బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి
భారతదేశాన్ని సూర్యవంశరాజులూ, చంద్రవంశరాజులూ పరిపాలించారు. యయాతి చంద్రవంశరాజుల్లో ప్రసిద్ధ్ది గాంచినవాడు. దుష్యంతుడు ఈ వంశంలోనే జన్మించినవాడు. భరతుడు, ఆయనకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ వంశానికి చెందిన మరోరాజు హస్తి. ఆయన పేరు మీదనే హస్తినాపురాన్ని నిర్మించాడు. చంద్రవంశంలో మరోరాజు కురురాజు. ఈయన పేరు మీదనే కురువంశం వర్ధిల్లింది. కురువంశీయులు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన గావించారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహోభిషుడనే రాజు వేలకొలది అశ్వమేధ•యాగాలను చేసాడు. వందలకొలదీ రాజసూయ యాగాలను చేసి మహిధార్మికుడిగా పేరు గాంచాడు ఆపైన.. తద్వారా దేవతలకు ప్రీతిపాత్రుడైనాడు. మరణానంతరం దేవలోకాన్ని చేరుకున్నాడు. దేవర్షులతో గలిసి బ్రహ్మను సేవిస్తూఉండగా, ఆ సమయంలో గంగాదేవి స్త్రీ రూపంలో సభకు వచ్చింది.
గాలికి ఆమె ధరించిన వస్త్రం కొంచెం తొలగింది. మిగిలిన వారు ఆ దృశ్యాన్ని చూడకుండా జాగ్రత్తపడ్డారు. కానీ మహాభిషుడు మాత్రం ఎంతో ఇష్టంగా ఆ దృశ్యాన్ని చూడసాగాడు. బ్రహ్మ••ంటపడ్డాడు. ఆయనకు కోపం వచ్చింది. దేవలోకానికి వచ్చి కూడా మనుష్యునిలా ప్రవర్తించాడు గావున మర్త్యలోకాన జన్మించవల్సినదిగా శపించారు. మహాభిషుడు బ్రహ్మను, ప్రతీపుడనే రాజర్షికి పుత్రుడిగా పుట్టేలా వరమివ్వమన్నారు. బ్రహ్మ అందులకు అంగీకరించాడు. మహాభిషుడు ఆ విధంగానే ప్రతీపుని కుమారుడిగా జన్మించాడు. అతని పేరు శంతనుడు. గంగ సభనుండి తిరిగి వస్తూ మహోభిషునే తల్చుకుంటూ వచ్చింది. అతనంటే ఆమెకు అనురాగం కలిగింది.
ఇదిలా వుండగా వసువులనఖడే ఎనిమిదిమంది వశిష్ఠుని దేనువును అపహరించాలని ప్రయత్నించారు. అందుకు వశిష్టుడు కోపించి మనుష్యగర్భంలో జన్మించండని శపించాడు. వారంతా గంగకు విచారవదనాలతో ఎదురుపడ్డారు. ఆమె ఎందుకీ విచారమంటూ అడిగింది. వారు జరిగినదంతా చెప్పారు. వారు గంగను తనకూ శంతనుడిగా జన్మించే మహాభిషునకూ పుత్రులమై జన్మించే విధంగా కోరుకున్నారు. కానీ ఎక్కువ కాలం భూలోకంలో ఉండలేము గనుక, పుట్టగానే తమను నీళ్ళల్లో వేసి చంపమన్నారు.అప్పుడు గంగ తల్లిగా తనకు ఎంతో దుఃఖం కలుగుతుంది గావున ఎనిమిదిమందిలో ఒక్కరైనా చిరంజీవిగా ఉండాలని కోరింది. అందుకు వారు అంగీకరించారు. మా ఒక్కొక్కరి ఆయుర్ధాయంలో ఎక్కువ భాగమును పొంది మాతో చివర జన్మించినవాడు చిరకాలం జీవిస్తాడని చెప్పారు.
(మిగతా…వొచ్చే శనివారం)