- న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదు
- ప్రజల హక్కుల పరిరక్షణకే కట్టుబడి ఉంది
- కొత్త జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన సిజెఐ ఎన్‌వి రమణ
- జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సిఎం కెసిర్ అంగీకారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం రాజ్యాంగ బద్ధంగా నిబద్ధతతో పని చేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణం నుంచి కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి కొన్ని సూచనలు చేస్తున్నానని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్తున్నారని, ఉన్నతస్థాయిలో ఉన్నవారిపై అభాండాలు వేయడం సరికాదన్నారు. న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని చురకలంటించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం రాజ్యాంగబద్ధంగా నిబద్ధతతో పని చేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, వ్యవస్థను చక్కబెట్టుకోలేని కొందరు కోర్టులను తప్పుబట్టడం సరికాదన్నారు. సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని చెప్పారు. పరిధులు దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే అని స్పష్టం చేశారు. పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమని చెప్పారు. నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరం అని సీజేఐ అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్టావ్రతరణ దినోత్సవ శుభాకాంక్షలను హృదయపూర్వంగా తెలుపుతున్నాని చెప్పారు. తెలంగాణను సాధించిన ఉద్యమకారులకు, మేధావులకు, ప్రత్యేకించి న్యాయవాదులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొత్త రాష్ట్రం ఎన్నో సందేహాలు, చర్చల మధ్య ఆవిర్భవించింది. అన్ని సందేహాలను పటాపంచలు అయ్యాయి. రాష్టాభ్రివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధికి కూడా ముఖ్యమని సీఎం కెసిఆర్ గ్రహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎన్వీ రమణ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తాను సంవత్సర కాలం నుంచి భారత ప్రధాన న్యయామూర్తిగా శాయశక్తుల కృషి చేస్తున్నానని తెలిపారు.
న్యాయవ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందని, దాని పట్ల విశ్వాసం కలిగించాలని, అవగాహన పెంచాలని, సమాజంలో ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. తెలియజేశానని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలకు న్యాయ వ్యవస్థ చేరువ ఉండాలనే ఉద్దేశంతో కొత్త కోర్టులను ప్రారంభించుకుంటున్నామని సీజేఐ పేర్కొన్నారు. దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ ఒక కొత్త అధ్యాయానికి తెర తీసింది అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసించారు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణలో కూడా తొలి అడుగు వేయడం శుభ పరిణామం అన్నారు. న్యాయం ప్రజల వద్దకు చేరేలా ఒక అపూర్వ కార్యక్రమానికి సిద్ధమయ్యాను. ఇందుకు తెలుగువాడిగా గౌరవిస్తున్నాను. నేటితో 13 జ్యుడిషీయల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషీయల్ యూనిట్లుగా మారనున్నాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో జిల్లా న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరగడం ఇదే మొదటిసారి. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పరిపాలన సంస్కరణలను తీసుకొచ్చి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాని తర్వాత పెద్ద ఎత్తున తెలుగు రాష్టాల్ల్రో అతి పెద్ద సంస్కరణ ఇవాళ న్యాయవ్యవస్థలో జరిగింది.
ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు వినియోగించుకోవాలని ఎన్వీ రమణ సూచించారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణతో కలిసి తెలంగాణలోని 33 జిల్లాల కోర్టులను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్వీ రమణ గతంలో ఇదే హైకోర్టులో పని చేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ఎన్వీరమణను కోరారని… వెంటనే స్పందించారని తెలిపారు. హైదరాబాద్ పాత జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాలో కోర్టులు వస్తున్నాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కోర్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ములుగు, భూపాలపల్లి రెండు పెద్ద జిల్లాలని.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా సత్ఫాలితాలు వస్తాయని తెలిపారు. జిల్లా కోర్టులు ఏర్పాటు కావాలని చీఫ్ జస్టిస్‌ను అడగగానే ఒప్పుకున్నారు. జిల్లా కోర్టులో అన్ని పోస్టులను భర్తీ చేస్తాం. సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టులు విభజించాలి. జుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు.