– సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
– దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది
– మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు
– తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రధాని మోదీ ఆలోచన అని వెల్లడి
– అనేకానేక బలిదానాలు చేసి సంపాదించుకున్న స్వాతంత్ర్యం.. విమోచనమే కానీ సమైక్యత కాదన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
– తెలంగాణ చరిత్రను పాతరేసేందుకు.. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిదని వెల్లడి
– కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం
– షోయబుల్లాఖాన్, రాంజీ గోండుల స్మారకంగా..స్పెషల్ పోస్టల్ కవర్ ఆవిష్కరించిన అమిత్ షా
తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న వారిని.. ఇన్నాళ్లు చరిత్రను మరుగుపడేసేందుకు ప్రయత్నించిన వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం రాకుండా స్వతంత్ర్య రాజ్యంగా ఉంటే.. భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్.. తెలంగాణను రజాకార్లనుంచి విముక్తి చేయించేందుకు నడుం బిగించారన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సంస్థాన విమోచనోత్సవాల సందర్భంగా.. జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు వందనాలు, శ్రద్ధాంజలి అర్పించారు.