ తన ప్రక్కన కూర్చో బెట్టు కోవడాన్ని బట్టి ఆయన పట్ల గాంధీకి ఎంత గౌరవమో స్పష్ట మౌతున్నది. భాగ్యరెడ్డి వర్మ దళితుల నుద్దేశించి…‘దళితులే ఈ దేశపు మూల వాసులు. అవిద్య, అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనకబడి ఉన్నారు’’ అని ఆయన బోధించే వారట. దక్కన్‌లో భాగ్యరెడ్డి వర్మ నిర్మించిన ఆదిజన ఉద్యమం దేశవ్యాపితంగా నడిచిన ఆదిజన మూలవాసీ ఉద్యమానికి అనుసంధాన కర్తగా పనిచేసింది. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్య నగర్‌ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు.అస్పృశ్యతా నివారణకు భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషికి, గుర్తింపుగా హైదరాబాద్‌లోని ఇసామియా బజార్‌ ‌ప్రధాన రోడ్‌కు ‘భాగ్యరెడ్డి వర్మ మార్గ్’ అని నగర పాలక సంస్థ దేశ స్వాతంత్య్రాని కంటే ముందే నామకరణం చేయడం విశేషం. భాగ్య రెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో హైదరా బాదులో మరణించాడు.

 – రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page