కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్‌టిక్కెట్లు ఇవ్వరా
ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28కి వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్ టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ జరిగింది. పదిమంది నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.నిరుద్యోగుల తరఫున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదించారు. నోటిఫికేషన్‌కు.. పరీక్షకు మధ్య 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారన్నారు. ఈ నాలుగు నెలల వ్యవధిలో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని రవిచందర్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారన్నారు.
నిరుద్యోగులు ఈ నాలుగు నెలల వ్యవధిలో అనేక పరీక్షలు రాశారన్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని.. జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించారన్నారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేర్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. పదిమంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి దాదాపు నాలుగు నెలల సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారన్నారు.
పిటిషన్ వేసిన పదిమంది డిఎస్సీ ఎగ్జామ్‌కు అప్లై చేశారా…అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. గ్రూప్ 1 తో పాటు డిఏవో పాటు డీఎస్సీ కి అప్లై చేశారని పిటిషనర్ల తరుఫు న్యాయవాది వెల్లడించారు. డీఎస్సీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. పదిమంది పిటిషన్ వేసి ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్‌ను ఎందుకు సబ్‌మిట్ చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 28కి హైకోర్టు వాయిదా వేసింది. అయితే డీఎస్సీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఆగస్ట్ 5కి ముగియనున్నాయి.