గందరగోళంగా మారిన వరి కొనుగోలు

వరి కొనుగోలు మరోసారి గందరగోళంలోపడింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదన్నది కేంద్రం ప్రభుత్వాలు పరస్పరం విమర్షించుకోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వరి కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళమే, ఈ వేసవిలో కూడా ఏర్పడనుందని రైతులో భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో మరోసారి చుక్క ఎదురయింది. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌తో రాష్ట్రానికి చెందిన అయిదుగురు మంత్రులు గురువారం జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌చెప్పడం చూస్తుంటే ఈసారి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధాన్యం కొనుగోలు విషయంలో దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండాలని తెలంగాణ డిమాండ్‌ ‌చేస్తున్నది. గత వానకాలం వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య ఏర్పడిన వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం ఏం చెబుతున్నది, రాష్ట్రం ఏమంటున్నది అర్థంకాకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగిన కోల్డ్‌వార్‌లో నలిగింది మాత్రం రైతులే. అసలే వర్షాకాలం కోసి కుప్పలు పెట్టి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో వర్షాల్లో నాని మొలకలొచ్చిన ధాన్యం కొనుగోలుకూడా ఒక సమస్యగా తయారైంది. అడవిలో కుప్ప కావలి కాస్తూ కుప్పలమీదనే ప్రాణాలు వదిలిన సంఘటనలనేకం చోటుచేసుకున్నాయి. అప్పటినుండి ఇప్పుడు వేసవిలొ కోతల సీజన్‌ ‌మొదలయ్యేవరకు ఈ పంచాయితీ తెగడం లేదు.. ఈ సీజన్‌లో వాస్తవంగా కేంద్రం ఏ మేరకు కొనుగోలు చేయనుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు వరి సేకరించనుందన్న విషయంలో జరుగుతున్న చర్చలు సామాన్య రైతులకు ఏమాత్రం అర్థం కాకుండా పోతోంది. కేంద్రంతో వొచ్చిన తగాదా కారణంగా వేసవిలో వరి పంట వేయవొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి హితవు చెప్పింది. కాదని వరి వేస్తే ఉరే అవుతుందని హెచ్చరించింది. దాంతో రైతులు గందరగోళంలో పడ్డారు. సర్కార్‌ ‌చెప్పినట్లు వరివేయకుండా ప్రత్యమ్నాయ పంట వేయడానికి అన్ని భూములు సిద్దంగాలేవు.. అలా అని వరివేస్తే పండిన పంటను అమ్ముకోవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుందన్న భయం మరోపక్క. ఇలాంటి పరిస్థితిలో కొందరు రైతులు ప్రభుత్వ ప్రకటనను అనుసరించి ఈ పంటకాలానికి భూమిని పడావ పెట్టి నష్టపోయారు. ప్రభుత్వం మాట ప్రకారం వరివేయనందుకు తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఇప్పుడు ఆ రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

కాగా, ఏదైతే అది అయిందని మరి కొందరు రైతులు వరి సాగు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం నీటి వనరులను సమకూర్చిన తర్వాతకూడా భూమిని పడావ పెట్టడమెందుకని వరి సాగుచేసిన రైతులు ఇప్పుడు కోతల సమయంలో దిగులు పట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి కొనుగోళ్ళ విషయంలో కొనసాగుతున్న వాదప్రతివాదనలు వారిలో ఆందోళనను కలిగిస్తోంది. ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదని తెలంగాణ సర్కార్‌ అం‌టోంది. వరి కొనుగోలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దపడింది. ఒక విధంగా ఈ విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం దేశమంతటికీ పంటల కొనుగోలు విషయంలో ఒకే విధానాన్ని అవలంభించాలని డిమాండ్‌ ‌చేస్తున్నది. ఆహార ధాన్యాల సేకరణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలంటున్నది. ఎందుకంటే పంజాబ్‌, ‌హరియాణల్లో పండించిన పంటలను ఆసాంతం కొంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మాత్రం అలక్ష్యం చేస్తోంది. ఇది ఒక విధంగా పక్షపాత వైఖరే అవుతుంది. అంతేగాక జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి విఘాతం కలిగించేదిగా ఉందంటోంది తెలంగాణ సర్కార్‌. అం‌దుకు పంజాబ్‌, ‌హర్యానా మాదిరిగానే తెలంగాణలో పండించిన మొత్తం వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌. అవసరమైతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆహార నిపుణులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్రానికి రాష్ట్రం సూచిస్తోంది. అంతేగాక దీనిపై సుదీర్ఘ లేఖలో ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వివరించారు కూడా. అంతటితో ఆగకుండా పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో తమ ఎంపిలతో ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ విషయంలో తమ పోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు రెండు రోజుల క్రితం తమ పార్టీ నేతలతో సమావేశాలు చేర్పాటు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడిన తరహాలో దిల్లీ నుండి గల్లీ వరకు ఉద్యమించాలని ఆయన పార్టీని ఆదేశించారు. గ్రామపంచాయితీ మొదలు, బల్దియా, మండల, జిల్లా పరిషత్తుల్లో తెలంగాణలో పండిన వరి ప్రతీ గింజను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించాలని సూచించారు. ఇంత చేసినా కేంద్రం మాత్రం మొదటినుండి చెబుతున్న మాటనే వల్లె వేస్తున్నది. ఇప్పుడు మరో వారం, పదిరోజుల్లో వరి కోతలకు సిద్ధం కావడంతో ఏ విషయం తేల్చుకునేందుకు మరోసారి అయిదుగురు మంత్రులతో కలిసిన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం దిల్ల్లీకి పంపించింది. కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో మాట్లాడిన రాష్ట్ర మంత్రులు కొత్తగా సాధించింది మాత్రం ఏమీలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పీయూష్‌ ‌గోయల్‌ ‌పేర్కొనడం చూస్తే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగా లేదన్నది స్పష్టమవుతున్నది. తమకు ఇచ్చే ముడి ధాన్యం విషయంలో అన్ని రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నా తెలంగాణరాష్ట్రం మాత్రం ఎన్నిసార్లు అడిగినా ముడి ధాన్యం ఎంత ఇస్తారో చెప్పడంలేదంటూ తెలంగాణపైనే విరుచుకుపడడం కేంద్రం రాష్ట్రానికి ఏమాత్రం అనుకూలంగా లేదన్నది స్పష్టమవుతున్నది. మొత్తానికి యాసంగి పంట కొనుగోలుకూడా ఇప్పుడు గందరగోళంలో పడడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *