- ఏప్రిల్ 14న రానున్న అమిత్ షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం
- చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ?
ప్రజాతంత్ర , హైదరాబాద్ : తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు తెలంగాణ నుంచే పార్టీని బలోపేతం చేసే వ్యూహాన్ని కమలనాథులు అమలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే దక్షిణ భారత దేశంలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్న బీజేపీ అగ్ర నేతలతో పర్యటనలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 14న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారని సమాచారం. అలాగే, ఈనెల చివరి వారంలో యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
ఈనెల చివరి వారంలో గానీ, ఏప్రిల్ •నెల మొదటి వారంలో జనగామలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఏప్రిల్ 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ పాదయాత్రలోనూ అమిత్ షా పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్న అమిత్ షా బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశమయ్యేలా పర్యటనను రూపొందిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారనీ, వచ్చే ఎన్నికలలో గెలుపు అవకాశాలపై జాతీయ నాయకత్వానికి సెంట్రల్ టీం నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్న పార్టీ జాతీయ నాయకత్వం ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా నియోజకవర్గాలలో ప్రత్యేక టీంల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.